Home తాజా వార్తలు జలమండలిలో ఔట్‌సోర్సింగ్ నియామకాలు

జలమండలిలో ఔట్‌సోర్సింగ్ నియామకాలు

Water Boardమూడు నెలల్లో 150 మందికి అవకాశాలు
లైన్‌మెన్ పోస్టుకు బీటెక్ అభ్యర్థ్ధులు
జూన్‌లో 153 మంది ఉద్యోగులు పదవీ విరమణ

మన తెలంగాణ/సిటీబ్యూరో : హైదరాబాద్ మెట్రోపాలిటన్ మంచినీటి సరఫరా మరియు ముగరునీటి పారుదల మండలి (జలమండలి)లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల నియమాకాల జోరు కొనసాగుతుంది. ఇప్పటికే లెక్కకు మించిన సంఖ్యలో ఔట్‌సోర్సింగ్ సిబ్బంది కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. వాస్త వానికి బోర్డులో ఔట్‌సోర్సింగ్ పద్ధతిపై ఎంత మంది ఉద్యో గులు విధులను నిర్వహిస్తున్నారన్న అంశంపై జల మండలి విజిలెన్స్ విభాగం మల్లగుల్లాలుపడుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ శివారు గ్రామ ప్రజలకు తాగునీటిని సరఫరా చేసే క్రమంలో లైన్‌మెన్ల నియమాకాన్ని చేపట్టింది. అది కూడా ఔట్‌సోర్సింగ్ విధానం లో చేపడు తున్నట్టు తెలుస్తుంది. నీటి సరఫరా వ్యవస్ధ నగర స్ధాయి నుంచి గ్రేటర్ హైదరాబాద్ మహానగర స్ధాయికి విస్తరించిన నేపథ్యంలో అధికారులు, ఉద్యోగులతో పాటు క్షేత్ర స్థ్ధాయి సిబ్బంది నియామకం చాలా అవసరం. అయితే ప్రభుత్వం మంజూరు చేసిన పర్మినెంట్ పోస్టుల భర్తీకి అధికారులు ఉదాసీనవైఖరిని అవలంభిస్తున్నారని పలువురు బోర్డు ఉద్యోగులు వాపోతున్నారు.

గుట్టంతా ఔట్‌సోర్సింగ్ వద్దే..

జలమండలి కార్యకలాపాలు, నిర్వాహణ తీరు తెన్నులకు సంబంధించిన సమగ్ర సమాచారం ఔట్‌సోర్సింగ్ సిబ్బంది వద్దే లభ్యమతుందన్న వ్యాఖ్యలు వినవస్తున్నాయి. బోర్డు డైరెక్టర్ల దగ్గర నుంచి జనరల్ మేనేజరు, డీజీఎం స్ధాయి అధికారులకు పరిపాలన సౌలభ్యం కోసం డీఏఓ, డీపీఓ పోస్టులను కేటాయించింది. ప్రస్తుతం వాటరు బోర్డు పాలన పూర్తిగా ఆన్‌లైన్ విధానం లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగానే డేటా ఎంట్రీ ఆఫీసరు (డీఏఓ), డేటా ప్రాసెస్సింగ్ ఆఫీసర్(డిపీఓ)లను నియమించింది. అయితే ఈ పోస్టులలో కూడా చాలా వరకు ఔట్‌సోర్సింగ్ విధానంలో ఉద్యోగులను భర్తీ చేశారు. అది కూడా అధికారుల బంధుగణానికి సంబంధించిన వారే ఎక్కువగా ఉన్న విమర్శ లేకపోలేదు.

నిన్న మొన్నటి వరకు ఉన్నతాధికారుల యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వీరి చేతుల్లోనే ఉండేవి. ఆయా అధికారులకు కంప్యూటర్ పట్ల అంతగా అవగాహన లేకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. అయితే బోర్డులో వెలుగుచూసిన పలు అవినీతి అక్రమాల నేపథ్యంలో చాలా వరకు ఉన్నతా ధికారులు తమ తమ యూజర్ ఐడీ, పాస్ వర్డ్‌తో సహా మార్చేసినట్టు తెలుస్తుంది. ఏదిఏమైనా బోర్డును ఔట్‌సోర్సింగ్ కబంధ హస్తాల నుంచి బయటపడేందుకు ఉన్నతాధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఔట్‌సోర్సింగ్ సిబ్బందే ఆధారం..

గ్రేటర్ పరిధిలో ప్రతిష్టాత్మకంగా మంచినీటిని సరఫరా చేస్తున్న జలమండలికి ఔట్‌సోర్సింగ్ సిబ్బందే ఆధారమన్నట్టుగా తయారైంది. ఇప్పటికే ఉన్నతాధికారుల పేషీల మొదలు క్షేత్ర స్థాయి వరకు అన్ని విభాగాలలోనూ ఔట్‌సోర్సింగ్ సిబ్బందే సోర్సు అన్న చందంగా ఉంది. ఓ అండ్ ఎం విభాగంలోనే కాదు ప్రాజెక్టులలో, ట్రాన్స్‌మిషన్, కృష్ణా, గోదావరి రిజర్వాయర్ల వద్ద కూడా ఔట్‌సోర్సింగ్ సిబ్బంది విధులను నిర్వహిస్తున్నారు. అంతేందుకు బోర్డుకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న నీటి వినియోగం రీడింగ్ నిర్వాహణలో కూడా ఔట్‌సోర్సు ఉద్యోగుల పాత్ర కీలకంగా ఉంది.

ఈ క్రమంలో ఇటీవల విస్తరించిన డివిజన్‌లలో ఔట్‌సోర్సింగ్ పద్ధతి పైనే ఉద్యోగుల నియామకాలు చేపడుతున్నారు. వాస్తవానికి జనరల్ పర్పస్ ఉద్యోగుల ఖాళీ పోస్టులు దాదాపుగా 400 వరకు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఔట్‌సోర్సింగ్ పద్ధతిపై నియమిం చుకోవాల్సిన అవసరం బోర్డుకు లేదు. కానీ అధికారులు మాత్రం కేవలం ఆ పద్ధతిలోనే సిబ్బందిని నియమించుకుంటున్న పరిస్థితి.

భర్తీ చేయాల్సిన పోస్టులు ఇవి..

గ్రేటర్ ప్రజల దాహార్తిని తీరుస్తున్న జలమండలి ఉద్యోగులపై పనిభారం లేకుండా చేయాలన్న కృతనిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం 692 పోస్టులను మంజూరు చేసింది. 2018 ఆగస్టు 1వ తేదీన జీవో ఎంఎస్ నెం. 111 ఉత్తర్వులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ జారీ చేసింది. ఈ మేరకు ఖాళీ పోస్టుల భర్తీ ప్రక్రియను త్వరిగతిన చేపట్టాలని జలమండలి ఎం. దానకిషోర్ సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కానీ ఆ దిశగా ఇంత వరకు ఎలాంటి ప్రయత్నాలు మాత్రం జరగలేదు. గతంలో చేపట్టిన నియమకాల్లో ఖాళీగా ఉన్న మేనేజరు పోస్టుల భర్తీకి మాత్రం ఇటీవల తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్‌కు లేఖ రాసినట్టు తెలుస్తుంది.

అయితే రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన పోస్టులను పరిశీలిస్తే.. డైరెక్టర్ పోస్టులు 2, చీఫ్ జనరల్ మేనేజరు పోస్టులు 2, జనరల్ మేనేజరు (ఇంజనీరు) పోస్టులు 10,జనరల్ మేనేజరు(పిఅండ్‌ఏ) 1, డిప్యూటీ జనరల్ మేనేజరు(ఇ) పోస్టులు 20, డిప్యూటీ జనరల్ మేనేజరు(క్యూఏటీ) పోస్టులు 02, డిప్యూటీ జనరల్ మేనేజరు(పిఅండ్‌ఏ) 03, మేనేజరు(ఇ) పోస్టులు 80, సీనియర్ ఆఫీసరు(పిఅండ్‌ఏ)పోస్టులు 08, ఆఫీసరు (పిఅండ్‌ఏ) పోస్టులు 09, సీనియర్ గ్రేడ్ అసిస్టెంట్(పిఅండ్‌ఏ) పోస్టులు 20, అసిస్టెంట్ (పిఅండ్‌ఏ) పోస్టులు 20, అసిస్టెంట్ (ఎఫ్ అండ్‌ఏ) పోస్టులు 15, టెక్నీషియన్ గ్రేట్..2 (వాటర్ సప్లయి) (సివిల్) పోస్టులు 100, జనరల్ పర్పస్ ఉద్యోగులు (నీటి సరఫరా) 200 , జనరల్ పర్పస్ ఉద్యోగులు (సేవరేజ్) 200ల చొప్పున ఉద్యోగ నియామకాలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

hyderabad water board recruitment 2019