Home ఎడిటోరియల్ ది పవర్ అఫ్ నోటా

ది పవర్ అఫ్ నోటా

Identity beats policy when it comes to voter choices

ఓటిచ్చేటప్పుడే ఉండాలె బుద్ధి అన్నాడు ప్రజాకవి కాళోజీ.. ఎన్నికల ప్రజాస్వామ్యంలో ప్రజల్లో వచ్చిన మార్పు ఆయన మాటల్ని నిజం చేస్తున్నాయి. ఓటు అనే రెండక్షరాలకు ప్రపంచ గతిని మార్చే శక్తి ఉంది. ఓటు వ్యక్తి అస్తిత్వాన్ని గుర్తిస్తుంది, వ్యవస్థ మార్పుకు నాంది పలుకుతుంది. కాని ఓటు విలువ చాలా తక్కువ మందికి తెలుసు. ఓటర్లకు ఇష్టం ఉన్నా లేకున్నా ఎవరికో ఒకరికి ఓటు వేయాలనే ఉద్దేశంతో ఓటు వేస్తున్నారు. చాలాసార్లు ఎన్నికలలో నిలబడిన అభ్యర్థులు ఎవరూ తమకు నచ్చకపోతే వోటింగ్‌కు దూరంగా ఉండడం జరుగుతుంది. దానివలన కొన్నిసార్లు నిజమైన అభ్యర్థికి చాల నష్టం జరిగే అవకాశం ఉంది. అలాగే సరికానివాడు అందలం ఎక్కే పెను ప్రమాదం ఉంది. దీని అన్నిటికి సరైన మందు నోటా (నన్ ఆఫ్ ది ఎబోవ్). 2014కు ముందు వరకూ మన దేశంలో అభ్యర్థులను తిరస్కరించే అవకాశం లేకుండా పోవడంతో తప్పనిసరిగా ఎవరినో ఒకరిని ఎంచుకోవలసిన పరిస్థితి వచ్చింది.

2014 సార్వత్రిక ఎన్నికల్లో మొట్టమొదటిసారి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నోటా అవకాశాన్ని ఓటర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఆ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా 1.1శాతం (60 లక్షలు) ఓట్లు నోటాకు పోలయ్యాయి. ఆ తర్వాత జరిగిన పలు అసెంబ్లీ ఎన్నికల్లో నోటా ప్రాధాన్యం విస్తృతంగా పెరుగుతూ వచ్చింది. చివరకు విజేతకు, ఓడిపోయిన అభ్యర్థికి మధ్య ఉన్న ఓట్ల వ్యత్యాసం కంటే కూడా ఎక్కువ ఓట్లు నోటాకు పోలవుతున్నాయి. ఇప్పుడు అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించేంత కీలకంగా నోటా మారిపోయింది.

ఒకవేళ ఏదైన నియోజకవర్గంలో నిలబడిన అభ్యర్థులకు పడిన ఓట్లకన్నా నోటాకు ఎక్కువ మద్దతు పలికితే అక్కడి గెలుపు చెల్లదు. ఆ నియోజకవర్గం నుంచి తిరిగి ఎన్నికల ప్రక్రియ, నోటిఫికేషన్ ఇవ్వవలసి ఉంటుంది. అయితే నోటా అనేది ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రంపై ఉన్నదనే విషయం చాలా మంది ఓటర్లకు తెలియదు. ఓటరు పోలింగ్ బూత్‌లోకి వెళ్లగానే ఈవీఎంలపై వివిధ పార్టీలకు చెందిన గుర్తులే కనిపిస్తాయి ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులు నచ్చకపోతే తిరస్కరణ ఓటు వేసే అధికారాన్ని కల్పిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటర్లకు అవకాశం కల్పించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో అభ్యర్థుల గుర్తుతోపాటు నోటా ను ఏర్పాటు చేశారు. ఎవరికైనా ఓటు వేయాలంటే సదరు అభ్యర్థికో, పార్టీకో ఓ గుర్తు వుంటుంది. ఆ గుర్తుకు ఓటర్లు ఓటు వేస్తూ ఉంటారు. అయితే, ఇప్పుడు పోటీలో వున్నవాళ్ళెవరికీ నేను ఓటు వేయడం లేదు అనే ఆప్షన్‌ను ఈవీఎంలలో పొందుపరిచారు. ఆ బటన్ నొక్కితే సదరు ఓటరు ఓటు ఎవరికీ పడదు. కానీ ఓటు హక్కును వినియో గించుకున్నట్టే.

ఇలాంటి అవకాశం ఇప్పటికే చాలా దేశాల్లో ఓటర్లకు అందుబాటులో ఉండగా, అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్‌లో మాత్రం కాస్త ఆలస్యంగా ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. ‘నోటా’ను అందుబాటులోకి తేవాలనుకుంటున్నట్లు ఎన్నికల కమిషన్ 2009లో తొలిసారిగా సుప్రీంకోర్టుకు చెప్పింది. ప్రభుత్వం దీనికి వ్యతిరేకించినా, పౌర హక్కుల సంస్థ పీయూసీఎల్ దీనికి మద్దతుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఎట్టకేలకు ఎన్నికల్లో ‘నోటా’ను అమలులోకి తేవాలంటూ సుప్రీంకోర్టు 2013 సెప్టెంబర్ 27న రూలింగ్ ఇచ్చింది.

అక్షరాస్యులకు ఎలాంటి సమస్య లేకపోయినా, నిరక్షరాస్యులకు ఇది ఇబ్బందికరమని, నోటా ఉందనే విషయం తెలిసే విధంగా ఏదైన గుర్తు కేటాయిస్తే బాగుంటుందనే ప్రముఖ రచయిత సౌదా అరుణహైకోర్టులో ‘పిల్’ దాఖలు చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన హైకోర్టు, ‘నోటా’కు క్రాస్ గుర్తు కేటాయించాలని, ఎన్నికల కమిషన్‌కు సూచించింది. 2015 సెప్టెంబర్ నుంచి దీనికి క్రాస్ గుర్తును కూడా ఖరారు చేశారు.
నిజానికి అభ్యర్థులెవరూ నచ్చకుంటే తిరస్కార ఓటు వేసే హక్కును భారత రాజ్యాంగం ఎప్పుడో కల్పించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 49 (ఓ) సెక్షన్ కింద ఓటర్లు ఈ హక్కును ఉపయోగించుకునే వీలుంది. పోలింగ్ బూత్‌లోని ప్రిసైడింగ్ ఆఫీసర్ వద్దకు వెళ్లి, దీనికోసం 17-ఏ ఫారం తీసుకుని, ఫలానా అభ్యర్థిని తిరస్కరిస్తున్నానని పేర్కొంటూ సంతకం లేదా వేలిముద్ర వేసి బ్యాలెట్ పెట్టెలో వేయవచ్చు.ఇది రహస్య బ్యాలెట్ విధానానికి విరుద్ధమైనదని, ఓటరు భద్రత దృష్ట్యా ఇది మంచి పద్ధతి కాదని విమర్శలు వచ్చాయి. అయితే, అప్పట్లో చాలామంది ఓటర్లకు దీనిపై అవగాహన ఉండేది కాదు.

ఈవీఎంలు వాడుకలోకి రావడంతో ఎన్నికల కమిషన్ చొరవ మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలతో ‘నోటా’ అందుబాటులోకి వచ్చింది. దీనిపై విస్తృత ప్రచారం జరగడంతో ఢిల్లీ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చాలామంది ఓటర్లు ‘నోటా’కు ఓటు వేశారు. కొన్నిచోట్ల గెలుపొందిన అభ్యర్థికి, ఓటమి పాలైన సమీప ప్రత్యర్థికి నడుమనున్న ఓట్ల వ్యత్యాసం కంటే ‘నోటా’కే ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఛత్తీస్‌గఢ్‌లో ‘నోటా’కు అత్యధికంగా 3.1 శాతం ఓట్లు పడ్డాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో 2 శాతం, ఢిల్లీలో 1 శాతం ఓట్లు ‘నోటా’కు పడ్డాయి.
ఓటు హక్కు ఎంత ముఖ్యమో..దాన్ని అంతే పవిత్రంగా, నిబద్ధంగా వినియోగించడమూ అంతే రాజ్యాంగ అవసరం. రాజ్యాంగం మనకు కల్పించిన ఈ ఓటు హక్కు మాటలతో మైమరపించి, అరచేతిలో వైకుంఠం చూపించి తరువాత మరచిపోయే అభ్యర్థులకు తగిన శాస్తిని నోటా ద్వారా చేయవచ్చు. నోటా నొక్కడం ద్వారా తాను మిమ్మల్ని నమ్మలేనని మొహం మీదనే చెప్పేయవచ్చు.

ప్రత్యర్థి కంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా అయిదేండ్లపాటు ఎమ్మెల్యేగానో.. ఎంపీగానో అధికారం అనుభవించే అవకాశమిచ్చిన వ్యవస్థ మనది. నోటా వల్ల వోట్ల తేడాతో అభ్యర్థుల జాతకం గల్లంతు అయ్యే ప్రమాదం ఉంది .కావున అభ్యర్థులు జాగ్రత్తగా వ్యవహరిస్తారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో 30శాతం కంటే ఎక్కువ ఓట్లు సంపాదించి విజేతలుగా నిలిచిన ప్రజాప్రతినిధుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది.అటువంటి వారికి నోటా అనేది ఒక గట్టి హెచ్చరిక.

ఎన్నికల సమయంలో అభ్యర్థులు చేసే వాగ్దానాలకు, మాటలకు ఒక్కోసారి అంతులేకుండా పోతుంది. శుష్కవాగ్దానాలతో, కల్లబొల్లి కబుర్లతో ఓటర్లను ఏమార్చి వారితో ఓట్లు వేయించుకుని తరువాత మొహం తిప్పే అభ్యర్థుల వైఖరిపై ఏమీ చేయాలో తెలియక, ఎలా ఆగ్రహం వ్యక్తం చేయాలో తెలియక ప్రజలు కొట్టుమిట్టాడేవారు. ఇలాంటి సమయంలో వారికి లభించిన ఆయుధం ’నోటా’. మాటలగారడీ అభ్యర్థులను తాము ఎన్నుకోలేమంటూ వారిని తిరస్కరిస్తూ నోటాతోవారికి చెక్ పెట్టేందుకు ఓటర్‌కు ఇప్పుడు అవకాశం? లభించింది.

ప్రజాస్వామ్యంలో ఓటే ప్రధాన ఆయుధం. ప్రజలు ఓటేస్తే గెలుస్తారు. వేయకపోతే ఓడిపోతారు. మరి తిరస్కరిస్తే.. చెల్లకుండా పోతా రు. ఇప్పుడు చెల్లని ఓట్ల కంటే కూడా చెల్లని అభ్యర్థుల సంఖ్య పెరిగిపోతోంది. ఈవీఎమ్‌ల పుణ్యమా అని ప్రజాస్వామ్య భారతంలో ప్రజలకు ఈ మహదవకాశం దక్కింది. ఉన్న వారిలో ఎవరో ఒకర్ని చచ్చినట్టు ఎన్ను కోవాల్సిన పనిలేదు. వారెవరూ వద్దనుకునే అవకాశం అందిరావడంతో జనం రోజురోజుకూ, ఎన్నిక ఎన్నికకూ నోటా బాట పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఉన్న అభ్యర్థుల కంటే ‘నోటా’ కాటుపడ్డ ఓట్లే ఎక్కువగా ఉన్న దాఖలాలూ ఉన్నాయి. అయితే నోటా వల్ల ఇంత మంచి జరుగుతున్నా ఎందుకో ప్రభుత్వం కానీ , ఎన్నికల సంఘం కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ దాని గురించి ఎక్కువ ప్రచారం చేస్తునట్లు కనిపించదు. సరైన ప్రచారం లభిస్తే దేశంలో ఎదో ఒక ఎన్నికలలో నిలబడిన అభ్యర్థుల కంటే నోటా కు ఎక్కువ వోట్లు వచ్చి ఆ ఎన్నిక చెల్లకుండాపొతే అపుడు కానీ అభ్యర్థులకు సరైన గుణపాఠం లభించదు.

Identity beats policy when it comes to voter choices

Telangana Latest News