Thursday, April 25, 2024

దోస్తుల ఖర్చుతోనే దావోస్ ట్రిప్పు

- Advertisement -
- Advertisement -

Imran khan

 

ఇస్లామాబాద్ : దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సమాఖ్య (డబ్లుఇఎఫ్) పర్యటనకు తాను ప్రభుత్వ ఖజానాపై భారం పడకుండా చేసినట్లు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. దావోస్ అధికారిక పర్యటన అత్యంత చవకగా ప్రభుత్వానికి పొదుపుగా మారిందని తెలిపారు. పాకిస్థానీయులపై ఆర్థిక భారం పడకూడదని తాను భావించినట్లు, దావోస్‌కు తన పర్యటన ఖర్చు అంతా కూడా తన స్నేహితులు ప్రముఖ వ్యాపారవేత్తలు ఇక్రమ్ సింగ్, ఇమ్రాన్ చౌదరీలే పెట్టుకున్నట్లు వివరించారు. పాథ్‌ఫైండర్ గ్రూప్, మార్టిన్ డోవ్ గ్రూప్ వారు సంయుక్తంగా ఏర్పాటు చేసిన బ్రేక్‌ఫాస్ట్ ఎట్ దావోస్‌లో ఇమ్రాన్ మాట్లాడారు. తన కంటే ముందున్న పాకిస్థాన్ పాలకుల పర్యటనలతో పోలిస్తే ఈ ట్రిప్పు పది రెట్లు తక్కువ ఖర్చు పర్యటన అని తేల్చిచెప్పారని డాన్ పత్రిక రాసింది. దావోస్ పర్యటన ఒక్కటే కాకుండా నవంబర్‌లో తన ఐరాస సమావేశాల పర్యటనకు కూడా చాలా తక్కువ ఖర్చు అయిందని ఇమ్రాన్ తెలిపారు.

మాజీ అధ్యక్షులు అసిఫ్ జర్దారీ గతంలో వెళ్లినప్పుడు అయిన ఖర్చు 1.4 మిలియన్ డాలర్లు అని, తన ఐరాస పర్యటనకు అయింది కేవలం 1,60,000 డాలర్లు అని ఇమ్రాన్ తెలియచేసుకున్నారని పత్రిక తెలిపింది. కష్టాలలో ఉన్న తమ దేశంపై మరింత భారం మోపడం తనకు ఇష్టం లేదని, రెండు రాత్రుల బసకు నాలుగున్నర లక్షల డాలర్ల భారం అయి ఉండేదని, ఇది తనకు ఇష్టం లేదని, ఈ క్రమంలో తన స్నేహితుడు , రిటైర్డ్ సైనికాధికారి, పాథ్‌ఫైండర్ గ్రూప్ ఛైర్మన్ ఖాన్ పెద్ద మనసుతో వ్యవహరించారని తెలిపారు. ఆయన వల్లనే తాను దావోస్‌కు రాగల్గినట్లు చెప్పారు. ఒక దేశ ప్రధాని విదేశీ అధికారిక పర్యటన ఖర్చులను ప్రైవేటు వ్యక్తులు లేదా వ్యాపారవేత్తలు భరించడం ఇదే తొలిసారి, పైగా తన ప్రయాణ భారం అంతా వ్యాపారులే మోశారని ప్రధాని చెప్పడం కూడా తొలిసారే.

Imran khan Davos Trip at expense of Friends
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News