Home తాజా వార్తలు గూగుల్ పే పట్టిచ్చిన గొలుసు దొంగలు

గూగుల్ పే పట్టిచ్చిన గొలుసు దొంగలు

Chain Snatchersహైదరాబాద్ నగర శివారులో హడలెత్తించిన చైన్ శ్నాచర్లను పట్టుకున్న పోలీసులు, బంగారు ఆభరణాలు, కెటిఎమ్ బైక్ స్వాధీనం, హైదరాబాద్‌లో వివిధ లాడ్జీల్లో,  బస చేసిన ఉత్తరాది ముఠా

మన తెలంగాణ/హైదరాబాద్ సిటీబ్యూరో: వరుస చైన్‌స్నాచింగ్‌లు చేసి రాచకొండ పోలీసులను పరుగులు పెట్టించిన ముగ్గురు సభ్యుల అంతరాష్ట్ర దొంగల ముఠాను టాస్క్‌ఫోర్స్, భవానీ నగర్ పోలీసులు, రాచకొండ ఎస్‌ఓటి సిబ్బంది అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి బంగారు ఆభరణాలు, కెటిఎం, బజాజ్ పల్సర్ బైక్, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడా, పిఎస్ సెక్టార్49, గౌతంబుద్ధా నగర్, సెక్టార్115, సోర్‌కాకు చెందిన మను వాల్మికి అలియాస్ రాహుల్ అలియాస్ గుడువా అలియాస్ మోను పందుల పెంపకం చేస్తున్నాడు. ఉత్తరప్రదేశ్, బులంద్‌శేహర్, పిఎస్ గజ్‌రోలా, మనికి మదయాకు చెందిన ఆటో డ్రైవర్ చోకా, నగరంలోని వనస్థలిపురం, సాహెబ్ నగర్‌కు చెందిన చింతమల్ల ప్రణీత్ చౌదరి నగరంలోని కొత్తపేట, మోహన్ నగర్‌లో ఉంటున్నాడు. ప్రణీత్ చౌదరి గతంలో దొంగతనాలు చేశాడు.

ఇంజనీరింగ్ మధ్యలో ఆపివేసి ఇంగ్లండులో బిబిఎం చేశాడు. అక్కడ ఇమ్మిగ్రేషన్ నిబంధనలు ఉల్లంఘించడంతో ఢిల్లీకి వచ్చి స్థిరపడ్డాడు. అక్కడ ఉన్న ఐదు నెలల్లో క్రిమినల్ గ్యాంగ్‌లతో పరిచయాలు ఏర్పడ్డాయి. హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత సరూర్‌నగర్, ఉప్పల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 201415లో మూడు చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత నోయిడాకు షిఫ్ట్ అయి అక్కడ దొంగతనాలు చేయడంతో జైలుకు పంపించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత హైదరాబాద్‌లో దొంగతనాలకు పాల్పడాలని పధకం రచించారు. మోను వాల్మికి అంతరాష్ట్ర దొంగ పలు రాష్ట్రల్లో దొంగతనాలు, దోపిడీలకు పాల్పడడంతో 40 కేసులు నమోదయ్యాయి. చోకా కూడా అంతరాష్ట్ర దొంగ, వివిధ రాష్ట్రల్లో చైన్ స్నాచింగ్‌కు పాల్పడడంతో 40 కేసులు నమోదయ్యాయి. ప్రణీత్ చౌదరికి వసస్థలిపురం ప్రాంతంపై పూర్తిగా పట్టు ఉండడంతో ప్రణాళిక రచించి సులభంగా దొంగతనాలు చేశారు.

ఐదు రోజుల ముందు నగరానికి వచ్చిన దొంగలు వివిధ లాడ్జిల్లో ఉన్నారు. మలక్‌పేటలో సోఫియాన్ వద్ద కెటిఎం బైక్‌ను అద్దెకు తీసుకున్నారు. ముగ్గురు వనస్థలిపురం, హయత్‌నగర్, మీర్‌పేట, ఎల్‌బి నగర్ దాని పరిసర ప్రాంతాల్లో తిరిగి పరిసరాలను పరిశీలించారు. గత ఏడాది డిసెంబర్ 26, 27వ తేదీల్లో చోకా, మోను వాల్మి కలిసి 11 చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. 15గంటల వ్యవధిలోనే 11 చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడ్డారు, 26వ తేదీన నాలుగు గంటల్లో ఆరు, 27వ తేదీన గంట వ్యవధిలో ఐదు చైన్‌స్నాచింగ్‌లు చేశారు. సులభంగా తప్పించుకుపోయేందుకు వీలుగా మేయిన్ రోడ్డుకు సమీపంలోనే చైన్‌స్నాచింగ్‌లు చేశారు. ప్రణీత్ చైన్‌స్నాచింగ్‌లో పాల్గొనకుండా వారికి నేతృత్వం వహించాడు. సిసిటివిల్లో కన్పిస్తే పోలీసులకు దొరుకుతామని, చోకా, మోను వాల్మికి సమన్వయం చేశాడు. చైన్ స్నాచింగ్‌లు చేసిన తర్వాత ప్రణీత్ కాచీగూడలోని ఓ లాడ్జిలో వారి వద్ద నుంచి బంగారు ఆభరణాలు తీసుకున్నాడు. మీడియాలో బైక్‌కు సంబంధించిన ఫోటోలు రావడంతో తలాబ్‌కట్ట వద్ద బైక్‌ను వదిలేశామని నిందితులు తెలిపారు.

గూగుల్ పే పట్టించింది

ప్రణీత్, మోను వాల్మీకి, చోకా నగరంలోని లాడ్జిలో ఐదురోజులు బసచేశారు. ఓ లాడ్జిలో ప్రణీత్ గూగుల్ పే ద్వారా బిల్లు చెల్లించడంతో పోలీసులకు పట్టుబడ్డారు. మోను, చోకా అనుమోల్ హోటల్, ఎడిబజార్ నుంచి పల్సర్ బైక్‌పై వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

120 టీములు

చైన్‌స్నాచింగ్ నిందితులను పట్టుకునేందుకు నగర పోలీసులు 120టీములను ఏర్పాటు చేసింది. సౌత్ జోన్, ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ టీములు, భవానీ నగర్ పోలీసులు, ఎస్‌ఓటి రాచకొండ పోలీసులు ఉమ్మడిగా విచారణ చేసి పట్టుకున్నారు. 600 సిసిటివి ఫుటేజ్‌లను పరిశీలించారు. బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, లాడ్జిల్లో తనిఖీలు చేశారు. ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీల్లో తనిఖీ చేశారు. నోయిడా, న్యూఢిల్లీ పోలీసులను కూడా సంప్రదించారు. నిందితుల ప్రాంతాలైన నోయిడా, ఉత్తరప్రదేశ్‌ను సందర్శించారు.

మరిన్ని సిసిటివిలు ఏర్పాటు చేస్తాం

నగరంలో మరిన్ని సిసిటివిలు ఏర్పాటు చేస్తామని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. సిబ్బందికి శిక్షణ ఇచ్చి వారి సామర్థాన్ని పెంచుతామని అన్నారు. సైంటిఫిక్ విధానంలో సాక్షాలను సేకరించి శిక్షపడేవిధంగా చూస్తామని అన్నారు. నిందితులపై పిడి యాక్ట్ పెట్టేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. సౌత్‌జోన్ డిసిపి అంబర్‌కిషోర్ ఝూ, టాస్క్‌ఫోర్స్ అదనపు కమిషనర్ చైతన్య కుమార్, భవానీ నగర్, టాస్క్‌ఫోర్స్ హైదరాబాద్, ఇన్స్‌స్పెక్టర్స్ మధుమోహన్ రెడ్డి, శ్రీనివాస్, ఎస్‌ఓటి రాచకొండ సిబ్బంది కేసు దర్యాప్తు చేశారు.

Hyderabad Police Arrested Three Chain Snatchers