*నేడు అధికారికంగా ప్రకటించనున్న సిఎం కెసిఆర్
*నేడు ప్రగతి మైదానంలో సిఎం బహిరంగ సభ
*సభ ప్రాంగణం ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి అల్లోల
*బహిరంగ సభకు పోలీసుల భారీ బందోబస్తు
మన తెలంగాణ/మంచిర్యాల ప్రతినిధి గుర్తింపు సంఘంగా ఎన్నికల్లో టిబిజికెఎస్‌కు గుర్తింపు వచ్చినప్పటికీ అంతర్గత కలహాల వల్ల నేటికి సారథిని ఎన్నుకోలేదు. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరిగి నాలుగు నెలలు గడుస్తుండగా ఇప్పటి వరకు సిఎం కెసిఆర్ స్వయంగా నాయకత్వం వహించే కార్యవర్గాన్ని జల్లెడపట్టారు. ఎట్టకేలకు పాత కార్యవర్గాన్నే కొనసాగించే అవకాశాలు కనిపిస్తుండగా మంగళవారం శ్రీరాంపూర్‌లోని ప్రగతి మైదానంలో జరిగే బహిరంగ సభలో టిబిజికెఎస్ సారథితో పాటు కార్యవర్గాన్ని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. టిబిజికెఎస్‌లో అంతర్గత కలహాల వల్ల కోర్టుల వరకు వెళ్లి కార్మికుల్లో అబాసుపాలయ్యారు. సింగరేణిలోని 11 డివిజన్‌లకు గాను 9 డివిజన్‌లలో కార్మికులు మళ్లీ టిబిజికెఎస్‌కే పట్టం కట్టగా ఇప్పటి వరకు ప్రాతినిథ్య కార్యవర్గాన్ని ఏర్పాటు చేయలేదు. గతంలో మాదిరిగా కాకుండా స్వయంగా సిఎం కేసిఆర్ రంగంలోకి దిగి టిబిజికెఎస్ సారథితో పాటు ఏరియాల వారికి ఉపాధ్యక్షులను ఎంపిక చేసే విషయంలో అనేక కసరత్తులు చేసి, కార్మికుల్లో మంచి పేరు ఉన్న నాయకులను ఎంపిక చేసినట్లు సమాచారం. అదే విధంగా కారుణ్య నియామకాల విషయంలో సిఎం కేసిఆర్ సర్వీస్ నిబంధనల ప్రకారం రెండు సంవత్సరాలు సర్వీస్ ఉన్న వారికి ఉద్యోగాలు ఇచ్చే విషయంలో కసరత్తులు చేస్తుండగా బహిరంగ సభలో అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సిఎం సభకు భారీగా కార్మికుల సమీకరణ
శ్రీరాంపూర్‌లోని ప్రగతి మైదానంలో మంగళవారం జరిగే సిఎం కేసిఆర్ బహిరంగ సభకు భారీగా కార్మికులను సమీకరిస్తున్నారు. ఏరియాల వారిగా వాహనాలను ఏర్పాటు చేసి, కార్మికులను బహిరంగ సభకు తరలించేందుకు ప్రజా ప్రతినిధులతో పాటు సింగరేణి అధికారులు యత్నిస్తున్నారు. కాగా సింగరేణి యాజమాన్యం ఇప్పటికే సిఎం సభ సందర్బంగా కార్మికులకు సెలవు దినం ప్రకటించింది. రామగుండం, శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి, రామకృష్ణాపూర్,గోలేటీ ఏరియాల నుంచి కార్మికులను పెద్ద ఎత్తున తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ప్రగతి మైదానంలో భారీగా ఏర్పాట్లు
సిఎం రాక సందర్భంగా ప్రజాప్రతినిధులు , అధికారులు సోమవారం భారీ ఏర్పాట్లు చేశారు. దేవాదాయ, గృహణ నిర్మాణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు విప్ నల్లాల ఓదెలు, ఎంఎల్‌ఏ దివాకర్‌రావు, కలెక్టర్ ఆర్వీకర్ణన్ , డిసిపి వేణుగోపాల్‌రావులు ఏర్పాట్లను పరిశీలించారు. దీంతో పాటు సింగరేణి శ్రీరాంపూర్ ఏరియా జిఎం సుభాని సైతం ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రగతి మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నందు వలన వేదికను ఏర్పాటు చేశారు. అంతే కాకుండా హెలిప్యాడ్ దిగే సమయంలో బందోబస్తు చర్యలను పర్యవేక్షించారు.
సిఎం సింగరేణి పర్యటన వివరాలు
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మంచిర్యాల పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. 2 గంటలకు ఆదిలాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 2.30 గంటలకు మంచిర్యాల చేరుకొని, మొదట కలెక్టర్ నూతన కార్యాలయం భవనానికి శంకుస్థాపన చేస్థారు. అక్కడి నుండి శ్రీరాంపూర్ సింగరేణి విశ్రాంతి భవనానికి చేరుకొని, 3 గంటలకు కార్మిక వాడల్లో పర్యటించి, అనంతరం ప్రగతి మైదానంలో జరిగే బహిరంగ సభలో కార్మికులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.