Home తాజా వార్తలు ప్రభుత్వాసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు…

ప్రభుత్వాసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు…

Government Hospitals

 

మల్కాజిగిరి: పేదవారికి ప్రభుత్వాసుపత్రులలో మెరుగైన వైద్య సేవలు అందించి కార్పోరేట్ ఆసుపత్రులకు వెళ్ళకుండా చేయాలనే ప్రభుత్వ లక్ష్యం మల్కాజిగిరిలో సత్ఫలితాలనిస్తోంది. మల్కాజిగిరిలో నిర్మించిన 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల రోగాలకు మెరుగైన వైద్య సేవలు అందుతుండడంతో మేడ్చల్ మల్కాజిగిరి మేడ్చల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు వైద్యం కోసం మల్కాజిగిరిలోని ప్రభుత్వాసుపత్రికి వస్తున్నారు.

24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉంటుండంతో ఆసుపత్రికి రోగుల సంఖ్య పెరుగుతోంది. ప్రతీ రోజు 350 వరకు ఔట్ పేషెంట్‌లు, 30 నుండి 40 వరకు ఇన్ పేషెంట్‌లు వస్తున్నారని హాస్పిటల్ ఇన్‌ఛాంర్జీ సూపరిండెంట్ రాజు తెలిపారు. గైనిక్, ఆర్థో, జనరల్, స్కిన్, చెస్ట్, ఇఎన్‌టి, ఐ, సైక్రియాటిస్ట్, ఫోరెన్సిక్, పథాలజిస్ట్, రేడియాలజిస్ట్, అనిస్తీషియా తదితర విభాగాలకు చెందిన వైద్య సేవలు మల్కాజిగిరిలోని ప్రభుత్వాసుపత్రిలో అందుబాటులో ఉన్నాయి. తగిన మందులను కూడా ఇస్తున్నారు. 24 మంది డాక్టర్లు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజలకు వైద్య సేవలుందిస్తున్నారు.

ముఖ్యంగా గర్భీణీ స్త్రీలకు వైద్యం చేసేందుకు ముగ్గురు గైనకాలజిస్టులు నిరంతరం అందుబాటులో ఉంటారని సూపరిండెంట్ రాజు వివరించారు. చిన్న పిల్లలకు నీలోఫర్ ఆసుపత్రిలో అందించే వైద్యాన్ని ఇక్కడ కూడా అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సంవత్సరం మార్చి నుండి నేటి వరకు 38 డెలివరీలు కాగా అందులో 18 మందికి నార్మల్, 28 మందికి ఆపరేషన్లు జరిగినట్లు స్పష్టం చేశారు. డెలివరీ అయిన వారికి ప్రభుత్వం అందిస్తున్న కెసిఆర్ కిట్లు, ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. ప్రతీ రోజు ఆసుపత్రిలో జనరల్ సర్జరీలు జరుగుతూనే ఉంటాయని ఆయన తెలిపారు. అదే విధంగా యాక్సిడెంట్ కేసులను కూడా చూస్తున్నట్లు వివరించారు. స్టాఫ్ నర్సులు, శానిటేషన్ సిబ్బంది కొరత ఉన్నా వైద్యం కోసం వచ్చే వారికి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా వైద్యం చేస్తున్నట్లు వివరించారు.

స్థానిక ప్రైవేట్ ఆసుపత్రులకు తగ్గిన రోగుల సంఖ్య

మల్కాజిగిరిలో ప్రభుత్వాసుపత్రి ఏర్పడి అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి వస్తుండడంతో స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళే రోగుల సంఖ్య తగ్గినట్లు తెలసుస్తోంది. ముఖ్యంగా ప్రసవాల కోసం వచ్చే గర్భీణీల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు పలు ప్రైవేట్ హాస్పిటల్ నిర్వాహకులు వాపోతున్నారు. భవిష్యత్తులో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు మూసేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు.

50 నుండి 150 పడకల ఆసుపత్రిగా మారనున్న జిల్లా ఆసుపత్రి

ప్రస్తుతం 50 పడకల ఆసుపత్రిగా కొనసాగుతున్న ఈ ఆసుపత్రి త్వరలో 150 పడకల ఆసుపత్రిగా మార్చేందుకు కృషి చేస్తున్నామని సూపరిండెంట్ రాజు తెలిపారు. ఎన్నికల కోడ్ కారణంగా ఆలస్యమవుతుందని అన్నారు. సాధ్యమైనంత త్వరలో 150 పడకల ఆసుపత్రిగా మారుస్తామని అన్నారు. అయినా కూడా ఇక్కడ అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని అన్నారు.

Improved Medical Services in Government Hospitals