Wednesday, March 29, 2023

6-8 వారాల లాక్‌డౌన్

- Advertisement -

ICMR chief says most of country should remain in lockdown for 6-8 weeks

 

కరోనా పాజిటివిటీ 10% దాటిన ప్రాంతాల్లో అమలు చేయాలి
అప్పుడే అదుపులోకి కొవిడ్
కేసుల సంఖ్యను బట్టి తక్షణ చర్య
నేతల మితిమీరినతనమూ కారణం
ఐసిఎంఆర్ చీఫ్ బలరామ్ భార్గవ్

న్యూఢిలీ: దేశంలో అత్యధిక ప్రాంతంలో మరో 6 నుంచి 8 వారాల పాటు లాక్‌డౌన్ విధిస్తే కానీ కొవిడ్ అదుపులోకి రాదని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసిఎంఆర్) డైరెక్టర్ డాక్టర్ బలరామ్ భార్గవ్ స్పష్టం చేశారు. దేశంలో వివిధ ప్రాంతాలు ఇప్పటికే పలు ఆంక్షల లాక్‌డౌన్ల చక్రబంధంలో ఉన్నాయి. అయితే సెకండ్ వేవ్ కరోనా తీవ్రస్థాయికి చేరుకోవడం, సంక్ర మణలు, మరణాలు పెరుగుతూ ఉండటంతో కనీసం రెండు మూడు నెలల సుదీర్ఘ లాక్‌డౌన్ అత్యవసరం అ ని ఐసిఎంఆర్ చీఫ్ అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్‌లపై పలు రాష్ట్రాలు తటపటాయిస్తున్న దశలో ఐసిఎంఆర్ చీఫ్‌ అభిప్రాయం కీలకం అయింది. విధ్వంసకర స్థితిలో ఈ వైరస్ ఉందని, దీనిని నియంత్రించేందుకు అత్యవసరంగా లాక్‌డౌన్ ఎక్కువ కాలం విధించాల్సి ఉందన్నారు.

అత్యధిక వైరస్ కేసులు ఉన్న జిల్లాలను పూర్తి స్థాయిలో వెంటనే లాక్‌డౌన్‌లతో దిగ్బంధించాల్సి ఉంది. పూర్తిస్థాయి కట్టడితోనే వైరస్ నియంత్రణ సాధ్యం అవుతుందని దేశంలో అత్యున్నత స్థాయి వైద్య పరిశోధనా సంస్థ అధినేత తెలిపారు. వైరస్ సంక్రమించిన ప్రాంతాలను లెక్కలోకి తీసుకుని, ఎక్కడెక్కడ లాక్‌డౌన్ విధించాలనేది నిర్ణయం తీసుకోవాలి. అధికార యంత్రాంగం ఆయా ప్రాంతాలలో లాక్‌డౌన్‌ను కఠినంగానే అమలు చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా దేశంలో అత్యధిక భాగం లాక్‌డౌన్ పరిధిలోకి వెళ్లాల్సిందే. వైరస్ పరీక్షలు జరిగిన చోట సంక్రమణల స్థాయి పది శాతం దాటినట్లు అయితే వెంటనే వాటిని లాక్‌డౌన్ పరిధిలోకి తీసుకురావాలని డాక్టర్ భార్గవ సూచించారు.

718 జిల్లాల్లో అత్యధిక కేసులు
భారతదేశంలో ఇప్పుడు 718 జిల్లాల్లో పాజిటివి రేటు పదిశాతం మించి ఉంది.వీటిలో ఢిల్లీ, ముంబై , బెంగళూరు వంటి ప్రాంతాలు ఉన్నాయి. అత్యధిక జిల్లాల్లో కేసులు ఎక్కువగా ఉండటం ప్రమాదకర పరిస్థితిని తెచ్చిపెడుతుందని భార్గవ తెలిపారు. లాక్‌డౌన్‌లు ఎంతకాలం పెడుతారు? ఇప్పటికే దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థలు, చితికిపోతున్న సాధారణ జనజీవిత ప్రక్రియలకు విఘాతం ఎప్పటివరకూ సాగుతుందని ప్రభుత్వాలు, ప్రత్యేకించి అధికారంలో ఉన్న పార్టీలు సంకోచిస్తున్నాయి. దేశవ్యాప్త లాక్‌డౌన్ ప్రకటించడం వల్ల రాజకీయంగా దుష్ప్రభావం పడుతుందని నరేంద్ర మోడీ అభిప్రాయపడుతున్నారు. లాక్‌డౌన్‌లు , ఇతరత్రా ఆంక్షల విషయాలను రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక అంశాల ప్రాతిపదికగా ఖరారు చేసుకుంటే మంచిదని తేల్చిచెప్పారు. ఈ దశలో వైద్య పరిశోధనల అత్యున్నత స్థాయి అధికారి లాక్‌డౌన్ మరింత విస్తృతం అంతకు మించి దీర్ఘకాలికం అయితేనే మంచిదని చెప్పడం కీలకం అయింది.

వివిధ రాష్ట్రాలు సాధ్యమైనంత వరకూ లాక్‌డౌన్‌కు వెళ్లకుండా చేసుకుంటున్నాయి. ప్రజల కదలికలపై ఆంక్షలతో నైట్‌కర్ఫూలకు పరిమితం అవుతున్నాయి. అయితే ఈ విధమైన చర్యలతో వైరస్ సంపూర్ణ నియంత్రణ సాధ్యం అయ్యే పనికాదని భార్గవ తేల్చిచెప్పారు. పాజిటివ్‌ల రేటు ఎక్కువగా ఉన్న జిల్లాలను పూర్తిగా మూసివేయాల్సి ఉంది. 5 నుంచి 10 శాతం వరకూ పాజిటివిటి రేటు ఉంటే ఫర్వాలేదు. అదే ఈ స్థాయిని దాటితే ఆరు నుంచి ఎనిమిది వారాల లాక్‌డౌన్ అత్యవసరం అని భార్గవ తేల్చిచెప్పారు. నిజానికి ఏ ప్రాంతంలో అయినా వీడకుండా ఆరు నుంచి ఎనిమిది వారాల లాక్‌డౌన్ ఉంటేనే పాజిటివిటి రేటు తగ్గుతుందని, దీనిని ప్రామాణిక స్థాయిగా భావించుకుని వ్యవహరించాల్సి ఉందని డాక్టర్ భార్గవ దేశ రాజధానిలోని ఐసిఎంఆర్ ప్రధాన కార్యాలయంలో వార్తా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వూలో తెలిపారు.

ఢిల్లీ ఇప్పుడు తెర్చుకుంటే ఇకపై ఘోరమే
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తీవ్రత గురించి ఐసిఎంఆర్ ప్రధానంగా ప్రస్తావించారు. ఇక్కడ పాజిటివిటి రేటు దాదాపు 35 శాతం తాకింది. అయితే లాక్‌డౌన్‌తో ఇది ఇప్పుడు 17 శాతంగా మారింది. ఒకవేళ తొందరపడి దీనిని ఎత్తివేస్తే రేపటికి రేపే ఓపెన్ చేసే పరిస్థితి దారుణం అవుతుందన్నారు. ఇది కేవలం ఢిల్లీకే కాదు దేశంలోని అన్ని ప్రాంతాలకు వర్తిస్తుందని, కేసులు తగ్గుముఖం పట్టాయని ఉదాసీనతతో వ్యవహరించినా పరిస్థితిని గమనించకుండా వెంటనే లాక్‌డౌన్ ఎత్తివేసినా ఇది అక్కడితో ఆగకుండా ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపిస్తుందని భార్గవ హెచ్చరించారు.

సంక్షోభ నివారణలో సర్కారు మందకొడితనం
ప్రస్తుత కొవిడ్ సంక్షోభ స్థితికి సంబంధించి ఐసిఎంఆర్ చీఫ్ నేరుగా మోడీ ప్రభుత్వాన్ని నిందించలేదు. అయితే సంక్షోభ నివారణ విషయంలో కేంద్రం ఆలస్యంగా మేల్కొందని ఆయన స్పష్టం చేశారు. వైద్య మండలి నుంచి ఎప్పటికప్పుడు అవసరం అయిన సిఫార్సులు ఇస్తూనే ఉన్నామని, అయితే మొత్తం ప్రతిపాదనలలో కనీసం 10 శాతం వరకూ అయినా అమలుకు నోచుకోవడంలో ఆలస్యం జరిగిందని, దీని గురించి ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. జరిగిందేదో జరిగింది. జరగాల్సింది చూడాలి. పూర్తిస్థాయి అత్యధిక భాగం లాక్‌డౌన్ ఎక్కువ కాలం ఉండాల్సిందే అన్నారు.

లాక్‌డౌన్ విస్తృతి చర్యల గురించి కొవిడ్‌పై నేషనల్ టాస్ప్‌ఫోర్సు ఎప్రిల్ 15వ తేదీనే కీలక సిఫార్సులు చేసిందని, పది శాతం అంతకు మించి పాజిటివిటి రేటు ఉంటే వెంటనే లాక్‌డౌన్ పెట్టాల్సి ఉందని సూచించామని తెలిపారు. అయితే ఎప్రిల్ 20వ తేదీన ప్రధాని మోడీ టీవీల ద్వారా చేసిన భాషణలో లాక్‌డౌన్ అనేది కేవల తుది ఆయుధం కావాల్సి ఉందని, రాష్ట్రాలు అత్యుత్సాహంతో వ్యవహరించరాదని తెలిపారు. దేశవ్యాప్తంగా వైరస్ నియంత్రణకు ఎక్కడికక్కడ మైక్రో కంటైన్మెంట్ జోన్లు పెట్టడం మంచిదని సూచించారు. గత ఏడాది లాక్‌డౌన్ పెట్టడంతో తరువాతి దశలో వెంటాడుతూ వచ్చిన ఆర్థిక విషమ పరిస్థితి నేపథ్యంలో ప్రధాని ఈ విధంగా లాక్‌డౌన్‌పై వెంటనే నిర్ణయాలకు దిగలేదని వెల్లడైంది.

ఐసిఎంఆర్ మాటలు వినని నేతలు
గత నెల మధ్య నుంచి కూడా ఐసిఎంఆర్ నిపుణులతో పాటు వ్యాధుల నియంత్రణల జాతీయ కేంద్రం పర్యవేక్షకులు కూడా కటుతరమైన లాక్‌డౌన్ విధింపు గురించి సూచనలు వెలువరిస్తూ వస్తున్నారు. అయితే పలు కారణాలతో నేతలు, ప్రత్యేకించి హోం మంత్రిత్వశాఖ నుంచి దీనికి సంబంధించి సానుకూల స్పందన రాలేదు. పైగా రాష్ట్రాలను కూడా కేంద్రం ఈ విధమైన చర్యల దిశలో నిరుత్సాహపర్చాయి. నేతలు రాజకీయ కారణాలతో సభలకు వెళ్లడం, ఎక్కువగా జనసమీకరణ జరగడం వంటి అంశాలపై తమ సంస్థ విసిగిపోతోందని ఐసిఎంఆర్ అధికారులు ఇద్దరు పేర్లు చెప్పకుండా వార్తా సంస్థలకు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలలో ప్రధాని మోడీ, అమిత్ షా ఇతర నేతలు వెళ్లడం, హోరాహోరీ ప్రచారం నడుమ వైరస్ కట్టలు తెంచుకోవడం వంటి పరిణామాలను ఐసిఎంఆర్ అప్పటి నుంచే ప్రస్తావిస్తూ వస్తోంది. అయితే వైరస్ కట్టడి విషయంలో సంస్థకు ప్రభుత్వానికి మధ్య అభిప్రాయభేదాలు లేవని, అంతర్గతంగా కూడా ఏకాభిప్రాయంతోనే ఉన్నామని భార్గవ తేల్చారు.

కామన్‌సెన్స్ ఉంటే సభలు పెట్టరు
అధికారంలో ఉన్న వారి అధికార బలోపేత చర్యలను ఐసిఎంఆర్ అధినేత పరోక్షంగా తప్పుపట్టారు. ఈ వైరస్ జనం ద్వారా జనం లోకిపోవడం అనే సూత్రంతో పనిచేస్తోంది. మరి అటువంటి దశలో దీనికి విరుద్ధంగా బాధ్యతాయుత స్థానాలలో ఉండే వారు జనసభలు పెట్టడం, ఉత్సాహంగా ప్రసంగాలకు దిగడం వంటి పరిణామాలు మంచివేనా అని ప్రశ్నించారు. నిజానికి ఇండియాలోనే కాదు ఇంకెక్కడ అయినా సామూహిక జన సమ్మేళనం ఎటువంటిది అయినా సరైనది కాదని, ఇది ఆమోదయోగ్యం కానేరదని, ఈ విషయం ఇంగితజ్ఞానానికి సంబంధించిన విషయమని తేల్చారు.

ICMR chief says most of country should remain in lockdown for 6-8 weeks

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News