Home జాతీయ వార్తలు ఢిల్లీలో ఆర్‌టిపిసిఆర్ టెస్టింగ్ సామర్థాన్ని పెంచిన ఐసిఎంఆర్

ఢిల్లీలో ఆర్‌టిపిసిఆర్ టెస్టింగ్ సామర్థాన్ని పెంచిన ఐసిఎంఆర్

ICMR has increased RT pcr testing capacity in delhi

 

న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలతో దేశ రాజధాని ఢిల్లీలో ఆర్‌టిపిసిఆర్ టెస్టుల సామర్థాన్ని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసిఎంఆర్) ఇదివరకున్న రోజుకు 27,000 టెస్టులనుంచి 37,200కు పెంచినట్లు హోంమంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. ఢిల్లీలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ నెల 15న ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన అమిత్ షా కరోనా వైరస్ కట్టడికి పలు చర్యలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్‌టిపిసిఆర్ టెస్టుల సంఖ్యను రెట్టింపు చేయడంతో పాటుగా వైరస్ వ్యాప్తి అధికంగా ఉండే ప్రాంతాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం కోసం కేంద్ర ఆరోగ్య శాఖ, ఐసిఎంఆర్‌కు చెందిన మొబైల్ టెస్టింగ్ వ్యాన్లను రంగంలోకి దించడం అమిత్ షా చేసిన సూచనల్లో ఉన్నాయి.

‘హోంమంత్రి అమిత్ షా సూచనల మేరకు ఆర్‌టిపిసిఆర్ టెస్టింగ్ సామర్థాన్ని రోజుకు 27,000నుంచి 37,200కు పెంచడం జరిగింది. ఢిల్లీలో నవంబర్ 15న 12,055 ఆర్‌టిపిసిఆర్ పరీక్షలు నిర్వహించగా, నవంబర్ 19న 30,735 శాంపిళ్లను సేకరించడం జరిగింది’ అని హోంమంత్రిత్వ శాఖ శనివారం ఒక ట్వీట్‌లో తెలిపింది. ఢిల్లీలో వైద్య సిబ్బంది సామర్థాన్ని పెంచడానికి సాయుధ బలగాలనుంచి పారా మెడికల్ సిబ్బందిని, వైద్యులను ఢిల్లీకి పంపిస్తామని కూడా అమిత్ షా ఉన్నతస్థాయి సమావేశంలో తెలియజేశారు. అంతేకాక వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న బాధితులకు ప్లాస్మా దానం చేయడాన్ని అనుమతించేందుకు ప్రోటోకాల్స్‌ను సిద్ధం చేయాలని కూడా ఆయన సూచించారు.

ICMR has increased RT pcr testing capacity in delhi