Thursday, April 25, 2024

అక్రమ లేఅవుట్లపై ఉక్కుపాదం

- Advertisement -
- Advertisement -

KTR

 

పట్టణ ప్రగతి సభల్లో మంత్రి కెటిఆర్ హెచ్చరిక

తప్పుడు నిర్మాణాలను నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేసే అధికారాలు కొత్త మున్సిపల్ చట్టంలో ఉన్నాయి

బిల్డింగ్ అనుమతుల కోసం లంచం అడిగితే కలెక్టర్లకు ఫిర్యాదు చేయాలి
అక్రమ లేఅవుట్ల వల్ల ప్రభుత్వం భూమి కోల్పోతుంది, మున్సిపాల్టీలకు ఆదాయ నష్టం
ఇక ఎన్నికలు లేవు, రాష్ట్ర అభివృద్ధికే అంకితం : కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : అక్రమలేఅవుట్లపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర మున్సిపాలిటీ, పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి, టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అధికారులను ఆదేశించారు. అక్రమలేఅవుట్లతో ప్రభుత్వ స్థలాలు కోల్పోవడంతో పాటు మున్సిపాలిటీలకు ఆదాయం తగ్గుతుందని ఆయన చెప్పారు. అక్రమనిర్మాణాలకు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేసే అధికారాలు కొత్త మున్సిపల్ చట్టానికి ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ఇళ్లనిర్మాణాలకోసం లంచాలు అడిగితే నేరుగా కలెక్టర్లకు ఫిర్యాదులు చేయాలని ఆయన చెప్పారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి తమ,పర విభేధాలు లేవని ప్రతిపక్ష పార్టీలకు చెందిన శానసభ్యుల నుంచి వార్డు సభ్యులవరకు ఎలాంటి రాజకీయ వివక్ష లేకుండా అన్ని ప్రాంతాలను సమానంగా ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని ఆయన తెలిపారు. మరి నాలుగు సంవత్సరాలు ఎన్నికలు లేకపోవడంతో పూర్తి సమయం రాష్ట్రాభివృద్ధి కోసమేనని ఆయన చెప్పారు.

పార్టీలకు అతీతంగా అందరూ కలిసి పట్టణాభివృద్ధిలో పాలు పంచుకోవాలని కెటిఆర్ పిలుపునిచ్చారు. పట్టణప్రగతి కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్రంలో పర్యటిస్తున్న కెటిఆర్ బుధవారం జనగామజిల్లాలోని ధర్మకంచ బస్తీలో ఆకస్మిక పర్యటనచేశారు. అనంతరం భువనగిరిలో పట్టణప్రగతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ ధర్మకంచ బస్తిలో పారిశుధ్య సిబ్బందితో మాట్లాడారు. ఆతర్వాత బస్తీవాసులతో మాట్లాడి పారిశుద్ధం, పట్టణప్రగతిని వివరించారు. పట్టణ ప్రగతి కార్యక్రమం సందర్భంగా చేపడుతున్న కార్యక్రమాలపై ప్రజల సూచనలు, వివరాలను అడిగి తెలుసుకున్నారు. పట్టణాల్లో మరిన్ని స్వచ్ఛ వాహనాలను ఏర్పాటు చేయడంతో పాటు పారిశుద్ధ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించ నున్నట్లు చెప్పారు. పార్టీలకు అతీతంగా అందరూ కలిసి సమన్వయంతో పట్టణాభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. వార్డుల్లోని ప్రజలంతా పట్టణప్రజలేనని చెప్పారు.

మున్సిపాలిటీలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులకు నూతన మున్సిపాలిటీ చట్టంపై శిక్షణకార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రాథమికంగా వార్డు పారిశుద్ధ ప్రణాళిక, పట్టణ హరిత ప్రణాళిక, పట్టణ వాటర్ అడిట్ కార్యక్రమాలను చెపట్టాలని చెప్పారు. జనగామ మున్సిపాలిటీ పరిధిలో రాబోయే రెండు నెల్లో 100 టాయిలెట్స్ నిర్మించాలని ఆయన అధికారులకు చెప్పారు. నివాస ప్రాంతాల్లోకి పందులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. పారిశుద్ధ ప్రణాళికలో భాగంగా పట్టణానికి అవసరమైన స్వచ్ఛ వాహనాలు, పారిశుధ్య సిబ్బంది, డంప్‌యార్డ్ అభివృద్ధి, తడి,పొడి చెత్త సేకరణకు ప్రాధానాత్య ఇవ్వాలని ఆయన మున్సిపాలిటీ అధికారులకు చెప్పారు. పట్టణ హరిత ప్రణాళికను రూపొందించి పట్టణ బడ్జెట్‌లో నుంచి 10 శాతం ఖచ్చితంగా ఖర్చు చేయాలని, ఈ ప్రణాళికలో భాగంగా నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కల పెంపకం చేపట్టాలని ఆయన చెప్పారు.

నిధులు అడగడంతో పాటు పురపాలక చట్టంలో పేరొన్న భాధ్యతలను ఖచ్చితంగా నిర్వర్తించాలని ఆయన ఆదేశించారు. కౌన్సిలర్లు తమ బాధ్యతలను సంపూర్ణంగా నిర్వర్తిస్తే పట్టణానికి అవసరమైన నిధులను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అనంతరం కెటిఆర్ ఆగస్మికంగా భువనగిరిలోని పౌరసేవాకేంద్రాన్ని తనిఖీ చేశారు. పౌరులకు అందుతున్న సేవలను పరిశీలించారు. ఫిర్యాదులపై స్పందిస్తున్న తీరును మున్సిపాలిటీ కమిషనర్లు, మున్సిపాలిటీ సిబ్బందిని అడిగితెలుసుకున్నారు. ఫిర్యాదుదారులకు తప్పనిసరిగా రశీదులు ఇవ్వాలని కెటిఆర్ ఆదేశించారు. ఫిర్యాదుదారులకు ఇచ్చిన రశీదులను రిజిస్టర్లలో నమోదు చేసుకోవడంతో పాటు ఎప్పటిలోగా సమస్యలను పరిష్కరించారో రిజిస్టర్లలో పొందుపర్చాలని ఆదేశించారు. విద్యుత్ స్థంబాలకు వేలాడే వైర్లపై కెటిఆర్ స్పందిస్తూ తక్షణం క్రమబద్ధీకరించాలని ఆదేశించారు.

దేశంలో బీడి కార్మికులకు పెన్షన్ ఇస్తున్న ఏకైక నాయకుడు సిఎం కెసిఆర్ మాత్రమేనని కెటిఆర్ చెప్పారు. అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా ప్రజలమధ్యకు వెళ్లినప్పుడే సమస్యలు పరిష్కారం కావడంతో పాటు అభివృద్ధి వేగవంతం అవుతాయని కెటిఆర్ చెప్పారు. సిఎం కెసిఆర్ ప్రజాప్రతినిధులు ప్రజల్లోనే ఉండాలని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇళ్లనిర్మాణాలకోసం అధికారులు లంచాలు అడిగితే కలెక్టర్లకు ఫర్యాదులు చేయాలని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటంతోనే కొత్తజిల్లాలు, 12751 గ్రామపంచాయతీలు ఏర్పడ్డాయని ఆయన తెలిపారు.

పరుగులు తీసిన అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు
ముందస్తు సమాచారం లేకుండా జనగామ జిల్లాలోని ధర్మకంచ బస్తీలో పర్యటించడంతో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పరుగులు తీస్తూ వచ్చి పర్యటనలో పాల్గొన్నారు. నాయకులు, అధికారులు వచ్చేవరకు కొంతమంది స్థానికులతో కెటిఆర్ సమావేశమై వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు భూపాలపల్లి పట్టణప్రగతి కార్యక్రమం నుంచి హుటాహుటిన జనగామకు చేరుకున్నారు. అప్పటికే కొంత మంది స్థానికులతో కెటిఆర్ మాట్లాడారు. కొద్ది ఆలస్యంగా చేరుకున్న మంత్రి ఎర్రబెల్లి ధర్మకంచ(13వ వార్డు) గల్లీలో కెటిఆర్ తో కలిసి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జనగామలో అమలవుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమాలను కెటిఆర్‌కు వివరించి సలహాలను తీసుకున్నారు. సిఎం కెసిఆర్ పూర్తి చేసిన కాళేశ్వరం జలాల తరలింపుతో తాగునీటి సమస్య పరిష్కారం అయిందని తెలిపారు.

Illegal layouts are demolished
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News