కరాచీ : పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అన్ని విధాలుగా విఫలం అయ్యారని దేశ ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శించారు. ఇమ్రాన్ అసమర్థుడు, దేనిపైనా అవగావహన లేని వాడు, ఆయన ప్రభుత్వ తీరు నియంతృత్వం కన్నా దారుణంగా ఉందని సోమవారం ఇక్కడ జరిగిన ఓ ర్యాలీలో ప్రతిపక్షాలు మండిపడ్డాయి. దేశానికి సరైన సారథ్యం వహించలేని స్థితిలో ఉన్న ఇమ్రాన్ పదవి నుంచి వైదొలగాలనే డిమాండ్‌తో ప్రతిపక్షాల కూటమి ఏర్పాటు అయింది. ఈ కూటమి చేపట్టిన రెండో ర్యాలీలో వివిధ ప్రతిపక్ష నేతలు పాల్గొన్నారు. పాకిస్థాన్ ప్రజాస్వామ్య ఉద్యమం (పిడిఎం) పేరిట ఏర్పాటు అయిన కూటమిలో 11 ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. ఈ కూటమి దేశంలో ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాన్ని మూడు దశలుగా చేపట్టింది. ఖాన్ నాయకత్వపు పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ (పిటిఐ) ప్రభుత్వాన్ని తొలిగించేందుకు ఉద్యమకార్యాచరణ పేరిట ప్రతిపక్షాలు రంగంలోకి దిగాయి.