Home ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అక్రమ ఇసుక దందా

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అక్రమ ఇసుక దందా

Sand Dandaఖమ్మం: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబాబూబాద్, భూపాలపల్లి జిల్లాల్లో అక్రమంగా ఇసుక తరలిపోతున్న క్షేత్రస్థాయిలో నియంత్రించాల్సిన అధికారులు జాడ కన్పించకపోవడం శోచనీయం. ప్రధానంగా ఖమ్మం ఉమ్మడి జిల్లాలో గోదావరి ఇసుకకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. గోదావరి తీరంలో సహజ వనరుల దోపిడీ అత్యంత సహజంగా మారిపోయింది. గోదావరి, కిన్నెరసాని, తాలిపేరు, మున్నేరు తదితర చిన్న చితక వాగులు, వంకల నుంచి ఇసుక అక్రమ రవాణా నిత్యం యధేచ్చగా కొనసాగుతోంది. కొందరికి లాభాల కోసం అందరు కష్టపడాల్సిన దుస్థితి చోటు చేసుకుంటుంది. అనధికారిక ర్యాంపుల నుంచే కాకుండా అధికారిక ర్యాంపుల నుంచి కూడా ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఇసుకనే వ్యాపారంగా మలుచుకుని పలువురు పదుల సంఖ్యల్లో కోట్లకు పడగలెత్తారు. ఖమ్మం, భద్రాచలం, కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, చర్ల, దుమ్ముగూడెం తదితర ప్రాంతాలకు చెందిన ప్రముఖులు రాజకీయ పార్టీల నేతల కనుసన్నల్లో వ్యాపారాన్ని మూడు పువ్వులు, ఆరు కాయలులా వర్ధిల్లే విధంగా కొనసాగిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో బినామీ పేర్లతో ఇసుక ర్యాంపులను టెండర్ల ద్వారా అధికారికంగా దక్కించుకుని, వ్యాపారం మాత్రం అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులే వ్యాపారాన్ని కొనసాగించటం గమనార్హం. పలు సందర్భాల్లో ఇసుకను అక్రమంగా తరలిస్తుంటే దాడులకు పాల్పడిన రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులపై దౌర్జన్యానికి దిగి దాడులకు పాల్పడుతున్నారు. మరోపక్క ఈ అక్రమాలను అరికట్టాల్సిన అధికారులు తమ బాధ్యతలను పూర్తిగా విస్మరించి మామూళ్ల మత్తులో జోగుతున్నారు. ఇసుక అక్రమ రవాణా వ్యవహారాన్ని పరిశీలిస్తే అసలు అధికారులు పనిచేస్తున్నారా అనే అనుమానం కలగక మానదు. పొరుగు రాష్ట్రానికి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తుంటే అధికారులు పట్టించుకోవడం లేదు. పర్యావరణానికి పెనుముప్పు కలిగిలా వ్యవహరించారనే కారణంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ రూ. 100 కోట్ల జరిమానా విధించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా గోదావరి, ఉప నదులు, పరిసర ప్రాంతాల్లోని వాగులు, వంకల నుంచి జోరుగా ఇసుక తరలిపోతుంది. గోదావరితో పాటు కిన్నెరసాని, మున్నేరు నది తీర ప్రాంతాల్లో ప్రస్తుతం సాగుతున్న ఇసుక తవ్వకాలు, ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నప్పటికీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు.  జిల్లాలో బూర్గంపాడు, మణుగూరు, పినపాక, ములకలపల్లి, చర్ల, అశ్వాపురం మండలాల్లో కిన్నెరసాని, ఇతర వాగుల నుంచి ఇసుకను తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పేదల గృహ నిర్మాణం, అభివృద్ధి పనుల్లో అవసరాలను దృష్టిలో పెట్టుకుని జారీ చేసినట్లు చెబుతున్న ఈ అనుమతుల మాటున అక్రమార్కులకు లాభం కలిగించేలా అధికారులు వ్యవహరిస్తున్నారు. స్థానిక అవసరాల కోసం ఇసుకను తరలించేందుకు అధికారులు గ్రామ పంచాయతీలకు ఇచ్చిన అనుమతులు ప్రైవేట్ వ్యక్తులకు ఎంతో లాభం తెచ్చిపెడుతోంది. అధికారికంగా నడిపించాల్సిన ఈ ఇసుక విక్రయాలను పలు చోట్ల ప్రైవేట్ వ్యక్తులే సొంతం చేసుకుని తమ సొంత మనుషులతో వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. రవాణాకు ప్రత్యామ్నాయ రహదారులన్నింటికి జనవాసల మధ్య నుంచే నిత్యం పదుల సంఖ్యల్లో లారీలు, ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఇసుక తరలిపోతుంటే భూగర్భ జలాలు మరింత అడుగంటిపోవడంతో ఏజెన్సీలో తాగునీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ ఏడాది గోదావరిలో వరద రాకపోవడంతో ఇసుక వ్యాపారులకు ఎంతో లాభం చేస్తుంది. గత నెల రోజులుగా ఇసుక రవాణాను యధేచ్ఛగా కొనసాగిస్తున్నా, మైనింగ్‌శాఖ అధికారులు మాత్రం క్షేత్రస్థాయికి వెళ్లి పర్యవేక్షించకపోవడం శోచనీయమని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుని పర్యావరణ పరిరక్షణతో పాటు భూగర్భ జలాలు పరిరక్షణకు పాటు పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇసుక తరలిపోవడంతో గోదావరితో పాటు కిన్నెరసాని, మున్నేరు పరిసర ప్రాంతాల్లో పర్యావరణం పూర్తిస్థాయిలో దెబ్బతిని భవిష్యత్తు తరాలకు పెను ప్రమాదం పొంచి ఉంది. ఈ విషయాన్ని అధికారులు పరిగణలోకి తీసుకుని ఇసుక అక్రమ రవాణపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది.

Illegal Sand Danda In Khammam District