Home సినిమా మహేష్‌లాంటి సూపర్‌స్టార్‌ను ఇంతవరకు చూడలేదు

మహేష్‌లాంటి సూపర్‌స్టార్‌ను ఇంతవరకు చూడలేదు

మహేష్‌బాబు హీరోగా ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘స్పైడర్’. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. సెప్టెంబర్ 27న దసరా పండుగ కానుకగా తెలుగు, తమిళ్, మలయాళం, అరబిక్‌లో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘స్పైడర్’ గురించి దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్ చెప్పిన విశేషాలు

A.R.-Murugadoss

పోకిరి సమయంలో పరిచయం…
‘స్టాలిన్’ తర్వాత పదేళ్లకు నేను చేస్తున్న స్ట్రయిట్ తెలుగు మూవీ ‘స్పైడర్’. సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా ఈ సినిమా ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చింది. కొన్నేళ్ల క్రితం నేను విజయవాడలో మహేష్ చిత్రం ‘ఒక్కడు’ చూశాను. సినిమా విడుదలై రెండు వారాలైనా థియేటర్‌లో పండుగలాగా కనిపించింది. సినిమాలో మహేష్ నటన నాకు బాగా నచ్చింది. ఆతర్వాత స్టాలిన్ సినిమా చేస్తున్నప్పుడు పక్కనే పోకిరి సినిమా సాంగ్ షూటింగ్ జరుగుతోంది. అప్పుడు పరుచూరి వెంకటేశ్వరరావు నాకు మహేష్‌ను పరిచయం చేశారు. తర్వాత కొన్ని రోజులకు మహేష్ కలిసినప్పుడు నేను మీతో సినిమా చేయాలనుకుంటున్నానండి అని అన్నాను. తను కూడా పాజిటివ్‌గానే స్పందించాడు. అయితే తర్వాత నేను గజినీతో బాలీవుడ్‌లోకి ప్రవేశించి బిజీ అయ్యాను.
ఒక పాట మినహా పూర్తి…
మహేష్‌తో తెలుగు, తమిళంలో ఓ సినిమా చేయాలనుకోగానే ఈ కథను అనుకున్నాం. కథలో హీరోయిజం ఉండాలి. ఫ్యామిలీ ఆడియన్స్, ఫ్యాన్స్, రెగ్యులర్ ఆడియన్స్‌కు సినిమా నచ్చేలా ఉండాలి. అలాగే తమిళంలో మహేష్ చేస్తున్న తొలి స్ట్రయిట్ మూవీ కాబట్టి సినిమా బ్యాలెన్సింగ్‌గా, కరెక్ట్‌గా ఉండాలి. కాబట్టి స్క్రిప్ట్ మోడ్రన్‌గా ఉండాలని నిర్ణయించుకున్నాం. అన్నీ అనుకున్నవిధంగానే సినిమా తెరకెక్కింది. తెలుగు, తమిళంలో డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఒక పాట మినహా సినిమా పూర్తయ్యింది. పదేళ్లు ఎదురు చూసినందుకు మహేష్‌తో తగిన సినిమా చేసినట్లు అనిపించింది. తప్పకుండా ఈ చిత్రం తెలుగు, తమిళ ప్రేక్షకులకు అలరిస్తుందని చెప్పగలను.
మహేష్ దర్శకుల హీరో…
దర్శకుడిగా నేను ఇప్పటివరకు చాలా మంది సూపర్‌స్టార్స్‌తో పనిచేశాను. మహేష్ వర్కింగ్ స్టైల్‌ను మరొకరితో పోల్చలేము. అందరు దర్శకులు అతనితో ఒక్క సినిమా అయినా చేయాలని కోరుకుంటారు. ఏడాదిగా మహేష్‌తో నేను ప్రయాణం చేస్తున్నాను. తనలాంటి సూపర్‌స్టార్‌ను ఇంతవరకు నేను చూడలేదు. తను పూర్తిగా దర్శకుల హీరో. స్పైడర్ సినిమాను 80 రోజుల పాటు రాత్రిపూట షూటింగ్ చేశాం. తను ఎంతో సహకరించి సినిమా చేశాడు. స్క్రిప్ట్ విన్న తర్వాత ఎక్కడా జోక్యం చేసుకోలేదు. ఇండియాలో మరే సూపర్‌స్టార్ ఇంతలా కష్టపడటం నేను చూడలేదు. స్పైడర్ సినిమాలో మహేష్ తప్ప మరో హీరోను ఊహించుకోలేనంతగా ఇమిడిపోయారు. ఇక సినిమాను రెండు భాషల్లో సమాంతరంగా షూట్ చేశాం. నేను చేసిన సినిమాల్లో తుపాకీ, గజనీ స్టైలిస్ మూవీస్ అయితే… రమణ, కత్తి ఎమోషనల్ సినిమాలు. మహేష్‌తో సినిమా అంటే మోడ్రన్‌గా ఉండాలని ‘స్పైడర్’ కథను సిద్ధం చేసుకున్నాను.
ఇంటెలిజెన్స్ వ్యవస్థపై…
‘స్పైడర్’ జేమ్స్‌బాండ్ తరహా మూవీ కాదు. ఇది స్పై మూవీ. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్టా ఇంటెలిజెన్స్ వ్యవస్థ మన దేశంలో ఎలా పనిచేస్తుంది. వారు దేశంలో మన కోసం ఏం చేస్తున్నారు అనేవి సినిమాలో చూపిస్తున్నాం. సినిమాలో ఎమోషన్స్ ఉంటాయి. సాధారణంగా నా సినిమాల్లో అంతర్లీనంగా సందేశముంటుంది. స్పైడర్‌లో కూడా మంచి సందేశముంటుంది. మనిషిలో మానవత్వం తగ్గిపోయినప్పుడు సమాజంలో ఏదైనా వైపరిత్యం సంభవిస్తుంది. ఈ సందేశాన్ని నేను ఇన్‌డైరెక్ట్‌గా సినిమాలో చూపిస్తున్నాను.
రెండు భాషల్లో క్లైమాక్స్ ఒకేలా…
ప్రారంభంలోనే సినిమాను తెలుగు, తమిళంలోనే చేయాలనుకున్నాం. హిందీలో చేయాలనుకోలేదు. తెలుగు, తమిళంలో ఏకకాలంలో షూట్ చేయడం వల్ల నేను చేసిన ప్లానింగ్‌కంటే షూటింగ్‌కు ఎక్కువ రోజుల సమయం పట్టింది. ఒకేసారి రెండు భాషల్లో సినిమా చేయడం నాకు మొదటిసారి. అయితే తెలుగు, తమిళ్‌లో సినిమా క్లైమాక్స్ ఒకేలా ఉంటుంది.
గ్రాండియర్‌గా సినిమా నిర్మాణం…
ఠాగూర్, గజనీ, కత్తి సినిమాల నుండి ఠాగూర్ మధుతో పరిచయం ఉంది. అలాగే తిరుపతి ప్రసాద్‌తో కూడా చాలా కాలంగా అనుబంధం ఉంది. ఠాగూర్ మధు, తిరుపతి ప్రసాద్‌లు ఈ చిత్రాన్ని ముందుగా అనుకున్నవిధంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. సినిమా ఎంతో గ్రాండియర్‌గా తెరకెక్కింది. గ్రాఫిక్స్‌ను కూడా లండన్, రష్యా టెక్నీషియన్‌లతో చేయిస్తున్నాం. ప్రతి విషయంలో నిర్మాతలు ఏవిధంగానూ రాజీపడకుండా సినిమాను రూపొందిస్తున్నారు.
అందుకే రకుల్‌ప్రీత్‌ను తీసుకున్నాం…
సినిమాను రెండు భాషల్లో ఏకకాలంలో తీయాలనుకున్నప్పుడు రెండు భాషలు తెలిసిన హీరోయిన్ కావాలనిపించింది. అలాంటప్పుడు రకుల్‌ప్రీత్ సింగ్ అయితే రెండు భాషలను అర్థం చేసుకుంటుందని ఆమెను హీరోయిన్‌గా తీసుకున్నాం. అదేవిధంగా మా కథకు తగినట్లుగా బుద్ధి బలం ఎక్కువగా ఉండే విలన్ కావాలి. హీరోకు కనిపించకుండా గెరిల్లా దాడిలా హీరోతో ఫైట్ చేయాలి. అందుకు ఎస్.జె.సూర్య అయితే సరిపోతాడనిపించి అతన్ని విలన్‌గా తీసుకున్నాం. నేను, సూర్య మంచి స్నేహితులం. కెరీర్ ప్రారంభంలో దర్శకత్వ శాఖలో ఇద్దరం కలిసి పనిచేశాం. భరత్ కూడా ఈ సినిమాలో విలన్‌గా నటించాడు.
తదుపరి చిత్రాలు…
నెక్ట్స్ నేను తమిళంలో ఓ సినిమా చేయబోతున్నాను. చర్చలు జరుగుతున్నాయి. అదేవిధంగా బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్‌తో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేశాను. సల్మాన్‌కు స్టోరీలైన్ వినిపించగా ఆయనకు నచ్చింది. ఈ సినిమా ఎప్పుడనేది అన్నీ ఓకే అయిన తర్వాత చెబుతాను. అలాగే రజనీకాంత్‌కు కూడా కథ చెప్పాను. ఆయనకు కూడా నచ్చింది. అయితే ఆయన 2.0, కాలా చిత్రాలతో ఆయన బిజీగా ఉన్నారు. ఆ రెండు చిత్రాలు పూర్తికాగానే రజనీతో నా సినిమా ఉంటుంది.