Home అంతర్జాతీయ వార్తలు ఇమ్రాన్‌ఖాన్ @ 116

ఇమ్రాన్‌ఖాన్ @ 116

imran

ప్రభుత్వం ఏర్పాటుకు వివిధ పార్టీలతో మంతనాలు

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ ఎన్నికలలో సొంత బలంతో అధికారానికి చేరువలో నిలిచిన క్రికెటర్‌ప్రజా నేత ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు ప్రభుత్వ స్థాపనకు పావులు కదుపుతున్నారు. ఇటీవలి పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ (పార్లమెంట్) ఎన్నికలలో ఇమ్రాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పిటిఐ) అత్యధిక స్థానాలు దక్కించుకున్న పార్టీ గా నిలిచింది. అయితే సొంతంగా అధికారంలోకి వచ్చే మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకోలేకపోయింది. దీనితో ఇమ్రాన్ ఇప్పుడు వివిధ రాజకీయ పార్టీల నేతలు, ఇండిపెండెంట్లతో ప్రభుత్వ స్థాపన గురించి చర్చలు మొదలు పెట్టారు. ఎన్నికలలో రిగ్గింగ్, ఇప్పుడు ఫిరాయింపుల కుట్రలు జరుగుతున్నాయని ఈసారి బలం చాటుకోలేక చతికిల పడ్డ పిఎంఎల్ ఎన్, పిపిపి పార్టీల నేతలు మండిపడుతున్నారు. అయితే ఈ విమర్శలను ఖాతరు చేయకుండా , క్రికెటర్ తరహాలో ఇమ్రాన్ ఇప్పుడు తమ తదుపరి బ్యా టింగ్ కోసం చూస్తున్నారు. ఇందులో భాగంగా పలువురు నేతలతో మంతనాలు జరుపుతున్నారు. దేశంలో బలీయ శక్తిగా ఉన్న పాకిస్థాన్ ఆర్మీ ఈ ఎన్నికలలో తెరవెనుకే కాకుండా తెర ముందు కూడా కీలక పాత్ర వహించిందని, ఫలితం ఒక వైపే వచ్చేలా బలప్రయోగస్థాయికి దిగిందని పలువురు జాతీయ అంతర్జాతీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. అయితే ఇప్పటికే ఇమ్రాన్ తన గెలుపును ప్రకటించుకుంటూ తానే తదుపరి ప్రధానిని అని చాటుకుంటూ దేశ రాజధానిలో విజయ సభ కూడా నిర్వహించారు. ఇందులో దేశ ఆర్థిక ఆంతరంగిక విషయాలు, భారత్ ఇతర దేశాలతో అనుసరించే సంవిధానం వంటి పలు విషయాలను ప్రస్తావించారు.270 మంది సభ్యుల పాకిస్థాన్ పార్లమెంట్‌లో పిటిఐకి ఇప్పటివరకూ 116 స్థానాలు వచ్చాయి. మరి కొన్ని స్థానాల్లో గెలుపోటములను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇప్పటివరకూ పాకిస్థాన్ ఎన్నికల సంఘం అధికారికంగా 267 స్థానాలలో ఫలితాలను వెల్లడించింది. పాకిస్థాన్ దిగువ సభ అయిన నేషనల్ అసెంబ్లీ (ఎన్‌ఎ) మొత్తం సభ్యుల సంఖ్య 342. ఇందులో 272 మందిని ప్రజలు తమ ఓటుతో ఎన్నుకుంటారు. ఇక మిగిలినవారిని నామినేట్ చేస్తారు. 172 స్థానాలు వచ్చే పార్టీనే సొంతంగా ప్రభుత్వం స్థాపించగల్గుతుంది.
ఇండిపెండెంట్ల పట్టు
గణనీయ స్థాయిలోనే ఇండిపెండెంట్లు కూడా గెలిచినందున తమ పార్టీ ప్రభుత్వ స్థాపనకు ఎక్కువగా వారి సాయం తీసుకోవాలని ఇమ్రాన్ సంకల్పించారు. వారిని మచ్చిక చేసుకునే బాధ్యతను తన విధేయుడు జెహంగీర్ ఖాన్ తరీన్‌కు అప్పగించారు. ఆయన రంగంలోకి దిగడంతో ఇండిపెండెంట్లలో కదలిక మొదలైంది. ఎంక్యూఎంపి నేత ఖాలీద్ మక్బూల్ సిద్ధిఖీతో తొలుత జెహంగీర్ మంతనాలు సాగించారు. ఎన్నికల ఫలితాల తిరస్కరణ తదుపరి కార్యక్రమం ఖరారుకు వివిధ పార్టీల నేతలు సమావేశం కాగా దీనికి సిద్ధిఖీ హాజరు కాలేదు. ప్రాం తీయ అసెంబ్లీల్లో కూడా ఇమ్రాన్ పార్టీ కీలక విజయాన్ని సాధించడంతో ఆ పార్టీ వర్గాలు ఇప్పటికే దేశవ్యాప్తంగా తమదే అధికారం అనే విశ్వాసంతో ఆనందంతో ఉన్నా యి. ఖైబర్ ఫక్తూన్‌క్వా ప్రాంతంలో పిటిఐ అత్యధిక స్థానాలను దక్కించుకుంది. తేలిగ్గా ప్రభుత్వం స్థాపించనుంది. బలూచిస్థాన్ ప్రాంతంలో సంకీర్ణ ప్రభుత్వానికి పిటిఐ యత్నిస్తోంది.ఫలితాల ప్రకటన తరువాత ప్రభుత్వ స్థాపనకు ఇమ్రాన్‌కు నిబంధనల మేరకు మూడు వారాల సమయం ఉంటుంది. ఈ వ్యవధిలో ఖచ్చితంగా తన బలం సమీకరించుకోవచ్చునని, సమీకరించుకుని తీరాలని ఇమ్రాన్ భావిస్తున్నారు. ఖైబర్ ప్రాంతంలో మాజీ సిఎం పెర్వాయిజ్ ఖాట్టక్ స్కూల్ విద్యాభ్యాసం దశ నుంచి ఇమ్రాన్‌కు స్నేహితుడు. ఆయననే తిరిగి సిఎం చేయాలని ఇమ్రాన్ భావిస్తున్నారు. ఎన్నికల తరువాత జాతీయ అసెంబ్లీ అధికారికంగా మూడు వారాలలో సమావేశం కావల్సి ఉంటుంది. అప్పటికి ప్రభుత్వ స్థాపన, సభలో బలనిరూపణ వంటి దశలు పూర్తి కావాల్సి ఉంటుంది. పాకిస్థాన్ రాజ్యాంగం మేరకు దేశాధ్యక్షులు నూతన పార్లమెంట్ సెషన్‌ను ఎన్నికలు జరిగిన 21 రోజులకు సమావేశపర్చాల్సి ఉంటుంది.