Home జాతీయ వార్తలు ఆగిన కులభూషణ్ ఉరి…

ఆగిన కులభూషణ్ ఉరి…

Kulbhushan Jadhav

 

భారత్‌కు అంతర్జాతీయ న్యాయభూషణం

పాకిస్థాన్‌కు చెంపపెట్టు

తీర్పును తిరిగి సమీక్షించాలని పాక్‌కు అంతర్జాతీయ న్యాయస్థానంఆదేశం

ది హేగ్ : భారత నౌకాదళ రిటైర్డ్ అధికారి కులభూషణ్ జాదవ్‌కు పాకిస్థాన్ విధించిన ఉరిశిక్షను నిలిపివేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసిజె) తీర్పు వెలువరించింది. గూఢచార్యం, ఉగ్రవాదం అభియోగాలపై జాదవ్‌ను పాకిస్థాన్ అధికారులు అరెస్టు చేశారు. 2017లో రహస్య విచారణ తరువాత ఆయనకు మరణశిక్షను విధిస్తూ పాకిస్థాన్ సైనిక తీర్పు వెలువరించింది. అయితే ఎటువంటి ప్రతివాదనకు తావు ఇవ్వకుండా సాగిన విచారణ ప్రక్రియను ఐసిజె తప్పు పట్టింది. ఈ వ్యవహారంలో జాదవ్‌కు విధించిన మరణశిక్షపై పాకిస్థాన్ పునః సమీక్షించుకోవాలని , అప్పటివరకూ మరణశిక్ష అమలును నిలిపివేస్తున్నట్లు న్యాయస్థానం బుధవారం తీర్పు వెలువరించింది.

16 మంది న్యాయమూర్తులతో కూడిన ఐసిజె బెంచ్‌లో 15 మంది భారతదేశానికి అనుకూలంగా రూలింగ్ వెలువరించారు. దీనితో జాదవ్‌ను పాకిస్థాన్ ఉరి నుంచి తప్పించేందుకు ఇన్నేళ్లుగా భారతదేశం సాగిస్తూ వచ్చిన పలు రకాల యత్నాలలో ఘన విజయం దక్కింది. కేసు విచారణ అత్యంత రహస్యంగా జరగడం వల్ల న్యాయం జరగలేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. . 49 సంవత్సరాల జాదవ్‌కు పాకిస్థాన్ మరణశిక్షను విధించడంపై పలు స్థాయిలలో నిరసన వ్యక్తం అయింది. జాదవ్‌ను కలుసుకోవడానికి ఎవరికి అనుమతిని ఇవ్వకుండా, భారతదేశపు దౌత్య వర్గాలు కానీ, న్యాయవాద సాయం కానీ అందకుండా ఏకపక్షంగా విచారణ సాగించారనే వాదనలోని అంశాలను అంతర్జాతీయ న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది.

కోర్టు ప్రెసిడెంట్ హోదాలో ఉన్న జడ్జి అబ్దుల్‌ఖావీ అహ్మద్ తీర్పును వెలువరించారు. ‘ సమగ్రమైన సమీక్ష నిర్వహించండి, కులభూషణ సుధీర్ జాదవ్‌కు విధించిన శిక్షపై పునః పరిశీలన జరపండి’ అని ఇందులో తెలిపారు. అరెస్టు తరువాతి దశలో భారతీయ కాన్సులర్ హక్కులను పాకిస్థాన్ ఉల్లంఘించిందని న్యాయస్థానం అభిశంసించింది. పాకిస్థాన్ ఈ విషయంలో భారత దేశాన్ని అన్ని విధాలుగా దెబ్బతీసింది. తమ పౌరుడిని కలుసుకునేందుకు లేదా ఆయనకు న్యాయ , దౌత్యపరమైన సాయం అందించేందుకు వీల్లేకుండా చేసిందని తాము నిర్థారించుకున్నట్లు తెలిపింది. జాదవ్ ఇరాన్ నుంచి అక్రమంగా తమ భూ భాగంలోకి ప్రవేశించాడని అందుకే అదుపులోకి తీసుకుని విచారణ జరిపినట్లు పాకిస్థాన్ తెలిపింది.

అయితే ఈ వాదనను భారతదేశం ఖండించింది. విశ్రాంత అధికారి అయిన జాదవ్ వ్యాపార పనులపై ఇరాన్‌కు వెళ్లగా అక్కడ ఆయనను పాకిస్థాన్ ఇంటలిజెన్స్ వారు అపహరించుకుని వెళ్లారని భారత ప్రభుత్వం తెలియచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా అంతర్జాతీయ న్యాయస్థానం విచారణ చేపట్టింది. భారత పాకిస్థాన్ న్యాయవాదుల బృందాలు పరస్పర వాదనలు విన్పించాయి.

న్యాయం గెలిచి నిలిచింది : మోడీ
న్యూఢిల్లీ : న్యాయం నిజాయితీ నిలిచే ఉందని రుజువైనట్లు ప్రధాని మోడీ స్పందించారు. కులభూషణ్‌కు ఉరి ఆపివేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు ఇవ్వడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ఒక కీలకమైన కేసులో విచారణ ప్రక్రియను ఏకపక్షంగా సాగించడం చెల్లనేరదని న్యాయస్థానం స్పష్టం చేసిందని, ఇప్పటికైనా పాకిస్థాన్ సైనిక కోర్టు తీర్పును పున ః సమీక్షించాలని సూచించారు. ఈ కేసులో భారతదేశానికి ఘన విజయం దక్కిందని మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రశంసించారు. భారతదేశ వాదనను సమర్థవంతంగా విన్పించిన సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే బృందానికి అభినందనలు తెలిపారు.

కులభూషణ్ జాదవ్ కేసు పూర్వాపరాలు

2016 మార్చి 3 : కుల్‌భూషణ్ జాదవ్ అరెస్టు
మార్చి 24 : జాదవ్ అరెస్టు గురించి ఇండియాకు పాక్ తెలిపింది. ఆయన భారతీయ వేగు అని పేర్కొంది
2017 ఎప్రిల్ 10 : పాకిస్థాన్ అస్థిరత, విద్రోహ చర్యలలో ప్రమేయం ఉన్నందున జాదవ్‌కు మరణశిక్ష విధిస్తున్నట్లు పాక్ ఆర్మీ కోర్టు తీర్పు వెలువరించింది.
ఎప్రిల్ 20 : జాదవ్ విచారణ ప్రక్రియపై వివరాలు కోరిన భారతదేశం
మే 8 : పాక్ సైనిక న్యాయస్థానం నిర్ణయానికి వ్యతిరేకంగా భారతదేశం ఐసిజెను ఆశ్రయించింది.
మే 9 : జాదవ్ ఉరిశిక్షపై ఐసిజె స్టే
సెప్టెంబర్ 13 : భారతదేశం తన తొలి దఫా రాతపూర్వక విజ్ఞప్తిని ( మెమొరియల్)ను దాఖలు చేసింది.
సెప్టెంబర్ 28 : జాదవ్‌కు బదులుగా ఉగ్రవాదులను అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందన్న పాకిస్థాన్ ..దీనిని ఖండించిన భారత్
డిసెంబర్ 13 : పాకిస్థాన్ తన కౌంటర్ వివరణ ఇచ్చుకుంది.
జూన్ 22 : ఉగ్రవాద కుట్రలో పాత్ర ఉన్నట్లు అంగీకరించి జాదవ్ క్షమాభిక్ష కోరినట్లు పాకిస్థాన్ ప్రకటించింది
డిసెంబర్ 8 : జాదవ్ తల్లి, భార్య ఆయనను కలుసుకునేందుకు డిసెంబర్ 25వ తేదీన రావచ్చునని పాకిస్థాన్ అనుమతించింది.
2018 జులై 17 : పాకిస్థాన్ రెండవ కౌంటర్ మెమోరియల్‌ను దాఖలు చేసింది.
2019 ఫిబ్రవరి 18 : ఐసిజె 4 రోజుల బహిరంగ విచారణను జాదవ్ కేసులో చేపట్టింది.
జులై 17 : జాదవ్‌కు మరణశిక్షను సమీక్షించాలని, ఆయనకు న్యాయవాద సాయం అందించాలని పాకిస్థాన్‌ను ఆదేశించిన ఐసిజె.

ICJ has overturned death of Kulbhushan Jadhav