Home రాష్ట్ర వార్తలు ఐకియాలో 30% లోకల్ సామగ్రి

ఐకియాలో 30% లోకల్ సామగ్రి

IKEA opens India's first store in Hyderabad

దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్‌లో స్వీడిష్ హోం ఫర్నిషింగ్ కంపెనీ
హైటెక్ సిటీలో ప్రారంభించిన మంత్రి కెటిఆర్
13 ఎకరాలలో 4లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొన్న ప్రతిష్ఠాత్మక కంపెనీ స్టోర్

మన తెలంగాణ/హైదరాబాద్: స్వీడన్‌కు చెందిన ప్రముఖ హోమ్ ఫర్నీషింగ్ కంపెనీ రిటైయిలర్ ఐకియా భారతదేశంలో మొట్టమొదటి హోమ్ ఫర్నిషింగ్ స్టోర్‌ను హైదరాబాద్‌లో గురువారం పరిశ్రమల శాఖ మంత్రి కెటి. రామారావు ప్రారంభించారు. హైటెక్ సిటీ సమీపంలో 13 ఎకరాల స్థలంలో 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐకియా హైదరాబాద్ స్టోర్  ఏర్పాటు చేసింది. ఈ స్టోర్ కోసం  ఐకియా రూ.1000 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఈ సందర్భంగా మంత్రి కె తారక రామారావు మాట్లాడుతూ హైదరాబాద్‌లో అంతర్జాతీయ వాణిజ్య సంస్థలు పెట్టు బడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నాయన్నారు. దేశంలోనే మొట్టమొదటి ఐకియా షో రూంను హైటెక్ సిటీలో ప్రారంభించడాన్ని స్వాగతిస్తున్నమన్నారు. స్వీడిస్ సంస్థ ఐకియా ఈ రోజు భారత దేశానికి రావడం, అందులోనూ హైదరాబాద్‌ను ఎంపిక చేసుకోవడం చాలా సంతోషమని, ఆ సంస్థ సముచితమైన ధరల శ్రేణిలో ఇక్కడ వాణిజ్య కార్యకలాపాలను నిర్వహించడం నిజంగా హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఈ స్టోర్‌లో 30 శాతం తెలంగాణ లోకల్ వస్తువుల విక్రయాలకు ఉంచారు. ఇంకా తెలంగాణకు సంబంధించిన ఇతర వస్తువులను ప్రదర్శించాలని  కోరగా ఆ సంస్థ అంగీకరించింది. బహుశ రాబోయే రెండేళ్ల వరకు భారత దేశంలో ఇంకెక్కడా కూడా ఐకియా కొత్త స్టోర్లను ఏర్పా టు చేయదని భావిస్తున్నామని, సులభతర వాణిజ్య విధానం, అలాగే వాణిజ్య అవకాశాల కల్పన వంటి అంశాల్లో తెలంగాణ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోందన్నారు.

ఈస్టోర్‌లో 7500 ఉత్పత్తులతో కొలువు దీరగా ఇందులో వెయ్యి ఉత్పత్తులు మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులేనని కంపెనీ అధికారులు చెబుతున్నారని, నిజంగా ఇది హర్షించదగ్గ విషయమన్నారు. గార్డెనింగ్, పూల మొక్క లు వంటి  వాటి విక్రయాలను కూడా ఐకియా నిర్వహించడాన్ని కెటిఆర్ స్వాగతించారు. స్టోర్‌ను కలియ తిరిగిన మంత్రి కెటిఆర్ పూలమొక్కలు ఉన్న చోట ఆగి ఆ మొక్కలను ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా ఐకియా గ్రూపు సిఈఓ జెస్పర్ బ్రాడిన్ మాట్లాడుతూ కేవలం రూ.250 ధరల్లోపే అత్యధిక వస్తువులను తాము అందుబాటులోకి తెచ్చామన్నారు. దాదాపు 2000 మందికి ప్రత్యక్షంగా,3000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. ఉపాధి కల్పనలో ఇక్కడ స్థానికులకు పెద్ద పీట వేశారు. ఇక్కడ పని చేస్తున్న ఉద్యోగుల్లోనూ 50 శాతానికి పైగా మహిళలే ఉండడం విశేషం. వస్త్ర ఉత్ప త్తుల్లోనూ 100 శాతం వరకు కాటన్ వస్త్రాలనే ఇక్కడ విక్రయిస్తున్నారు. అలాగే ఎల్‌ఈడి విద్యుత్ బల్పులనే ఇక్కడ విక్రయిస్తున్నారు. షాపింగ్‌కు వచ్చినప్పుడు పిల్లలు కూడా వస్తారు కాబట్టి వారి కోసం ప్రత్యేక ప్లే గ్రౌండ్‌ను కూడా ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోని ఇతర స్టోర్లు తమ ఆయా ఉత్పత్తులపై జిఎస్‌టి తదితర  ధరలు కూడా కలిపి భారీ ధరల్లో విక్రయిస్తుండగా  ఐకియా మాత్రం వినియోగదారులపై పన్ను భారాలు మోపకుండా తక్కువ ధరల్లోనే ఫర్నీచర్ వస్తువులు అందుబాటులో ఉన్నాయి.

ఐకియా ప్రత్యేకతలు:-

దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో స్టోర్‌ను ప్రారంభించిన ఐకియా
రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో స్టోరు ఏర్పాటు
హైటెక్ సిటీకి సమీపంలో రూ.1000 కోట్ల వ్యయంతో 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో స్టోర్
ఒకేసారి వెయ్యి మంది కూర్చునే సామర్థ్యతో రెస్టారెంట్ కూడా ఏర్పాటు చేసిన కంపెనీ
7,500 రకాల ఫర్నిచర్, ఫర్నిషింగ్, వంటింటి సామగ్రి, దాదాపు 1,000 రకాల ఉత్పత్తుల ధర రూ.200 లోపే ఉండడం విశేషం
విక్రయించే వస్తువుల్లో 20 శాతం వరకూ ఇక్కడ తయారైనవేనని – ఐకియా వెల్లడి
ప్రత్యక్షంగా దాదాపు 2000 మందికి ఉపాధి, ఇందులో సగం మంది మహిళా ఉద్యోగులు
పరోక్షంగా మరో 3000 మందికి ఉపాధి
ఏటా 70 లక్షల మంది ఈ స్టోర్‌ను సందర్శిస్తారని ఐకియా అంచనా
వచ్చే ఏడాది ముంబాయిలో రెండో స్టోర్‌ను ప్రారంభించనున్న కంపెనీ
ముంబై స్టోర్ 2019లో అందుబాటులోకి రానుంది
దేశంలో 40 నగరాల్లో ఔట్‌లెట్లను ఏర్పాటు చేయాలన్నది ఐకియా ప్రణాళిక
ఆ తర్వాత బెంగళూరు, గురుగ్రామ్‌లో ఐకియా కేంద్రాలు
20 కోట్ల మంది కస్టమర్లను మూడేళ్లలో చేరుకోవాలని లక్ష్యం
2025 నాటికి 25కు పైగా సెంటర్లు ప్రారంభించేందుకు కసరత్తు
ఇప్పటివరకు భారత్‌లో రూ.5,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేసిన కంపెనీ