Home ఎడిటోరియల్ జాత్యహంకారంపై జనాగ్రహం

జాత్యహంకారంపై జనాగ్రహం

I Can't Breathe Mass Protests at White House

 

అమెరికా మరోసారి నల్లజాతివారి నిరసనాగ్ని జ్వాలల్లో మాడిమసి అవుతున్నది. మిన్నెసొట్టా రాష్ట్రంలోని మినియా పొలిస్ నగరంలో ఆరు రోజుల క్రితం ఒక తెల్లజాతి పోలీసు అధికారి నట్ట నడి రోడ్డున 46 ఏళ్ల జార్జి ఫ్లాయిడ్ అనే ఆఫ్రికన్ అమెరికన్ నల్లజాతీయుడి మెడ మీద మోకాలితో తొక్కి ఊపిరి ఆడకుండా చేసి చంపేసిన దారుణ ఉదంతం కొన్ని దశాబ్దాల తర్వాత తొలి సారిగా అగ్ర రాజ్యాన్ని జనాగ్రహ మంటల్లోకి తోసి వేసింది. ‘ఊపిరి ఆడడం లేదు’ అంటూ ఫ్లాయిడ్ మొరపెట్టుకున్నా వినకుండా అతడిని అంతం చేసిన తెల్ల అధికారి జాత్యహంకారం విడియో వైరల్ కావడంతో దేశమంతటా నల్లవారు కుతకుత ఉడికిపోయి వీధుల్లోకి వచ్చి పలు నగరాల్లో ఆరు రోజులుగా సృష్టిస్తున్న బీభత్స విధ్వంసకాండ చెప్పనలవికానిది. ఉద్రిక్తత సెగలు దేశాధ్యక్షుడి అధికార భవనం వైట్ హౌస్‌ను కూడా తాకడంతో డోనాల్డ్ ట్రంప్‌ను సురక్షిత స్థలానికి (బంకర్) చేర్చారని వార్తలు చెబుతున్నాయి.

అప్పుడెప్పుడో ఆత్మాహుతి దళ ఉగ్రవాదులు జంట ప్రాసాదాల్లోకి విమానాల్లో చొచ్చుకు వెళ్లి కూల్చేసినప్పుడు మాత్రమే అధ్యక్షుడు రహస్య ప్రదేశంలో దాక్కోవలసి వచ్చింది.అటువంటి స్థితి మళ్లీ ఏర్పడిందంటే నల్లవారి ఆగ్రహం ఎంతగా కట్టలు తెంచుకున్నదో దాని ముందు అమెరికన్ పోలీసు వ్యవస్థ ఎలా ఎందుకూ పనికి రాకుండా పోతున్నదో అర్థం చేసుకోవచ్చు. బిల్లుకు దొంగ నోటు చెల్లించిన అతి చిన్న నేరానికి ఫ్లాయిడ్‌ను మెడ తొక్కి హతమార్చడం కేవలం అతడు నల్ల జాతి వ్యక్తి కావడం వల్లనే సంభవించింది. అన్యాయం చేసిందెవరో, అదెంతటి ఘోరమైనదో, దాని గురయింది ఎవరో, వారు అక్కడ తరతరాలుగా అనుభవిస్తున్న జాతి వివక్ష మరెంతటి అమానుషమైనదో తెలిసి కూడా ట్రంప్ భిన్న జాతుల దేశానికి అధ్యక్షుడుగా కాకుండా తెల్లవారి ప్రతినిధిగా మాట్లాడి నిరసనకారుల్లో ప్రతీకారేచ్ఛను మరింతగా పెంచాడు. వారిని బందిపోటు దొంగలుగా పేర్కొని తనలో కూడా గూడు కట్టుకున్న శ్వేత జాతి దురహంకారాన్ని సందేహాతీతంగా చాటుకున్నాడు. రేపటి అధ్యక్ష ఎన్నికల్లో తనకు అనుకూలంగా తెల్లవారి ఓటు మట్టాన్ని పెంచుకునే స్వార్థంతో కల్లు తాగి నిప్పు తొక్కిన కోతిలా ట్రంప్ వ్యవహరించాడనిపిస్తే తప్పు పట్టవలసిన పని లేదు. జార్జి ఫ్లాయిడ్‌ను పరమ నీచంగా చంపేసిన పోలీసు అధికారి డెరెక్ చావిన్‌ను ఆలస్యంగానైనా అరెస్టు చేసినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. అంటే తెల్లవాళ్ల వ్యవస్థల నుంచి తమకు న్యాయం జరగబోదనే అపనమ్మకం నల్లవారిలో ఎంతగా ఘనీభవించి ఉన్నదో తెలుస్తున్నది.

దేశంలో లక్షకు పైగా ప్రాణాలను బలి తీసుకున్న కరోనా విజృంభణ తగ్గలేదు. అయినా మాస్కులు ధరించడం వంటి జాగ్రత్తలేమీ తీసుకోకుండానే జనం గుంపులు గుంపులుగా చేతికి చిక్కిన ప్రతి చిన్న ఆయుధంతోనూ వీధుల్లోకి విరుచుకుపడి వస్తున్నారు. జాత్యహంకార పోలీసులతో, పాలకులతో తాడోపేడో తేల్చుకోవాలనే నల్లజాతి వారి మొక్కవోని దీక్ష అందులో ప్రస్ఫుటమవుతున్నది. అమెరికా అత్యంత సంపన్న దేశంగా ఎదగడానికి తోడ్పడిన ఆఫ్రో అమెరికన్ల కృషి, శ్రమ ఇంతా అంతా కాదు. వారిని బానిసలుగా చేసుకొని నరక బాధలు పెట్టిన తెల్ల జాతీయులు ఆఫ్రికన్ అమెరికన్లను ఇప్పటికీ పురుగుల మాదిరిగానే చూస్తుండడం అక్కడి ప్రజాస్వామ్యం బండారాన్ని బయట పెడుతున్నది. పాలకులు జాతుల మధ్య సామరస్యాన్ని, సహజీవనాన్ని కోరుకునే వారైతే ఇన్నాళ్ల తర్వాత మళ్లీ ఈ స్థాయిలో నిరసన మంటలు మిన్నంటి ఉండేవి కావు. ఈ నిరసన ఒక్క అమెరికాకే పరిమితం కాకుండా లండన్, బెర్లిన్ వంటి నగరాల్లో కూడా ప్రతిధ్వనులు వినిపిస్తుండడం గమనించవలసిన విషయం. భారత దేశంలో కుల వివక్ష కూడా దళితులపై, ఇతర అణగారిన వర్గాలపై ఇటువంటి హత్యలు, దౌర్జన్యాలకు దారి తీసిన ఘటనలు ఉన్నాయి. ఇప్పటికీ అక్కడక్కడా జరుగుతున్నాయి. మా తాతలు మెతకవారు కాని, మేము అందుకు విరుద్ధం, అన్యాయాన్ని సహించం అంటూ అమెరికాలో ఇప్పటి తరం నల్లవారు గొంతెత్తి చాటుతున్నారు. పీడన ఈ స్థాయిలో ఎక్కడ చోటు చేసుకున్నా అక్కడ ప్రాణాలకు కూడా తెగించే తిరుగుబాటు భావాలు రగులుకుంటాయి. ప్రపంచంలోనే అతి గొప్ప ప్రజాస్వామ దేశం అని చెప్పుకుంటున్న అమెరికా ఇప్పటికైనా అక్కడ సమ న్యాయానికి సరైన చోటు కల్పించి ఇటువంటి పోలీసు దురాగతాలు మళ్లీ జరగకుండా చూసుకోవలసి ఉంది. అలా చేసి ప్రపంచానికి ఆదర్శంగా నిలబడాలి. అధికారం కోసం ట్రంప్ వంటి వారు ఆడే కుట్రలకు బలి కాకుండా రేపటి అధ్యక్ష ఎన్నికల్లో అమెరికన్ ప్రజలు విజ్ఞతాయుతమైన తీర్పు ఇచ్చినప్పుడే ఇటువంటివి మళ్లీ తలెత్తకుండా ఉంటాయి.

I Can’t Breathe Mass Protests at White House