Wednesday, April 24, 2024

జోరు వాన

- Advertisement -
- Advertisement -

IMD warns of heavy rains in Telangana

 

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు
సిద్దిపేటలో దంచికొట్టిన వాన
హైదరాబాద్‌లో వరద తాకిడి
పలుచోట్ల కొట్టుకుపోయిన కార్లు
అప్రమత్తమైన జిహెచ్‌ఎంసి
నేడూ భారీ వర్షాలు

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో కురిసిన వర్షాలకు వాగులు, నదులు పొంగిపొర్లాయి. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. నగరంలోని ఎల్బీ నగర్, మన్సూరాబాద్, నాగోల్, వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, చిలకలగూడా, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట, తిరుమలగిరి, ఫ్యాట్నీ, బేగంపేట, కూకట్ పల్లి, కోఠి, సుల్తాన్‌బజార్, బేగం బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్‌బాగ్, లక్డీకాపూల్, లిబర్టీ, నారాయణగూడ, హిమాయత్‌నగర్, కింగ్ కోఠి, రాంకోటి, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేటలతో పాటు మేడ్చల్ జిల్లా పరిధిలో సుచిత్ర, కొంపల్లి, గాజుల రామారం, షాపూర్‌నగర్‌లోనూ జోరుగా వర్షం పడింది.

పాతబస్తీ చార్మినార్, బహదూర్‌పురా, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, మియాపుర్, చందానగర్, మాదాపుర్, గచ్చిబౌలి, రాయదుర్గం, రామంతాపూర్ తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు కురవగా, తార్నాక, లాలాపేట్, ఓయూ క్యాంపస్, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్ ప్రాంతాల్లోనూ ఓ మోస్తరు వర్షం కురిసిందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షం కురిసిన నేపథ్యంలో పలుచోట్ల విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. కూకట్‌పల్లిలోని పలు కాలనీల్లో రోడ్లపై వర్షం నీరు నిలిచిపోగా, పలుచోట్ల రహదారులపైకి నీరు వచ్చి చేరింది. పలుచోట్ల నాలాలు పొంగిపొంగడంతో వివిధ పనుల నిమిత్తం బయటికొచ్చిన వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ముందస్తుగానే అప్రమత్తమైన జీహెచ్‌ఎంసి అధికారులు సిబ్బందిని రోడ్లపై అందుబాటులో ఉంచడంతో ఎప్పటికప్పుడు రోడ్లపై నీరు నిలవకుండా చర్యలు చేపట్టారు.

పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో…

ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రానున్న రెండురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం సంచాలకులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నైరుతి రుతుపవనాలు ఈనెల 4న రాష్ట్రాన్ని తాకగా, నైరుతి రాకతో తొలకరి జల్లులు రాష్ట్రాన్ని పలకరించాయి. తర్వాత వాన జాడ లేకుండా పోయింది. ప్రస్తుతం ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా వర్షం భారీగా కురిసింది.

నల్లగొండ జిల్లాలో 95.8 మిల్లీమీటర్ల….

నల్లగొండ జిల్లాలో 95.8 మిల్లీమీటర్ల వర్షపాతం కురవగా, సిద్ధిపేటలో 95.5, మేడ్చల్ మల్కాజిగిరిలో 88.8, జోగులాంభ గద్వాల్‌లో 76. హైదరాబాద్‌లో 72.8, జనగాంలో 68.9, యాదాద్రి భువనగిరిలో 66, హైదరాబాద్‌లో 63.5, కరీంనగర్‌లో 12.1, మహబూబాబాద్‌లో 11.1, సూర్యాపేటలో 9.7, రంగారెడ్డిలో 3.9, నాగర్‌కర్నూల్‌లో 3.2, పెద్దపల్లిలో 2.6, నిర్మల్‌లో 2.5, నారాయణపేటలో 9.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News