మనతెలంగాణ/జగిత్యాల : జర్నలిస్టులపై పోలీసులు పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. స్థానిక కోదండ రామాలయం నుంచి జిల్లా ఎస్‌పి క్యాంప్ ఆఫీస్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించిన జర్నలిస్టులు, ఎస్‌పి క్యాంపు కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. అక్కడి నుంచి ప్రజావాణిలో ఉన్న జెసి రాజేశంను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు జె. సురేంద్రకుమార్ మాట్లాడుతూ జిల్లాలోని కొందరూ పోలీసు అధికారుల ప్రవర్తన వల్ల జర్నలిస్టులు స్వేచ్చగా విధులు నిర్వహించే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంతో ప్రజలకు మరింత దగ్గరయ్యేలా కార్యక్రమాలు చేపడుతున్నామని, పోలీసు ఉన్నతాధికారులు పేర్కొంటుండగా జిల్లాలోని కొందరు పోలీసు అధికారులు జర్నలిస్టుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ పత్రిక స్వేచ్చను హరించి వేస్తున్నారన్నారు. ఈ విషయమై గతంలో జిల్లా ఎస్‌పిని కలిసి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో శాంతియుత ఆందోళనకు దిగాల్సి వచ్చిందన్నారు. జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని, పత్రికా స్వేచ్చను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సమస్యలను పరిష్కరించనట్లయితే ఈ నెల 24న రాష్ట్ర డిజిపి కార్యాలయం ఎదుట యూనియన్ రాష్ట్ర నాయకులతో కలిసి ఆందోళన నిర్వహిస్తామన్నారు. ఈ నెల 26న కరీంనగర్‌కు రానున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి సమస్యను తీసుకెళ్తామన్నారు. జర్నలిస్టుల ఐక్యతను చాటేలా జిల్లాలోని అన్ని మండలాల నుంచి తరలివచ్చిన జర్నలిస్టులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండ స్వామి, నాయకులు గాజుల నాగరాజు, సఫియొద్దిన్, ఎం.డి. ఇమ్రాన్, సంపూర్ణచారి, కె. శ్రీనివాస్, అఖిల్, టి.వి. సూర్యం, రాజేందర్‌రెడ్డి, సుదీర్, శ్రీనివాస్, రాజారమేష్, అశోక్, తిరుపతిరెడ్డి, లింగారెడ్డి, శోభన్, రవీందర్, కిరణ్‌తో పాటు 18 మండలాలకు చెందిన జర్నలిస్టులు పాల్గొన్నారు.
జర్నలిస్టులపై అక్రమ కేసులను ఎత్తివేయాలి
- Advertisement -
- Advertisement -