Home దునియా ఏకాగ్రత

ఏకాగ్రత

Concentration

 

ప్రకాశం 9వ తరగతి చదువుతున్నాడు. అతడు చిన్నప్పటి నుంచి ఆట పాటల్లో పడి చదువు పట్ల అశ్రద్ధ చూపేవాడు. అల్లరి పనులు చేస్తూ ఉపాధ్యాయులతో తిట్లు తింటూ ఉండేవాడు. ఉపాధ్యాయులు ఎంత ప్రయత్నించినా అతనిలో మార్పు తేలేకపోయారు. 9వ తరగతిలోకి వచ్చేసరికి అతని అల్లరి పనులకు అంతే లేదు. ప్రకాశం తల్లిదండ్రులను పిలిపించి ప్రధానోపాధ్యాయులు ఇలా అన్నారు… ‘మీ అబ్బాయి చదువును నిర్లక్ష్యం చేస్తున్నాడు. మీకు ఎన్నిసార్లు చెప్పినా మీరు పట్టించుకోవడం లేదు. ఇంటి వద్ద మీరేం భయం చెప్పరా? అల్లరి పనులతో మీవాడు మా పాఠశాలకు చెడ్డపేరు తెస్తున్నాడు. మీ వాడిని మీరు తీసుకెళ్ళి వేరే పాఠశాలలో చేర్పించండి. లేదా చదువు మాన్పించి ఏదైనా పనిలో పెట్టండి’ అన్నారు. ఆ ఊరిలోనే కాదు, ఆ చుట్టు పక్కల గ్రామాల్లోనూ అంత మంచి పాఠశాల, అంత అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు లేరు. ప్రకాశం తల్లిదండ్రులు బాధపడ్డారు. ప్రధాన ఉపాధ్యాయులతో ‘ఇంకో అవకాశం ఇవ్వండి. మా వాడిని మార్చే ప్రయత్నం చేస్తాం.

రాబోయే పరీక్షల్లో వాడికి మంచి మార్కులు రాకపోతే మేమే వాడిని చదువు మానిపించి, ఏదైనా ఎక్కువ శ్రమతో కూడుకున్న పనిలో పెడతాం. అలా అయినా మా కష్టం విలువ వాడికి తెలిసి వస్తుంది’ అన్నారు. అక్కడే ఉన్న ప్రకాశానికి దిగులు వేసింది. ఎలాగైనా అల్లరి పనులు మాని, మంచి మార్కులు తెచ్చుకొని తానేమిటో నిరూపించుకోవాలని అనుకున్నాడు. కష్టపడి చదివే ప్రయత్నం చేస్తున్నాడు. ఎంత చదివినా ఆ అంశాలు నోటికి వచ్చినట్లే అనిపించి మళ్ళీ మరచి పోతున్నాడు. మరింత పట్టుదలతో చదివే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ చదవాల్సిన విషయాలు బుర్రలోకి ఎక్కడం కష్టం అవుతుంది. దిగులు ఎక్కువైంది. గురువులకు తన సమస్యను చెప్పుకోవాలంటే భయం. తల్లిదండ్రులకు చెప్పుకుంటే బడి మానిపిస్తారని భయం. చివరికి తనతో సన్నిహితంగా ఉండే తెలుగు ఉపాధ్యాయుడు పరమేశం గారికి తన సమస్యను చెప్పుకున్నాడు. అప్పుడు ఆ గురువు ‘చూడు ప్రకాశం! నేను నీకు ఓ అందమైన కథ చెబుతా! విని నీ సమస్యను కాసేపు మరచిపో! నిన్ను ఈ పాఠశాల నుండి వెళ్లనివ్వకుండ నేను చూసుకుంటా!’ అని ఏకలవ్యుని కథను చెప్పాడు. మరునాడు ఆదివారం.

సోమవారం నాడు బడికి వచ్చిన ప్రకాశంతో పరమేశం గారు ‘ప్రకాశం! నేను మొన్న చెప్పిన కథను రాసి చూపించు. అలాగే నిన్న నువ్వు టి.విలో చూసిన ఓ సినిమా కథను, ఈమధ్య నువ్వు సినిమా టాకీస్‌లో చూసిన సినిమా కథను రాసి చూపించు. అలాగే నువ్వు ఇటీవల విహారయాత్రలో చూసిన విశేషాలను రాసి చూపించు. ఇవన్నీ రాసినాక నిన్ను నీ తరగతికి పంపిస్తా!’ అన్నాడు. ప్రకాశం ఏకలవ్యుని కథను, 2 సినిమా కథలను, తాను చూసిన యాత్రా విశేషాలు ఉన్నది ఉన్నట్లు రాశాడు. ‘శభాష్ ప్రకాశూ! నీకు అద్భుతమైన తెలివి తేటలు ఉన్నాయి. ఇవన్నీ ఇంత బాగా రాసావంటే వాటిని ఎంతో శ్రద్ధగా ఏకాగ్రతతో విన్నావు, చూసావు.

ఒక విషయం మీదనే పూర్తిగా మనసు కేంద్రీకరించి ఇతర ఆలోచనలు చేయకుండా శ్రద్ధగా వినడం, చూడడమే ఏకాగ్రత. అది ఎంత ఎక్కువగా ఉంటే అంత ఉపయోగం మనకు. నీకు కథలంటే, సినిమాలంటే బాగా ఇష్టం. ఆ ఇష్టంతోనే వాటిపై ఏకాగ్రత పెట్టావు. అవి నీ మెదడు నుండి బయటకు పోలేవు. అలాగే ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను ఏకాగ్రతతో విను. అలా ఏకాగ్రతతో వినకపోతే ఎన్ని పుస్తకాలు చదివినా వ్యర్థం. గురువు గారు విలువిద్య నేర్పడానికి నిరాకరించిన ఏకలవ్యుడు ఏకాగ్రతతో సాధన చేసి నేర్చుకున్నాడు. చిన్నప్పటి నుంచి నీకు ఆ ఏకాగ్రత లేక మనసు అల్లరి పనులపై కేంద్రీకరించి ఇలా చదువు రాని వాడివి అయ్యావు’ అన్నాడు. ప్రకాశం తన తప్పు తెలుసుకుని, ఉపాధ్యాయుల చెప్పే పాఠాలను ఏకాగ్రతతో వింటూ, అర్థం కాని విషయాలను మళ్ళీ చెప్పించుకొని, పట్టుదలతో చదివి, తెలివైన విద్యార్థిగా మారాడు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలలో 10 కి 10 జి. పి. ఏ. సాధించాడు.

 

Improve Concentration in Telugu

సరికొండ శ్రీనివాసరాజు, 8185890400