Home వరంగల్ ‘నేరెళ్ళ’ పుస్తకాలు చదివి నేర్చుకున్నాను..

‘నేరెళ్ళ’ పుస్తకాలు చదివి నేర్చుకున్నాను..

మడిసన్నాక కూసింత కళాపోషనుండాలన్నది ఒకప్పటి సినిమా డైలాగ్.ఆ మాటను అక్షరాల నిజం అని నిరూపిస్తున్నారు ఖమ్మంకు చెందిన మల్లం రమేష్.వృత్తి రీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయుడైనా,ప్రవృత్తి రీత్యా మిమిక్రీ కళాకారుడు.మాట్లాడే బొమ్మ(వెంట్రిలాక్విజం),ధ్వన్యనుకరణ(మిమిక్రి)వంటి అంశాల్లో ఖమ్మం జిల్లానుండి వచ్చిన కళాకారుల్లో ప్రధముడు.చదువుకునేప్పుడు డబ్బు సంపాదనకోసం ఎంచుకున్న మార్గం నేడు దేశవిదేశాల్లో లక్షలమందికి వినోదాన్ని అందించే సాధనం అయ్యింది.అందుకై వివిధ దేశాల్లో అవార్డులు అందుకున్నారు.ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగిన రమేష్ జీవితం పూలబాట ఏమాత్రం కాదన్నది వాస్తవం.ధ్వన్యనుకరణ సామ్రాట్  డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్ పుస్తకాలు చదివి ఈ అంశంలో పట్టుసాధించానని చెప్పే రమేష్ వందలమందికి శిక్షణ ఇచ్చారు.కార్యక్రమ నిర్వాహకుడిగా,వ్యాఖ్యాతగా,రచయితగా రాణిస్తున్న మల్లం రమేష్ జీవిత విశేషాలు వారి మాటల్లోనే  మన తెలంగాణ పాఠకుల కోసం…

mimikri1నాటిక రాస్తే గుర్తించలేదు- మాది వరంగల్ జిల్లా డోర్నకల్ మండలం వెన్నారం గ్రామం.నాన్న గోపాలరావు పట్వారి,అమ్మ లక్ష్మి గృహిణి.మేం ఐదుగురు సంతానం,అబ్బాయిల్లో నేను చిన్న.మాది ఒకప్పుడు బంజేర్‌దార్ కుటుంబం.ఉన్న ఆస్తులను పేదలకు పంచేయడంతో ఆర్థికంగా మా పరిస్థితి చితికిపోయింది.దాంతో నేను చిన్నగా ఉన్నప్పుడే ఖమ్మం జిల్లాకు వచ్చేసింది మా కుటుంబం.కష్టంగానే బతికాము.నేను ప్రైమరీ స్కూళ్ళో చదువుతున్నప్పుడు ఓ నాటిక రాశాను కాని దాన్నెవరూ గుర్తించలేదు.అలాగని నేను రాయడం మానలేదు.
నేరెళ్ళ వేణుమాధవ్‌ను కలిశాను- ఖమ్మంలో ఇంటర్ చదువుతున్నప్పుడు మిమిక్రీపోటీలో నాకు మొదటి బహుమతి వచ్చింది.అప్పుడు ఆ అంశంపై మరింత ఆసక్తి పెరిగింది.వారు ధ్వన్యనుకరణ గూర్చి రాసిన పుస్తకాలను చదివి కళకు మరింత మెరుగులద్దుకున్నాను.నా చిరకాల వాంఛ అయిన వేణుమాధవ్‌ను కలిశాను వారు నన్ను ఆశీర్వదించి సలహాలు,సూచనలు అందించారు.డబ్బు సంపాదించాలంటే తప్పకుండా ఉద్యోగం ఉండాలి అలాగే నీ ప్రవృత్తి కొనసాగించాలంటే టీచర్ ఉద్యోగం అయితే బాగుంటుందని సలహా ఇచ్చారు.సెలవుల్లో దీనిపై శ్రద్ధ పెట్టవచ్చన్నది వారి సలహా.మహబూబ్ నగర్ జిల్లాలో బి ఇ డి పూర్తిచేశాను.చదువుతూ ఓ పత్రికకు విలేఖరిగా పనిచేశాను.
టాకింగ్ డాల్- ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఖమ్మం జిల్లా కల్లూరులో చేరాను.ఉద్యోగం చేస్తూనే నాకిష్టమైన మిమిక్రీ ని కొనసాగించాను. అనుకోకుండా ఓ రోజు కల్లూరుకు ప్రముఖ సైకాలజిస్ట్ బి వి సత్యనగేష్ వచ్చారు.నేను చేసిన మిమిక్రీ కార్యక్రమం చూసి నాకు మాట్లాడే బొమ్మ అంశంలో ఉపయోగించే బొమ్మను బహుమతిగా అందించారు.వెంట్రిలాక్విజం లో పట్టు సాధించడానికి మరింత ప్రయత్నం చేశాను.నేనూ మాట్లాడాలి నా చేతిలో బొమ్మకూడా మాట్లాడాలి(ఆ మాటలు కూడా నావే) హావభావాలు ప్రదర్శించాలి.వీటిల్లో ఏది లోపించినా ప్రేక్షకులకు విసుగెత్తుతుంది వారిని రంజింపజేయలేం. దానిపై పట్టు సాధిస్తూనే మరింత మందిని కలుపుకుని ఓ బృందగా తయారుచేశాను.దేశ విదేశాల్లో మా కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా ఆహ్వానాలు రావడం మొదలయింది.
వివిధ ట్రూపులుగా విభజించి- కామెడీ ట్రూప్.మిమిక్రీ. వెంట్రిలాక్విజం. డాన్స్.పేరడీ.మ్యాజిక్ షో వంటి ట్రూప్‌లను తయారుచేశాను. కళాకారులందరినీ ఓ దరికి చేర్చాను.దాన్లో దాదాపు వంద మందికి పైగా కళాకారులుండేవారు.దీన్లో చెప్పుకోదగ్గవి… వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రకు కళాకారులు నా దగ్గరినుండే వెళ్ళారు.రాళ్ళబండి కళాబృందాలకు శిక్షణ అందించాను.మూఢ నమ్మకాల నివారణకు పోలీస్ డిపార్ట్‌మెంట్ వారు నిర్వహించే కార్యక్రమాలకు పోలీసులకు శిక్షణ అందించాను.ముఖ్యంగా ఖమ్మం,కర్నూల్,గుంటూరు జిల్లాలలో బృందాలకు పూర్తి స్థాయిలో శిక్షణ అందించాను.వయోజన విద్య కార్యక్రమాలకు శిక్షణ అందించాను.రవీంద్ర భారతిలో జరిగిన శతరూప కార్యక్రమాన్ని నేనే దగ్గరుండి పర్యవేక్షించి నిర్వహించాను.నా దగ్గర శిక్షణ తీసుకున్నవారు నేడు ఉన్నత స్థానాల్లో ఉన్నారు.జంధ్యాల జోక్స్ కార్యక్రమం(జెమిని ఛానెల్‌లో వచ్చింది)కు పూర్తి సహకారం అందించాను.
అవార్డులు- ఇప్పటి వరకు దేశ విదేశాల్లో మిమిక్రీ ఆర్టిస్ట్‌గా,యాంకర్‌గా 4000 పైచిలుకు కార్యక్రమాలు చేశాను.దుబాయ్,షార్జా,మలేషియాల్లో కార్యక్రమాలు నిర్వహించాను.అమెరికాకు ఆహ్వానం అందినా వీసా దొరకక వెళ్ళలేకపోయాను. ఇప్పటివరకు వందల సంఖ్యలో అవార్డులు అందుకున్నాను.మర్చిపోలేనివి…మలేషియా తెలుగు సంఘం.దుబాయ్ తెలుగు సంఘం.బహ్రైన్ తెలుగు సంఘం వార చేసిన సత్కారం.రాష్ట్రంలోని వివిధ కళాసంఘాలు కలిసి అందించిన కళారత్న అవార్డు.హైదరాబాద్ సిటీ కాలేజ్ ఆధ్వర్యంలో గురు-శిష్య అవార్డు డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్‌తో కలిసి తీసుకున్నాను.మాజీ ముఖ్యమంత్రి రోశయ్య చేతుల మీదుగా సత్కారం పొందాను.S S Y వారందించిన బంగార పతకం.ఆనంద లహరి అనే సంస్థను ఏర్పాటుచేసి విభిన్న కళల్లో పదుల సంఖ్యలో శిక్షణ ఇచ్చినందుకు గౌరవార్ధం స్వర్ణ కంకణం తో సత్కరించారు.రానున్న రోజుల్లో మరింత మంది కళాకారులను ఆనందలహరి లోనికి ఆహ్వానించి కళలను కాపాడాలన్నది నా లక్షంగా పెట్టుకున్నాను.