Thursday, March 28, 2024

బిజెపిలో చేరడం లేదు: సచిన్ పైలట్

- Advertisement -
- Advertisement -

I Am not joining BJP Says Sachin Pilot

 

న్యూఢిల్లీ: తాను బిజెపిలో చేరడం లేదని కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ బుధవారం ప్రకటించారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకే తాను బిజెపిలో చేరుతున్నట్లు రాజస్థాన్‌లోని కొందరు నాయకులు వదంతులు పుట్టిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. రాజస్థాన్‌లో బిజెపిని ఓడించి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తాను ఎంతో శ్రమించానని బుధవారం నాడిక్కడ ఆయన అన్నారు. రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి పదవి, పిసిసి అధ్యక్ష పదవి నుంచి బర్తరఫ్‌కు గురైన సచిన్ పైలట్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ రాజస్థాన్‌లోని కొందరు నాయకులు తాను బిజెపిలో చేరుతున్నట్లు వదంతులు పుట్టిస్తున్నారని, అయితే తాను బిజెపిలో చేరే ప్రసక్తి లేదని విస్పష్టంగా చెబుతున్నానని ఆయన అన్నారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఇటువంటి వదంతులు సృష్టిస్తున్నారని ఆయన చెప్పారు.

సచిన్, మరో 18 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు
కాంగ్రెస్ పార్టీకి చెందిన 19 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ ఆ పార్టీ ఇచ్చిన పిటిషన్‌పై రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ వారికి నోటీసులు జారీచేశారు. బర్తరఫ్‌కు గురైన ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్, మరో 18 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు శుక్రవారం లోగా తన నోటీసులకు సమాధానం ఇవ్వాలని స్పీకర్ సిపి జోషి ఆదేశించారు. సచిన్ పైలట్‌తోసహా 19 మంది ఎమ్మెల్యేలకు మంగళవారం నోటీసులు జారీచేసినట్లు స్పీకర్ జోషి బుధవారం తెలిపారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ మేరకు తిరుగుబాటు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజస్థాన్ అసెంబ్లీలోని కాంగ్రెస్ చీఫ్ విప్ మహేష్ జోషి రాసిన లేఖను పురస్కరించుకుని స్పీకర్ ఈ నోటీసులు జారీచేసినట్లు వర్గాలు తెలిపాయి.

తిరుగుబాటు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించడంపై తమ వాదనకు బలం చేకూర్చే సుప్రీంకోర్టు గత తీర్పులను కూడా కాంఎగ్రస్ చీఫ్ ఉదహరించారు. సచిన్ పైలట్‌తోపాటు బర్తరఫ్‌కు గురైన మంత్రులు విశ్వేంద్ర సింగ్, రమేశ్ మీనా, మరో 16 మంది ఎమ్మెల్యేలపై చీఫ్ విప్ ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ ప్రయోజనాలను దెబ్బతీసేరీతిలో ఉద్దేశపూర్వకంగానే ఈ తిరుగుబాటు ఎమ్మెల్యేలు కుట్ర పన్నారని చీఫ్ విప్ ఆరోపించారు. సోమవారం జరిగిన సిఎల్‌పి సమావేశానికి వీరు ఉద్దేశపూర్వకంగానే గైర్హాజరయ్యారని, మరుసటి రోజు రెండవసారి జరిగిన సమావేశానికి కూడా వీరు రాలేదని చీఫ్ విప్ ఆరోపించారు.

I Am not joining BJP Says Sachin Pilot
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News