Thursday, April 25, 2024

హైదరాబాద్ ఐఐటి టెస్ట్‌కిట్

- Advertisement -
- Advertisement -
IIT Hyderabad developed coronavirus test kit
20 నిమిషాలలో కరోనా నిర్ధారణ

న్యూఢిల్లీ : కోవిడ్ 19 వైరస్ నిర్థారణ పరీక్షల ఘట్టంలో హైదరాబాద్ ఐఐటి పరిశోధక విద్యార్థులు అత్యద్భుత విజయం సాధించారు. వైరస్ సోకిందీ? లేనిదీ కేవలం 20 నిమిషాలలో తేల్చే టెస్ట్ కిట్‌ను రూపొందించారు. హైదరాబాద్‌లోని భారతీయ సాంకేతిక సంస్థ ఐఐటికి చెందిన పరిశోధకుల బృందం ఈ కిట్‌ను ఆవిష్కరించింది. కేవలం 20 నిమిషాల సమయంలోనే రోగ నిర్థారణ చేయడం ఇదేతొలిసారి. ఫలితాన్ని వెలువరించడానికి ఎక్కువ సమయం పట్టకపోవడంతో రోగ చికిత్సకు సత్వరంగా వీలేర్పడుతుంది. తమ సాధన గురించి పరిశోధకబృందం తెలియచేసుకుంది.

ప్రస్తుతం కోవిడ్ వైరస్ పరీక్షల కోసం ఆర్‌ఎన్‌ఎ డిఎన్‌ఎ విశ్లేషణలతో కూడిన ఆర్‌టి పిసిఆర్ పద్ధతిని వాడుతున్నారు. అయితే ఇందుకు భిన్నంగా తాము ప్రత్యామ్నాయ పద్థతిని వినియోగించుకుని ఈ టెస్ట్‌కిట్‌ను రూపొందించినట్లు పరిశోధక బృందం తెలిపింది. ఇక ఈ టెస్ట్ కిట్‌ను కేవలం రూ 550 ల వ్యయంతో తయారుచేసినట్లు , పెద్ద ఎత్తున దీనిని తయారుచేయడం ద్వారా దీనిని కేవలం రూ 350 స్థాయిలో అందుబాటులోకి తీసుకురావచ్చునని బృందం తెలిపింది. ఈ టెస్ట్ కిట్‌కు పెటేంట్ హక్కుల కోసం ఇప్పుడు ఈ బృందం దరఖాస్తు చేసుకుంది. కరోనా వైరస్ లక్షణాలున్న వారికి లేనివారికి కూడా రోగ నిర్థారణ ప్రక్రియను కేవలం 20 నిమిషాలలోనే ఇది తెలియచేస్తుందని వివరించారు. ఆర్‌పిసిఆర్ పద్ధతికి భిన్నంగా దీనిని రూపొందించినట్లు ఐఐటి హైదరాబాద్‌లోని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌విభాగానికి చెందిన ప్రొఫెసర్ శివ్ గోవింద్ సింగ్ తెలిపారు.

తేలిగ్గా తీసుకువెళ్లగలిగే కిట్

ఈ కిట్‌ను ఎక్కడికైనా తేలిగ్గా తీసుకువెళ్లవచ్చు. అత్యంత సురక్షిత రీతిలో టెస్టులు చేయవచ్చునని సింగ్ వివరించారు. కోవిడ్ జన్యువులో చెక్కుచెదరకుండా ఉండే విశిష్ట పరిరక్షిత రిజియన్స్ సీక్వెన్స్‌ను గుర్తించినట్లు, దీనిని ప్రాతిపదికగా చేసుకుని టెస్టు కిట్‌ను తయారుచేశామని వివరించారు. కరోనా వైరస్‌కు టెస్టు కిట్‌లను రూపొందించిన రెండో విద్యాసంస్థగా ఇప్పుడు హైదరాబాద్ ఐఐటి ఖ్యాతి గడించింది. తొలుత ఢిల్లీ ఐఐటి పిసిఆర్ ప్రాతిపదికన ఉండే నిర్థారణ ప్రక్రియను రూపొందించింది. దీనికి సంబంధించి ఐసిఎంఆర్ అనుమతి తీసుకుంది.

ప్రస్తుత టెస్టింగ్ పద్ధతులు ప్రోబ్ బేస్డ్ అని, తమ విద్యార్థులు ప్రోబ్ ఫ్రీ విధానంతో టెస్ట్ కిట్‌ను రూపొందించినట్లు, దీనితో ఖచ్చిత నిర్థారణలో రాజీ లేకుండా కిట్ తయారీ వ్యయం కూడా తగ్గుతుందని హైదరాబాద్ ఐఐటి తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తిలో శనివారం భారతదేశం ఇటలీని దాటేసింది. ఒక్కరోజే 9887 కేసులు నమోదు అయ్యాయి. త్వరితగతిన వైరస్ వ్యాప్తి క్రమంలో అతివేగంగా రోగ నిర్థారణ పరీక్షల ప్రక్రియ అత్యవసరం అయిన దశలో హైదరాబాద్ కిట్‌కు ప్రాధాన్యత ఏర్పడింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News