Home తాజా వార్తలు బ్యాంకులకే ఎక్కువ నష్టం

బ్యాంకులకే ఎక్కువ నష్టం

bsns

ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ను ప్రభుత్వం కాపాడితే బ్యాంకులకే ఎక్కువ నష్టం
న్యూఢిల్లీ : అప్పుల భారంతో సతమతమవుతున్న ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ గ్రూప్‌ను ప్రభుత్వ నియంత్రణలోకి తెస్తే విజయం పొందవచ్చని, అయితే అంతిమంగా అది బ్యాంకుల నష్టాలకు దారితీస్తుందని నివేదికలు పేర్కొంటున్నాయి. సోమవారం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీస్ లిమిటెడ్(ఐఎల్‌ఎఫ్‌ఎస్)ను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సంస్థకు రూ.91000 కోట్ల అప్పులు ఉన్నాయి. ఐఎల్‌ఎఫ్‌ఎస్, దీని అనుబంధ సంస్థలు బకాయిలు చెల్లింపుల్లో విఫలం కావడంతో బ్యాంకింగ్ వ్యవస్థకు ముప్పుగా మారాయి. దీంతో ఐఎల్‌ఎఫ్‌ఎస్ బోర్డు సభ్యులందరి స్థానంలో కొత్త వారిని నియమించేందుకు అనుమతివ్వాలని ప్రభుత్వం ఎన్‌సిఎల్‌టి(నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్)కి పిటిషన్ దాఖలు చేయగా ఆమోదం లభించింది. ఈ నెల 8న కొత్త బోర్డు సమావేశం కానుంది. కొత్త బోర్డు రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసి తదుపరి విచారణ అక్టోబర్ 31లోగా అందజేయనుంది. ప్రస్తుతం రూ.91000 కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన ఐఎల్‌ఎఫ్‌ఎస్ ఉదంతం నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు(ఎన్‌బిఎఫ్‌సి)లను క్లిష్టంగా మార్చింది. పరిస్థితి విషయమించడంతో రంగంలోకి దిగిన కేంద్రం.. ఎన్‌సిఎల్‌టి వద్ద తన వాదనలు వినిపించి పాత బోర్డును రద్దు చేయించింది. ఎన్‌సిఎల్‌టి పాత బోర్డును తక్షణం రద్దు చేసి కొత్త బోర్డును నియమించింది. కొత్త బోర్డు సభ్యుల్లో కోటక్ బ్యాంక్ ఛైర్మన్ ఉదయ్ కొటక్, ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి జిసి చతుర్వేది, సెబీ మాజీ చీఫ్ జిఎన్ బాజ్‌పేయ్, మాజీ ఐఎఎస్ అధికారులు వినీత్ నాయర్, మాలినీ శంకర్ ఉన్నారు. కొత్త బోర్డు సభ్యులతో మరికొంత మందిని కూడా నియమించే అవకాశాలున్నాయి. మొదటిసారి సభ్యుల బృందం భేటీ అయిన తర్వాత ఎవరు ఈ బోర్డుకు ఛైర్మన్‌గా వ్యవహరించాలి అనే అంశాన్ని వాళ్లలో వాళ్లే చర్చించుకుని ఓ నిర్ణయానికి వస్తారు. గతంలో సత్యం కంప్యూటర్స్ వివాదం విషయంలో కూడా ప్రభుత్వం రంగంలోకి దిగి కొత్త బోర్డును నియమించింది.
ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ గ్రూప్ షేర్లలో జోష్
ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో వరుసగా రెండో రోజు ఇన్వెస్టర్లు ఈ గ్రూప్‌లోని షేర్ల కొనుగోలుకి ఆసక్తి చూపారు దీంతో ఈ గ్రూప్‌నకు చెందిన షేర్లు భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. కొనుగోలుదారులే తప్ప అమ్మేవాళ్లు కరవుకావడంతో మూడు లిస్టెడ్ కంపెనీల షేర్లూ సెబీ అనుమతించినమేరకు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. ఎన్‌ఎస్‌ఇలో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఇంజినీరింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్ 20 శాతం పెరిగి రూ. 19.10 వద్ద ముగిసింది. ఈ బాటలో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ట్రాన్స్‌పోర్టేషన్ నెట్‌వర్క్ 20 శాతం పెరిగి రూ. 32.15 వద్ద ముగిసింది. ఇక ఐఎల్ అండ్‌ఎఫ్‌ఎస్ ఇన్వెస్ట్‌మేనేజర్స్ 10 శాతం పెరిగి రూ. 9.35 వద్ద ముగిసింది.