Home తాజా వార్తలు ఇసుక మాఫియాకు ప్రభుత్వ ప్రోత్సాహం

ఇసుక మాఫియాకు ప్రభుత్వ ప్రోత్సాహం

Illegal sand transport in peddapalli district
Illegal sand transport in peddapalli district

* రాబడిపై ఉన్న శ్రద్ద ప్రజల ప్రాణాలపై లేదు
* ప్రజల ప్రాణాలను బలిగొంటున్నఇసుక క్వారీలను రద్దు చేయాలి
* మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షల నష్టపరిహారమివ్వాలి
* ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నాలో మాజీ మంత్రి శ్రీధర్‌బాబు

 మనతెలంగాణ / మంథని : రాష్ట్ర ప్రభుత్వం ఇసుక పాలసీ ముసుగులో ఇసుక మాఫియాను ప్రొత్సహిస్తున్నదని మాజీ మంత్రి, టిపిసిసి ఉపాధ్యక్షులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు డిమాండ్ ఆరోపించారు. ఇసుక రాబడిపై ఉన్న శ్రద్ద ప్రజల ప్రాణాలను కాడడంలో చూపించడం లేదని ఆయన విమర్శించారు. భూ గర్భ జలాలను హరిస్తూ ప్రజల ప్రాణాలను బలిగొంటున్న ఇసుక క్వారీలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ  మంథని నియోజకర్గం పరిధిలో 36 ఇసుక క్వారీలకు ప్రభుత్వం అడ్డగోలు అనుమతులు ఇచ్చారని, ఒక్కో క్వారీ నుంచి రోజుకు వంద చోప్పున సుమారు 4 వేల ఇసుక లారీలు నిత్యం వెళ్తున్నాయని, భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల పరిధిలో ఇసుక లారీలు ఢీ కోని ఇప్పటివరకు 86 మంది మృతి చెందారన్నారు. ఇసుక లారీల ప్రమాదాల్లో మృతి చెందిన కుటుంబాలకు  రూ.20 లక్షల చోప్పున నష్టపరిహరం చెల్లించాలనిఆయన డిమాండ్ చేశారు.

ఇసుక క్వారీల నుంచి నిబంధనలకు విరుద్దంగా ఒకే వే బిల్లుతో అనేక లారీలు, ఒకటే నెంబర్ ప్లేటుతో పదుల సంఖ్యలో లారీలు, ఓవర్ లోడు, ఓవర్ స్పీడ్ ఇలా పగలు రాత్రి తేడా లేకుండా నిత్యం ఇసుక అక్రమ రావాణా జరుగుతున్న రెవన్యూ, పోలీసు, మోటార్ వెహికిల్ తదితర శాఖలు పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. ఇసుక అక్రమ రావాణాకు సిఎం కార్యాలయం నుంచే మానిటరింగ్ జరుగుతున్నదని శ్రీధర్‌బాబు ఆరోపించారు. తెలంగాణ ఇసుక పాలసీతో రూ.1300ల కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు వచ్చిందని మంత్రి కెటిఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని, రాష్ట్రంలోరూ.10 వేల కోట్ల మేరకు ఇసుక రావాణ జరిగిందని మిగిలిన రూ.8700ల కోట్లు ఏవరి పరం అయ్యాయని, ఇసుక మాఫియా పరం కాదా అని ప్రశ్నించారు. మంత్రి కెటిఆర్, సంబంధిత అధికారులు ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలకు, పాలకులకు అసలు విషయాలను బయటపెట్టకుండా, మాయ మాటలు చెప్పి తమ ఇసుక పాలసీ బెస్టు పాలసీగా చిత్రీకరించి, వారితో అదే మాటను చెప్పించుకోవడం సిగ్గు చేటాన్నారు. ఇబ్బడి ముబ్బడి ఇసుక క్వారీలు, ఇష్టా రాజ్య తవ్వకాలతో భూగర్భ జలాలు అడుగంటి పరిసరా గ్రామాల్లో భూగర్భ జలాలు పాతళంలోకి పోయి, బోరు, బావులు వట్టిపోయి పంటలు చేతికందే వరి పంట వేల ఏకరాల్లో ఎండిపోతున్నాయన్నారు. పంటలు ఎండిపోవడంతో రైతులకు మరో రూ.10 వేల కోట్ల మేరకు నష్టం వాటిల్లిందన్నారు. తాజాగా ఇసుక లారీ ఢీకొని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉపసర్పంచ్ రాజయ్య మృతి చెందడం బాధాకరమన్నారు. ఇసుక లారీ ప్రమాదాల్లో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కాంగ్రెస్ నాయకులు 2 నిమిషాలు మౌనం పాటించారు.
ధర్నాలో నియోజకవర్గం పరిధిలోని పలు మండలాల నుంచి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.