వాషింగ్టన్: అమెరికా సెనేట్‌లో ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ప్రవేశపెట్టిన అభిశంసనపై ఫిబ్రవరి 8న విచారణ జరగనున్నదని డెమోక్రటిక్ పార్టీ నేత చుక్‌స్కూమర్ తెలిపారు. జనవరి 6న కేపిటల్‌హిల్‌పై జరిగిన దాడి వెనక ట్రంప్ ఉన్నారన్న ఆరోపణలున్నాయి. దీనికి సంబంధించిన వాస్తవాలు వెల్లడైతేనే తమ దేశం తిరిగి ఐక్యంగా ఉంటుందని స్కూమర్ అన్నారు. విచారణలో అది తేలుతుందని ఆయన అన్నారు. ప్రస్తుతం సెనేట్‌లో అధికారిక డెమోక్రాట్లకూ, ప్రతిపక్ష రిపబ్లికన్లకూ 50 సీట్ల చొప్పున ఉన్నాయి. అయితే,సెనేట్ చైర్‌పర్సన్‌యైన ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ ఓటుతో డెమోక్రాట్ల తీర్మానం నెగ్గుతుందని భావిస్తున్నారు.
కాగా, ట్రంప్‌పై విచారణకు డెమోక్రాట్లు తొందరపడుతున్నారని సెనేట్‌లో రిపబ్లికన్ నేత మిచ్ మెక్‌కానెల్ విమర్శించారు. అభిశంసనపై విచారణ ఫిబ్రవరి 11న జరుగుతుందని కానెల్ అన్నారు. రిపబ్లికన్ల ప్రతిపాదనకు అధికారిక డెమోక్రాట్లు అంగీకరించడంలేదు. అభిశంసనకు సంబంధించిన ప్రక్రియ సోమవారం(ఈ నెల 25) నుంచే ప్రారంభమవుతుందని ప్రతినిధులసభ స్పీకర్ నాన్సీ పెలోసీ తెలిపారు. సెనేట్‌లో దీనికి సంబంధించిన రాజ్యాంగపరమైన అంశాలను ఆ సందర్భంగా ప్రస్తావిస్తారు.