Home ఎడిటోరియల్ సయోధ్య ఆశించవచ్చా?

సయోధ్య ఆశించవచ్చా?

Imran Khan elected as Pakistan prime minister

మాజీ క్రికెటర్, పాకిస్థాన్ తెహ్రిక్ ఎ ఇన్సాఫ్ (పిటిఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రిగా పదవీ స్వీకారం చేయటంతో తొలిసారి తృతీయ పక్షం అధికారం చేపట్టింది. 71 ఏళ్ల పాకిస్థాన్ చరిత్రలో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి), పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ షరీఫ్ (పిఎంఎల్) మధ్యనే అధికారం మార్పిడి, మధ్యమధ్యలో ప్రజాస్వామ్య పాలనకన్నా అధిక కాలం సైనిక నియంతలు ఏలుబడిసాగించిన దేశంలో ఇది గమనార్హమైన మార్పు; పట్టువిడవని విక్రమార్కునిలా 22 సంవత్సరాలపాటు ఇమ్రాన్‌ఖాన్ సాగించిన రాజకీయ పోరాట ఫలితం.

అయితే రాజకీయాలను శాసించే సైన్యం ఈ పర్యాయం ఇమ్రాన్‌ఖాన్‌ను సమర్థించటం వల్లనే ఈ విజయం వనగూరిందనే ఆరోపణలున్నాయి. కాని “ఏ నియంత నాకు అండగా లేడు. నేను ఇక్కడ ఈ పార్లమెంటులో నా సొంత కాళ్లమీదే నిలబడ్డాను” అని ఇమ్రాన్ ఖాన్ జాతీయ అసెంబ్లీలో ప్రకటించారు. ఇందులో వాస్తవమెంతో కాలమే నిర్ణయిస్తుంది. 2018 ఎన్నికల్లో మాత్రమే పాకిస్థాన్‌లో అధికారం ప్రజాస్వామ్యయుతంగా ఒక పార్టీ నుంచి మరో పార్టీ చేతిలోకి మారటం దాని కల్లోల రాజకీయ చరిత్రకు అద్దం పడుతున్నది. అయితే ఏ ప్రధానమంత్రీ ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేయలేదు. అందువల్ల పౌర సైనిక సంబంధాల్లో సమతౌల్యం పాటించేందుకు ఇమ్రాన్ ఖాన్ గడసాము చేయకతప్పదు.

ఖాన్ ప్రభుత్వం ముందున్న అతిపెద్ద తక్షణ సవాలు ఆర్థిక వ్యవస్థ. ఐఎంఎఫ్ నుంచి బెయిలౌట్ తప్పనిసరి దుస్థితిలో ఉంది. ఇమ్రాన్ ఖాన్ మాటల్లోనే ‘మన రుణ భారం రూ. 28 లక్షల కోట్లు. పాకిస్థాన్ చరిత్రలో ఎన్నడూ ఇటువంటి కష్టతరమైన ఆర్థిక పరిస్థితులు లేవు. గత 10 సంవత్సరాల్లో చేసినంత అప్పు గత చరిత్రలో ఎన్నడూ లేదు. వడ్డీలు చెల్లించటానికి కొత్త అప్పులు చేస్తున్నాం. ఒకవైపు అప్పుల భారం, రెండో వైపున మానవాభివృద్ధి సూచీ అధమ స్థానం.’ సంక్షేమ రాజ్యం గూర్చి మాట్లాడిన ఇమ్రాన్ ఖాన్ దేశం నుంచి, దేశ జీవనం నుంచి టెర్రరిజాన్ని పెకలించాల్సిన ఆవశ్యకతను దాటవేశారు. పాకిస్థాన్‌కు ఆది నుంచి అన్ని విధాల అండగా ఉంటూ, తన వ్యూహాత్మక రక్షణ ప్రయోజనాలకు పాక్ సైనిక వ్యవస్థను, పౌర ప్రభుత్వాలను ఉపయోగించుకుంటూ వచ్చిన అమెరికా సైతం ఇప్పుడు ఇస్లామాబాద్ టెర్రరిస్టులకు “సురక్షిత స్వర్గం”గా మారిందని విమర్శిస్తున్నది. తమ అభిమాన దేశంలో ప్రభుత్వం మారినందున తమ ప్రాధాన్యతలేమిటో, ఆకాంక్ష లేమిటో కొత్త ప్రధానితో చర్చించటానికై అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో వచ్చే నెల 5న పాకిస్థాన్ పర్యటనకు వస్తున్నట్లు సమాచారం.

ఇమ్రాన్‌ఖాన్ పాకిస్థాన్ విదేశాంగ మంత్రిగా అనుభవజ్ఞుడైన షా మహమూద్ ఖురేషీని ఎంచుకున్నారు. పిపిపి ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా పనిచేసిన ఖురేషీ 2011లో పిటిఐలో చేరారు. భారత్‌తో సత్సంబంధాలు కోరుకునే వ్యక్తి. చిత్రమేమంటే, 2008లో ఆయన ఢిల్లీలో ఉండగానే ముంబయిపై టెర్రరిస్టు దాడి జరిగింది. “ ఈ సమస్యలోకి రాజకీయాలు తీసుకురాకండి. ఇది సమష్టి సమస్య. మనం ఉమ్మడి శత్రువును ఎదుర్కొంటున్నాం. శత్రువును ఓడించటానికి మనం చేతులు కలపాలి” అన్నది ఆయన తక్షణ వ్యాఖ్య. ప్రపంచ దేశాలు వ్రేలెత్తి చూపుతున్నా పాకిస్థాన్ నేటికీ టెర్రరిస్టులకు అడ్డాగా కొనసాగుతున్నది. ఆ గడ్డ నుంచి భారత్‌లోకి టెర్రరిస్టుల ఎగుమతి జరుగుతున్నది. సైనిక దళాలు టెర్రరిస్టుల చొరబాటును సులభం చేయటానికి రోజూ కాల్పులు జరుపుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితిలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ , విదేశాంగ మంత్రి ఖురేషీ ఉద్రిక్తోపశమనకు ఏవైనా చర్యలు తీసుకుంటారా, సైన్యం ఎంతవరకు వీరికి స్వేచ్ఛ ఇస్తుందనేది వేచి చూడదగిన విషయాలు.

అయితే తమ పార్టీ విజయం ఖాయమైన సందర్భంలో ఇమ్రాన్ ఖాన్ టెలివిజన్ ప్రసంగంలో భారత్‌తో స్నేహ సంబంధాల ఆకాంక్షను వ్యక్తం చేశారు. ప్రధాన అడ్డంకిగా ఉన్న కశ్మీర్ సమస్య విషయంలో భారత్ ఒక అడుగు ముందుకేస్తే తాము రెండడుగులు వేస్తామన్నారు. ఇదొక ఆశావహ ప్రకటన. కొత్త ప్రధాని ఖాన్‌కు భారత ప్రధాని నరేంద్ర మోడీ పంపిన సందేశంలో పాకిస్థాన్‌తో శాంతియుత పొరుగు సంబంధాలు కోరుకుంటున్నామని, నిర్మాణాత్మకంగా, అర్థవంతంగా పనిచేసేందుకు సిద్ధమంటూ, టెర్రరిజం రహిత దక్షిణాసియా కొరకు కృషి చేయాల్సిన అవసరాన్ని వక్కాణించారు. కాబట్టి ఈ దిశగా చర్యలు తీసుకుంటే ఇరు దేశాల ప్రజలు సంతోషిస్తారు. రాజకీయ సంకల్ప లోటును అధిగమిస్తే సయోధ్య దిశగా అడుగు తీసి అడుగు వేయవచ్చు.