Home జాతీయ వార్తలు బాబా కొవిడ్ ఔషధానికి బాకా తగునా

బాబా కొవిడ్ ఔషధానికి బాకా తగునా

IMA seeks explanation for promoting patanjali coronil

 

కేంద్ర ఆరోగ్య మంత్రిని నిలదీసిన ఐఎంఎ

న్యూఢిల్లీ: యోగా గురు బాబా రాందేవ్ కరోనిల్ ఔషధ ప్రామాణికత, దీనికి కేంద్ర మంత్రుల ప్రచార ఆర్బాటం వివాదాస్పదం అయింది. కొవిడ్ నియంత్రణలో అత్యంత దివ్యౌషధంగా సకల విధ సాక్షాధారాలతో నిరూపితంఅయిన మందు ఈ కరోనిల్ అని రాందేవ్ బాహాటంగా ప్రకటించడాన్ని భారతీయ వైద్య సంస్థ (ఐఎంఎ) తప్పుపట్టింది. దీని సామర్థ్యం శాస్త్రీయంగా నిరూపితం కాలేదని,దీనిని ప్రామాణిక సంస్థలు ఏవీ కూడా నిర్థారించలేదని, మరి దీనికి కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్థన్ ప్రచారం కల్పించడం ఏమిటని ఐఎంఎ ప్రశ్నించింది. కట్టుకథలతో , నిర్థారితం కాని ఔషధాన్ని దేశం ముందుకు తేవడం ఏమిటని నిలదీశారు. శుక్రవారం పతంజలి ఉత్పత్తులలో భాగంగా ఈ కరోనిల్‌ను విడుదల చేశారు. ఆరోగ్య మంత్రి హర్షవర్థన్, మరో సీనియర్ మంత్రి నితిన్ గడ్కరీ వంటి వారి సమక్షంలో రాందేవ్ దీనిని విడుదల చేశారు.

ఇది మహా ఔషధం అని, అన్ని విధాలుగా దీని పనితీరు నిర్థారితం అయి ఉందని సెలవిచ్చారు. ఈ ముగ్గురు ఉన్న వేదిక వెనుక ఉన్న భారీ పోస్టర్‌పై ఈ ఔషధ ఘనత చాటే రాతలు ఉన్నాయి. ఇది కాప్ (ఔషధ ఉత్పత్తుల సర్టిఫికెట్) , దీనికి తోడుగా డబ్లుహెచ్‌ఒ అనుమతితో కూడిన జిఎంపిని సంతరించుకుందనే ఆకర్షణీయ నినాదాలు ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ఈ ఉత్పత్తికి అత్యుత్తమ ఉత్పత్తి సంబంధిత ప్రక్రియ (జిఎంపి) అనుమతి కూడా ఉందని ఇందులో తెలిపారు. ఇంతకంటే ప్రామాణికత అవసరం ఉంటుందా? తమ ఔషధాన్ని ఇంతకు ముందటి తమ ఉత్పత్తుల మాదిరిగానే తీసుకుని ఆరోగ్యవంతులు కావచ్చునని రాందేవ్ ఉద్బోధించారు. ఈ సందేశ దశలో వేదికపై కేంద్ర ఆరోగ్య మంత్రి కూడా ఉండటంపై ఐఎంఎ ఆక్షేపణ తెలిపింది. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వెలువడ్డ ట్వీటులో ఈ ఔషధానికి సంబంధించి వివరణ ఇచ్చారు.

తమ అనుబంధ అధీకృత సంస్థలు ఏవీ కూడా ఎటువంటి సాంప్రదాయక ఔషధానికి కొవిడ్ 19 చికిత్స సంబంధిత అనుమతిని ఇవ్వలేదని, సంబంధిత విషయంపై సమీక్ష కూడా జరగలేదని తెలిపింది.పరిశీలన లేనప్పుడు సమర్థతకు కితాబు ఇచ్చే పత్రం వెలువరించడం సాధ్యం అవుతుందా? అని పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా వెబ్‌సైట్‌లో వెలువడ్డ ట్వీటును ఐఎంఎ ప్రస్తావించింది. డబ్లుహెచ్‌ఒ సర్టిఫికెట్ పొందినట్లు బూటకానికి దిగడం తమకు దిగ్భ్రాంతి కల్గించిందని, అంతేకాకుండా దీనిని ఆరోగ్య మంత్రిసమక్షంలో జనుల వద్దకు అట్టహాసంగా విడుదల చేయడం, పైగా ఆరోగ్య మంత్రి ఓ డాక్టరు అయి ఉండటం వంటివి తీవ్ర పరిణామాలని, దీనిపై కేంద్ర ఆరోగ్య మంత్రిదేశానికి ఏం జవాబు ఇస్తారని ప్రశ్నించింది. మంత్రి వివరణకు తామే కాకుండా జనం అంతా ఎదురుచూస్తున్నట్లుగా ఐఎంఎ ఓ ప్రకటనలో తెలిపింది.

IMA seeks explanation for promoting patanjali coronil