Home నిజామాబాద్ పట్టపగలే మొరం అక్రమ రవాణా

పట్టపగలే మొరం అక్రమ రవాణా

Illegal Mud Transport in Nizamabad District

మనతెలంగాణ/బోధన్: మొరం అక్రమ రవాణాకు అడ్డుఅదుపు లేకుండ పోవడంతో పాటు రెవెన్యూ అధికారులే వెన్నుదన్నుగ నిలుస్తు అక్రమ మొరం రవాణాను పోత్రహిస్తున్నట్లు విమర్శలు తలెత్తుతున్నాయి. గత రెండు నెలలుగ నిరంతరాయంగ బోధన్,రుద్రూర్,ఎడపల్లి తదిత మండలాల నుండి మొరం జోరుగ రవాణా అవుతున్నప్పటికి అధికారులు మాత్రం స్పందించడంలేదని విమర్శలు వెలువెత్తుతున్నాయి. పట్టపగలే మొరంరవాణా జరుగుతున్న అధికారులు మాత్రం స్పందించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. రుద్రూర్ మండలం రాయకూర్,సులేమాన్ ఫారం,కొందాపూర్‌తోపాటు బోధన్ మండలం ఊట్‌పల్లి,సాలూర తదితర ప్రాంతాలలో మొరం అక్రమ రవాణా జరుగుతున్నట్లు ఫిర్యాదులు వెళ్ళిన అధికారులు మాత్రం స్పందించడంలేదు. వర్ని ప్రాంతంలో సైతం రాత్రి సమయాల్లో మొరం అక్రమ రవాణా చేస్తు కొండలను పిండి చేస్తున్నారు. రాత్రి 9గంటల ప్రాంతం నుండే వేకువజాము వరకు మొరం రవాణా జరుగుతున్న పట్టించుకునే నాధుడు కరువయ్యాడు. మొరం అనుమతులు పొందాలంటే ముందుగ రెవెన్యూ అధికారులను పట్టాదారు ధరఖాస్తు చేసుకోవాలి. వచ్చిన ధరఖాస్తును జిల్లా మైన్స్ శాఖ అధికారులకు పంపిస్తారు. మొరం క్వారీని పరిశీలించి మైన్స్ అధికారులు నిర్ధేశించిన లోతు మేరకు మొరం తవ్వకాలు చేపట్టారు. క్యుబిక్ మీటర్ చొప్పున ముందుగానే ప్రభుత్వానికి డబ్బులు చెల్లించి వేభిల్లులు పొందాల్సి ఉంటుంది. ఇలా అనుమతులు పొందిన మొరం వ్యాపారులకు డబ్బులు మిగలవనే దురుద్ధేశంతో గ్రామ,మండల స్థాయి రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకుని ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతు వారి అండదండలతో మొరం అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. సుమారు 15నుండి 20అడుగుల మేర లోతులో మొరం తవ్వకాలు చేపట్టడంతో గుంతలు ప్రమాదకరంగ మారి వర్షపు నీరు చేరడంతో పలు ప్రమాదాలు జరిగే అవకాశముంది. రెవెన్యూ అధికారులకు ఎవరైనా ఫిర్యాదు చేస్తే ముందస్థుగానే అక్రమార్కులకు రెవెన్యూ సిబ్బంది సమాచారమందించి అక్రమార్కులు జాగ్రత్తవహించే విధంగ దోహద పడుతున్నట్లు పలు విమర్శలున్నాయి. ఇంతజరుగుతున్నప్పటికి జిల్లాలో మైన్స్ అధికారుల దాడులు గాని,తనిఖీలు గాని చేపట్టిన దాఖలాలు లేవు. అక్రమార్కులు మైన్స్ అధికారులను సైతం మచ్చిక చేసుకుని వ్యవహారాన్ని చక్కపెడుతున్నట్టు తెలుస్తుంది.
సెలవు దినాలు వస్తే చాలు: మొరం అక్రమార్కులకు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు దినాలు వచ్చాయంటే వారికి పండగే సెలవు దినాలతోపాటు శని,ఆది వారాలలో సైతం మొరం అక్రమ రవాణా జోరుగ సాగుతుంది. ఒక్కొక్క టిప్పర్ సుమారు రూ.3వేల వరకు విక్రయిస్తు వందల సంఖ్యలో టిప్పర్లతో మొరం రవాణా చేస్తు కోట్లు గడిస్తున్నారు. ఇంతజరుగుతున్నప్పటికి ఏ ఒక్క శాఖ అధికారులు స్పందించక పోవడం గమనార్హం.