Home Default మా అమ్మకు నచ్చిన సినిమా చేసినందుకు గర్వంగా ఉంది: జయ.బి

మా అమ్మకు నచ్చిన సినిమా చేసినందుకు గర్వంగా ఉంది: జయ.బి

Vaishakam

జయ.బి దర్శకత్వంలో ఆర్.జె. సినిమాస్ బ్యానర్‌పై హరీష్, అవంతిక జంటగా బి.ఎ.రాజు నిర్మించిన చిత్రం ‘వైశాఖం’. ఈ చిత్రం తాజాగా విడుదలై సూపర్ హిట్ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సినిమా యూనిట్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ “వైశాఖం వంటి మంచి సినిమాను తీశామని అందరూ ప్రశంసిస్తున్నారు. కథపై నమ్మకంతో కొత్త హీరో,హీరోయిన్‌లతో చేసిన సినిమా ఇది. మానవీయ విలువలు తగ్గిపోతున్న ఈ రోజుల్లో వాటిని గుర్తుచేసేలా ఈ సినిమా చేశాం. నిజ జీవితంలో జరిగిన ఘటనను ఆధారంగా చేసుకొని దర్శకురాలు జయ ఈ సినిమాను రూపొందించారు. సినిమాలో హీరో హీరోయిన్‌ల పర్‌ఫార్మెన్స్‌కు చాలా మంచి స్పందన వస్తోంది. హీరో హరీష్‌తో నెక్స్ మూవీ కూడా చేయబోతున్నాం”అని అన్నారు. దర్శకురాలు జయ.బి మాట్లాడుతూ “వైశాఖం సినిమా విడుదలైన అన్ని సెంటర్లలో హిట్ టాక్‌తో రన్ అవుతోంది. అమెరికా నుండి కూడా సినిమాకు మంచి టాక్ వచ్చింది. క్లాస్, మాస్ ప్రేక్షకులు అందరినీ మెప్పించే సినిమాగా మన్ననలు పొందింది. నా నిజ జీవితంలో జరిగిన ఘటనను ఆధారంగా చేసుకొని ఈ సినిమా చేశాను. మా నాన్న చనిపోయినప్పుడు అప్పటి పరిస్థితుల్లో నేను ఎదుర్కొన్న మానసిక సంఘర్షణతో కథను తయారుచేసుకున్నాను. సినిమా చూసిన మా అమ్మ, మా కుటుంబ సభ్యులంతా ఎంతగానో మెచ్చుకున్నారు. ఓ కూతురిగా మా అమ్మకు నచ్చిన సినిమా చేసినందుకు గర్వంగా ఉంది”అని తెలిపారు. హీరో హరీష్ మాట్లాడుతూ “వైశాఖం సినిమా జర్నీలో సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్. సినిమాను జయ, బి.ఎ.రాజు చాల పెద్ద స్కేల్‌లో తీశారు. వీరిద్దరి కారణంగా హీరోగా నాకు మంచి గుర్తింపు వచ్చింది. వీరితో మరో సినిమా చేయడానికి కూడా నేను సిద్ధమే”అని చెప్పారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ అవంతిక, వాలిశెట్టి సుబ్బారావు, డి.జె.వసంత్ పాల్గొన్నారు.