Thursday, April 25, 2024

ఐ.ఎం.ఎఫ్ హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

IMF warning on Indian financial situation

 

భారత ఆర్థిక స్థితిపై అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) తీవ్రమైన హెచ్చరిక జారీ చేసింది. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో మన వృద్ధిరేటు మైనస్ 4.5 శాతానికి పాతాళ పతనాన్ని చవిచూస్తుందని చెప్పింది. కరోనా కారణంగా దాదాపు అన్ని దేశాల వృద్ధిరేట్లు భారీగా తగ్గిపోతాయని చెప్పిన ఐఎంఎఫ్ ఇండియా విషయంలో ఇది తీవ్రంగా ఉంటుందని స్పష్టం చేసింది. 1961 తర్వాత ఇంతటి అధోగమనం ఇదే మొదటి సారి కాగలదని పేర్కొన్నది. వచ్చే ఏడాది (2021-22) లో మాత్రం 6 శాతం వృద్ధి సాధించవచ్చు అన్నది. సుదీర్ఘ కరోనా లాక్‌డౌన్ కారణంగా ఈ ఏడాది మొదటి సగమంతా అన్ని ఆర్థిక కార్యకలాపాలు తుడిచి పెట్టుకుపోయాయని, ఈ స్థితి నుంచి కోలుకోడం ఉన్నపళంగా సాధ్యమయ్యే పని కాదని, అది నెమ్మది నెమ్మదిగానే జరుగుతుందని వివరించింది. ఒక్కసారిగా కుప్పకూలినదేదీ అదే విధంగా తిరిగి లేవడం సాధ్యమయ్యే పని కాదు. 2016 నవంబర్‌లో ప్రధాని మోడీ నాయకత్వంలోని ఎన్‌డిఎ 1 ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు చర్య ఆర్థిక వ్యవస్థ మీద చూపడం ప్రారంభించిన వ్యతిరేక ప్రభావం తీవ్రత ఇప్పటికీ కొనసాగుతుండడమే ఇందుకు నిదర్శనం.

గత మార్చి 24 నుంచి ఈ నెల 1వ తేదీ వరకు కొనసాగిన కఠోర లాక్‌డౌన్ దేశంలో అనేక చిన్నచితక వ్యాపారాలు కుంగికునారిల్లిపోడానికి దారి తీసింది. వివిధ పారిశ్రామిక, వాణిజ్య విభాగాలు చెప్పనలవికాని విధంగా దెబ్బ తిన్నాయి. వైరస్ ఇంకా పేట్రేగుతున్నది. రోజురోజుకి కేసులు పెరిగిపోతున్నాయి. లాక్‌డౌన్ సడలించి, తొలగించినా కరోనాకు ముందు న్న స్థాయికి అమ్మకాలు, కొనుగోళ్లు పుంజుకోడం లేదు. అందుకు ఇంకా చాలా కాలం పడుతుంది. ఎంఎస్‌ఎంఇ (సూక్ష్మ, చిన్న మధ్య తరహా) వ్యాపార సంస్థలను ఆదుకోడానికని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల రుణ వితరణ పథకం ఫలితాల జాడ మచ్చుకైనా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ అనుకున్నంత సులభంగా లేచి నిలబడడం సాధ్యం కాదు. అలా జరగాలంటే సత్వర ఫలితాలనిచ్చే సాహస నిర్ణయాలను తీసుకోవలసి ఉన్నది. ప్రస్తుతానికైతే వ్యాపారాలు స్తంభించినందున పన్నుల వసూళ్లు నత్తలను మరిపిస్తున్నాయి.

దీని వల్ల ప్రభుత్వాల రాబడికి పెద్ద గండి పడింది. దీని ప్రభావం పాలకులకు ఇటీవలి కాలంలో తారక మంత్రమైపోయిన సంక్షేమం పై పడి తీరుతుంది. కొన్ని సంక్షేమ పథకాలు మొక్కుబడిగా మారిపోడమో, వాటికి శాశ్వతంగా తెరపడిపోడమో తప్పదనిపిస్తున్నది. కేంద్రం సందు దొరికిన చోటల్లా ప్రజలను పిండుకుంటున్నది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు విశేషంగా తగ్గిపోయినందువల్ల ప్రభుత్వరంగ పెట్రోలియం సంస్థల వ్యయం కూడా చాలా వరకు దిగి వచ్చింది. అందుచేత వాటి మీద ఇటీవల 10 శాతానికి మించి ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం పెంచింది. దాని ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రానికి రూ. లక్షా 50 వేల కోట్ల ఆదాయం సమకూరుతుంది. రాష్ట్రాలు కూడా ఆ మేరకు విలువ ఆధారిత పన్ను (వ్యాట్) విధించి పైరాబడిని సమకూర్చుకున్నాయి. కరోనా లాక్‌డౌన్ కాలంలో పెట్రోల్, డీజిల్ పై తగ్గిపోయిన ఆదాయాన్ని ప్రభుత్వాలు ఇలా భర్తీ చేసుకుంటున్నాయి. కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని విధించినప్పుడు ఆ భారం ప్రజల మీద పడబోదని ఇచ్చిన బలమైన సంకేతాలు పచ్చి అబద్ధాలని రుజువైపోయింది.

గత రెండు వారాలుగా పెట్రోలియం కంపెనీలు పెట్రో ధరలను ప్రతిరోజూ పెంచుతూ పోతున్నాయి. లాక్‌డౌన్‌లో వ్యాపారాలు, ఉద్యోగాలు, ఉపాధులు కోల్పోయిన దేశ ప్రజల పరిస్థితి మూలిగే నక్క మీద తాటిపండు కాదు, బండరాయి పడిన చందమైంది. ఎంతసేపూ నిరుద్యోగాన్ని ఊహించని స్థాయికి పెంచుతూ ప్రజల మీద అదనపు పన్నుల భారం వేసి వారి జేబులకు చిల్లులు పెడుతూపోడం వల్ల ప్రయోజనం శూన్యం. చిట్కా, గారడీ వ్యూహాలతో కథను ఎన్నాళ్లో నడిపించలేరు. ప్రభుత్వాలు రాబడి లోటును కొంత పూడ్చుకోగలవేమోగాని ప్రజల బతుకులు, ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు అంధకారబంధురమవుతాయి. ఇటువంటప్పుడే వినూత్న విప్లవాత్మక ఆలోచనలు అంకురించాలి. ప్రజల కొనుగోలు శక్తిని విశేషంగా ఎగబాకించడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు భీమ బలాన్ని కలిగించాలి. వృద్ధి రేటును ఊర్థ గతిలో ఊర్రూతలూగించాలి. అందుకు మౌలిక సదుపాయాల రంగం కింద ప్రభుత్వ వ్యయాన్ని అసాధారణంగా పెంచాలి. దేశంలోని 52 కోట్ల మంది కార్మిక శక్తికి పనులు కల్పించాలి. కేంద్రం వద్ద నిధులు లేవన్నది కాదనలేని కఠోర వాస్తవమే.

అయినా తగిన మార్గాలు లేకపోలేదు. అవసరమైనంత అప్పు తెచ్చి ఇందుకు వినియోగించవచ్చు. అందువల్ల లోటు పెరుగుతుందనే భయం అవసరం లేదు. అప్పును అభివృద్ధి కింద వినియోగిస్తే సంపద పెరుగుతుంది. దాని బాధ్యత అదే వహిస్తుంది. వాస్తవానికి భారత్ అప్పు దాని జిడిపిలో 5 శాతమే. అందుచేత లోటు పెరుగుతుందనే భయాన్ని విడిచిపెట్టి వీలైనన్ని అదనపు నిధులు సమకూర్చుకోడానికి కేంద్రం నడుం బిగించాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News