Home తాజా వార్తలు పెట్టుబడులకు హైదరాబాద్

పెట్టుబడులకు హైదరాబాద్

ktr

పెట్టుబడులకు హైదరాబాద్ అన్ని విధాలా అనువైన నగరం
సిఐఐ సదస్సులో మంత్రి కెటిఆర్

మన తెలంగాణ / హైదరాబాద్: భారతదేశంలో భౌగోళికంగా కేంద్ర స్థానంలో ఉన్న హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు అన్ని విధాలుగా అనువుగా ఉంటుందని పరిశ్రమలు, ఐటిశాఖ మంత్రి కె.టి.రామారావు అన్నారు. దేశంలోని ఏ చోటుకైనా, ప్రపంచంలో ఏ దేశానికైనా ఇక్కడి నుండి వెళ్ళడం చాలా సులభమని పేర్కొన్నారు. తెలంగాణలో ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌లు ఏర్పాటు చేసుకుంటే రవాణా సబ్సిడీ ఇస్తామని ప్రకటించారు. సిఐఐ దక్షిణాది ప్రాంత కౌన్సిల్ సమావేశం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషితో పాటు పారిశ్రామికవేత్తలు పెద్ద సంఖ్యలో హాజరు కాగా, కెటిఆర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సిఐఐ కౌన్సిల్ సమావేశాలు కూడా రాష్ట్రానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నా రు. బెంగళూరు మాదిరిగా మౌలిక సదుపాయాల సమస్య, చెన్నైలో వరదలు, ఢిల్లీలో పొగ మంచు, ముంబైలో మాదిరిగా భగ్గుమనే రియల్ ఎస్టేట్ ధరలు హైదరాబాద్‌లో లేవని చెప్పారు. వరుసగా నాలుగేళ్ళుగా జీవించేందుకు అనువైన నగరంగా హైదరాబాద్ ఎంపికవుతూ వస్తోందని, కాబట్టి వ్యాపారం చేసుకునేందుకు దేశంలోనే అత్యుత్తమ నగరమిది అని చెప్పారు. తెలంగాణలో రోడ్డు, రైలు రవాణా వ్యవస్థ బాగుంటుందని, త్వరలో ఐదు విమానాశ్రయాల ఏర్పాటుకు చొరవ తీసుకుంటున్నామన్నారు. దురదృష్టవశాతు ఓడ రేవు లేదని, దానిని పూడ్చుకునేందుకు త్వరలో డ్రై పోర్టును కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఆటోమొబైల్ తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తే, ఓడ రేవు వరకు ముడి సరకు, ఉత్పత్తుల తరలింపునకు అయ్యే ఎగుమతి, దిగుమతి రవాణా ఖర్చులు సబ్సిడీగా ఇస్తామన్నారు. వ్యవసాయం, నీటిపారుదల రంగంలో గణనీయమైన అభివృద్ధి కారణంగా త్వరలో మిగులు ఉత్పత్తి సాధించబోతున్నామని, దీనిని అధిగమించేందుకు ప్రతి నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌లు ఏర్పాటు చేయనున్నామన్నారు. వివిధ రకాల ఏజెన్సీల ర్యాంకింగ్‌లో తెలంగాణ నిత్యం ముందుంటోందని, ఇటీవల ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరీ రంగన్ నేతృత్వంలోని పబ్లిక్ అఫైర్స్, ఇండస్ట్రీస్ ఇచ్చిన ర్యాంకింగ్‌లలో మూడవ స్థానం లభించడం గర్వంగా ఉన్నదన్నారు. భూకంపాలు, సునామీలు ఇక్కడ రావని, దక్కన్ పీఠభూమిలో ఉండడమే ఇందుకు కారణమని వివరించారు. కేంద్ర ప్రభుత్వ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్‌లో ఇటీవల వరకు మొదటిస్థానంలో ఉన్నామని, తాజా ర్యాంకింగ్‌లో కేవలం 0.9 శాతంతో రెండవస్థానంలో నిలిచామనిన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం టిఎస్ ఐపాస్ ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించామని పరిశ్రమలు,ఐటి శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు. మూడేళ్లలో ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీగా ఉపాధి కల్పించామని, ఫార్మా, మెడికల్ డివైజెస్ పార్కులు, ఏరోస్పేస్, డిఫెన్స్, ఎంఎస్‌ఎంఈ, టెక్స్‌టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ లాంటి పారిశ్రామిక పార్కులు రాష్ట్రంలోకి అడుగుపెట్టాయని తెలిపారు. ఐటి రంగంలో హైదరాబాద్ దేశంలోనే రెండో స్థానాన్ని దక్కించుకున్నదన్నారు. జాతీయ సగటు 9 శాతం ఉండగా, తెలంగాణలో 13 శాతంగా నమోదైందని చెప్పారు. తమ ప్రభుత్వం వ్యవసాయం, పారిశ్రామిక , మౌళిక సదుపాయల కల్పన రంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు.
మిషన్ భగీరథ పథకంలో భాగంగా కోటి ఆవాసాలకు ఇంటింటికీ తాగునీటిను అందించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తోందని, వచ్చే రెండు మూడు నెలల్లోనే నీటిని అందిస్తామన్నారు. 14 వేల కిలోమీటర్ల పొడవునా భగీరథ పనుల కోసం రూ. 50 వేల కోట్లను వెచ్చిస్తున్నామన్నారు. ఇంటింటికీ ఇంటర్ నెట్ పథకం టి – ఫైబర్ ప్రాజెక్టు కూడా ఇందులో అంతర్బాగంగానే ఉండనుందని వివరించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచనలు, విజన్‌కు అనుగుణంగా రాష్ట్రాన్ని పారిశ్రామిక రంగంలో అభివృద్ధి పరుస్తున్నామన్నారు. రైతు బంధు, పెట్టుబడి సాయం పథకాలను రాష్ట్ర వ్యాప్తంగా 58 లక్షల భూ యజమానులకు అమలు చేస్తున్నామన్నారు. కేవలం వంద రోజుల్లోనే 95 శాతం వరకు గ్రామీణ భూ రికార్డులను ప్రక్షాళన చేసినట్లు తెలిపారు. ఈ పథకాన్ని చాలా మంది ఆర్థిక వేత్తలు ప్రశంసించగా, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని అనుసరించాలని భావిస్తోందన్నారు. ఇప్పటికే తమ ప్రభుత్వం ఈ పథకాల కోసం రూ.12,000 కోట్లను బడ్జెట్‌లో కేటాయించినట్లు తెలిపారు. 18 నుండి 60 ఏళ్ల వయస్సు మధ్యన ఉన్న అన్నదాతలకు రైతు భీమా పథకాన్ని ఆగస్ట్ 15 నుండి అమలు చేయనున్నామని, ఇప్పటికే ప్రీమియాన్ని చెల్లించినట్లు వివరించారు. ఒక వేళ రైతులు ప్రమాదవ శాత్తూ గానీ, సహజంగా గానీ మరణిస్తే పది రోజుల్లోనే వారి కుటుంబాలకు బీమా కింద రూ. 5 లక్షలు వచ్చేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. మిషన్ కాకతీయ కింద 46వేల చెరువులకు గాను 30 వేల చెరువులకు పునర్దుధరణ పనులు చేపట్టామని తెలిపారు. పట్ణణ ప్రాంతాల్లోని చెరువుల పునరుద్ధరణకు ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు ముందుకు రావాలని మంత్రి కెటిఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా ఐదేళ్లలో 250 కోట్ల మొక్కలను నాటాలని ప్రభుత్వం లక్షంగా నిర్దేశించుకుందన్నారు. గడచిన మూడేళ్లలోనే 80 కోట్ల మొక్కలను నాటినట్లు వివరించారు. వచ్చే రెండేళ్లలో లక్షాలకు అనుగుణంగా ఉద్యమంగా మొక్కలను నాటుతా మన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న విద్యుత్ కోతలు ఇప్పుడు లేకుండా చేశామని, ఇప్పుడు 24 గంటలూ నిరంతర విద్యుత్ ఇస్తూ పవర్ సర్‌ప్లస్ స్టేట్‌గా మార్చామని అన్నారు. పరిశ్రమలకే కాకుండా, గృహావసరాలు, వ్యవసాయానికి కూడా 24 గంటల విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామన్నారు. రైతులకు ఉచితంగానే విద్యుత్‌నుసరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ ఇప్పటికే దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందన్నారు. సంక్షేమ పథకాలను అందించడంలో దేశ వ్యాప్తంగా ముందున్న రాష్ట్రాల వివరాలను తెలుసుకుంటున్నామని, అలాంటి పథకాలు తెలంగాణలోనూ అమలు చేసేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్‌కె. జోషి మాట్లాడుతూ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళిలను రూపొందించి తమకు దిశా నిర్ధేశం చేసిందన్నారు. ప్రజల భద్రతలో కీలకంగా ఉండే పోలీసులకు అధునాతన వాహనాలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచేందుకు అమలు చేస్తున్న కెసిఆర్ కిట్ పథకం వంటి అంశాలను ప్రస్తావించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిఐఐ దక్షిణాది ప్రాంత ఛైర్మన్ ఆర్ దినేష్ తదితరులు పాల్గొన్నారు.