Home రాష్ట్ర వార్తలు గుర్తింపు కార్డు ఉంటేనే ఓటు

గుర్తింపు కార్డు ఉంటేనే ఓటు

Untitled-6621 గుర్తింపు కార్డులలో ఏది ఉన్నా చాలు : జిహెచ్‌ఎంసి ఎన్నికల అధికారి జనార్దనరెడ్డి
సిటీబ్యూరో: గుర్తింపు కార్డు ఉంటేనే ఓటింగ్‌కు అనుమతి ఇస్తామని జిహెచ్ ఎంసి ఎన్నికల అధికారి, కమిషనర్ డాక్టర్ బి.జనార్ధన్‌రెడ్డి వెల్ల డించారు. గుర్తింపు కార్డులేని ఇతరులు పోలింగ్ బూత్‌లోకి ప్రవేశిస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటరు గుర్తింపు కార్డులేని ఓటర్లకు ఎంపిక చేసిన 21 ఇతర గుర్తింపు కార్డులు ఉన్నా ఓటింగ్‌కు అవకాశం కల్పిస్తారని వెల్ల డించారు. డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంకు ఖాతా పాస్‌పుస్తకం, పాన్ కార్డు లాంటివి ఉంటే ఓటు వేయవచ్చని వివరించారు. పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు వెళ్లారని చెప్పారు. ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగిందన్నారు. మంగళవారం ఉదయం 5ః30 గంటలకే ఎన్నికల సిబ్బంది సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో సిద్ధంగా ఉండాలని సూచించారు. ఉదయం 6 గంటల నుంచి 6ః15 గంటల మధ్య మాక్ పోలింగ్ నిర్వహిస్తారన్నారు. 6ః55 గంటలకు ఈవిఎంలను సీట్ చేయడం జరుగుతుందన్నారు. 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం అవుతుందన్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందన్నారు. సాయంత్రం 5 గంటలలోపు వచ్చిన ఓటర్లందరికీ ఓటు వేయడానికి సమయం కేటాయిస్తామన్నారు. ఈవిఎంలలో ఏవైనా సాంకేతిక లోపం తలెత్తితే వెంటనే సరిచేయడానికి ప్రత్యేక నిపుణుల నియామకం చేశామన్నారు. వార్డుకు ఇద్దరు ఇసిఐఎల్ ఇంజనీరింగ్ నిపుణులను మొత్తం 3 వందలమంది అందుబాటులో ఉంటారని వెల్లడించారు. వికలాంగులు, వృద్ధులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశామన్నారు. అంధులకు ప్రత్యేక బ్రెయిలీ లిపి బ్యాలెట్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. పోలింగ్ బూత్‌లలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటివరకు 2,58,44,300 రూపాయలను స్వాధీనం చేసుకున్నామన్నారు. 2,25,956 అక్రమ కటౌట్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, పోస్లర్లను తొలగించామన్నారు. రూ. 1,05,720 విలువైన అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.