Home మహబూబాబాద్ అక్రమ రియల్ వెంచర్…?

అక్రమ రియల్ వెంచర్…?

land

*జిల్లా కేంద్రంలో భూదందా
*రెవెన్యూ, మున్సిపల్ అధికారులు కుమ్మక్కు

మన తెలంగాణ/మహబూబాబాద్ అగ్రికల్చర్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అక్రమ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోరలు చాస్తుంది. వ్యవసాయ భూములను అక్రమంగా రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసి ఎలాంటి అనుమతులు లేకుండా అమాయకులకు, గిరిజనులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. నాలా పన్ను చెల్లించకుండా, లేఅవుట్ లేకుండా, 40ఫీట్ల రోడ్డు వేయకుండా, విద్యుత్తు, డ్రైనేజి, త్రాగునీరు, గ్రీనరీ లేకుండా అక్రమంగా దండుకుంటున్నారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులు కుమ్మక్కై రియల్ వ్యాపారుల వద్ద అక్రమంగా డబ్బులు దండుకుని పట్టించుకోవడంలేదు. అంతేకాక జిపి రోడ్లను ఎస్‌ఆర్‌ఎస్‌పి రోడ్లగా భావించి గ్రామ పంచాయతీలో సర్వే నంబర్లను చూపించి పట్టణంలో ఉందని భవిష్యత్తులో కోట్లాది రూపాయలు వస్తాయని నమ్మించి మోసం చేస్తున్నారు. మానుకోట చుట్టూ ఉన్న బేతోలు, అనంతారం, రజాలిపేట, శనిగపురం, ముడుపుగల్, ఈదులపూసపల్లి, జమాండ్లపల్లి గ్రామము, మానుకోట మున్సిపాలిటీలో విలీనం అవుతున్నాయని నమ్మించి తడి గుడ్డతో గొంతు కోస్తున్నారు. ఎస్‌పి కార్యాలయం, కలెక్టర్ కార్యాలయం వస్తున్నాయని నమ్మించి అడ్డంగా మోసం చేస్తున్నారు. ప్రధానంగా ఎస్‌పి కార్యాలయం సమీపంలో 2 ఎకరాల వ్యవసాయ భూమిని మధు అనే రియల్ ఎస్టేట్ చదును చేశాడు. ఎస్‌ఆర్‌ఎస్‌పి కెనాల్ రోడ్లను చూపించి మధ్యలో రోడ్డు వేయకుండా ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా విక్రయాలు చేస్తున్నారు. నకిలీ సర్వేయర్లు, దస్తావేజులు లేకుండా తహసీల్దారు కార్యాలయం, సబ్‌రిజిస్టార్ కార్యాలయం చుట్టూదుకాణాలు తెరిచి భూమికొనుగోలు దారులకు మోసం చేస్తున్నారు. కొంత మంది సర్వేయర్లు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు చేసి నెంబర్లు వేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో 40 ఫీట్ల రోడ్ల వెడల్పు ఉండగా కేవలం 24 నుండి 30 ఫీట్ల రోడ్లతో మ్యాప్‌లు గీస్తున్నారు. అసలు నాలా పన్ను చెల్లించకుండా లేఅవుట్ చేయకుండా ఉన్న వ్యవసాయ భూములకు ప్లాట్లుగా విభజించడానికి వీలులేదు కానీ సర్వేయర్లు, రియల్ వ్యాపారానికి కుమ్మక్కు అయి అక్రమ వెంచర్లు చేస్తున్నారు. లేఅవుట్ లేకుండా భూములు క్రయ విక్రయం చేయరాదని నిబంధన ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదు. ఎస్పీ ఆఫీస్ రహదారిలో ఎబి గార్డెన్ పక్కన చేసిన అక్రమ రియల్ ఎస్టేట్ వెంచర్‌పై అనేక విమర్శలు వస్తున్నాయి. అలాగే తాళ్ళపూసపల్లి రహదారిలో, ఇల్లందు రోడ్డు వైపు శనిగపురం సమీపంలో అక్రమ వెంచర్లు వెలిశాయి. వెంటనే అధికారులు స్పందించి అక్రమ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని అరికట్టి అమాయక గిరిజనులు మోస పోకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా వాసులు కోరుతున్నారు.