Home ఎడిటోరియల్ చర్చలు టెర్రర్

చర్చలు టెర్రర్

Article about Modi china tour

భారత్ పాకిస్థాన్‌ల మధ్య 2016లో నిలిచిపోయిన చర్చల పునరుద్ధరణ జరిగేనా? అనుకూల, వ్యతిరేక వాదనలు రెండూ సమంజసంగానే కనిపిస్తాయి. చర్చలు టెర్రర్ రెండూ పొసగవన్న ప్రకటిత విధానాన్ని మోడీ ప్రభుత్వం మార్చుకుందా? లేదు అని ప్రభుత్వం ఘంటాపధంగా చెబుతున్నది. అటువంటప్పుడు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్, పాకిస్థాన్ కొత్త ప్రభుత్వ విదేశాంగ మంత్రి మఖ్దూం షా మహమూద్ ఖురేషీ చర్చలు జరిపినా ప్రయోజనమేమిటి? సరిహద్దులో సెప్టెంబర్ 18న పాకిస్థాన్ సైనికులు భారత్ బిఎస్‌ఎఫ్ హెడ్‌కానిస్టేబుల్ నరేందర్ సింగ్‌ను కిరాతకంగా హత్య చేసిన అనంతరం ప్రతీకార చర్యలు తీసుకోకుండా చర్చలేమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా కశ్మీర్ లోయలో హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థకు చెందిన తీవ్రవాదులు ముగ్గురు పోలీసులను కిడ్నాప్ చేసి హత్య చేశారు. ప్రాణ భయంతో నలుగురు పోలీసులు (ఎస్‌ఒపి) ఉద్యోగానికి రాజీనామా చేశారు. భారత్ పాకిస్థాన్ చర్చలు ప్రతిపాదనలోకి వచ్చినపుడల్లా వాటిని నిరోధించటానికి అటు పాకిస్థాన్ ఉగ్రవాదులు, ఇటు కశ్మీర్‌లోని మిలిటెంట్‌లు అరాచక కృత్యాలకు పాల్పడటం మామూలే. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల సడలింపుకు చర్చలేమార్గం కాబట్టి ప్రతీఘాత చర్యలను లక్షపెట్టకుండా సుష్మాస్వరాజ్ ఖురేషీ చర్చలు జరగవలసిందేనన్నది రెండో వాదన.
పాకిస్థాన్ కొత్త ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సైన్యం చేతిలో కీలుబొమ్మ అనే అపవాదుతో అధికారంలోకి వచ్చారు. కశ్మీర్ వివాదం సహా వివాదాలపై చర్చలకు తాను సిద్ధమని, ఈ విషయంలో భారత్ ఒక అడుగు ముందుకేస్తే తాను రెండు వేస్తానని పదవిలోకి రాకముందే పత్రికాగోష్టిలో ఆయన చెప్పారు. దాని కొనసాగింపుగా కావచ్చు. ఐరాస సమావేశం సందర్భంగా ఇరు దేశాల విదేశాంగ మంత్రుల సమావేశాన్ని ప్రతిపాదిస్తూ ఇమ్రాన్ ఖాన్ రాసిన లేఖ సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోడీకి అందింది. ఈ నెల 25న ప్రారంభమయ్యే జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంలో సెప్టెంబర్ 27న సార్క్ విదేశాంగ మంత్రుల విందు, ఇష్టాగోష్టి సమావేశం ఎలాగూ ఉంది. అంతకు ముందే భారత్ పాక్ విదేశాంగ మంత్రుల సమావేశం కావాలన్న ఇమ్రాన్ ఖాన్ ప్రతిపాదనకు భారత ప్రభుత్వం గురువారం నాడు అంగీకారం తెలిపింది. అయితే సమావేశానికి అంగీకరించినంతమాత్రాన సీమాంతర ఉగ్రవాదం విషయంలో, చర్చలు టెర్రరిజం పొసగవన్న భారత్ వైఖరిలో మార్పు లేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఉద్ఘాటించారు. సుష్మా ఖురేషీలు కరచాలనం చేసుకుని పరస్పర వైఖరులను ముఖాముఖంగా వ్యక్తం చేసుకున్నా అది ప్రస్తుత పరిస్థితిలో పురోగతి కిందే లెక్క. ఘనీభవించిన మంచు కరగటానికి అది ఏమాత్రం దోహదకారి అయినా మేలే. అధికారికంగా చర్చలు పునరుద్ధరణ అయినంత మాత్రాన సమస్యలకు సత్వర పరిష్కారాలుంటాయని, శాంతి నెలకొంటుందని ఎవరూ ఆశించరు. చర్చలు కూడదనే వైఖరి టెర్రరిస్టులు, మిలిటెంట్ల పన్నాగంలో చిక్కుకోవటమే అవుతుంది. ఇరుదేశాల మధ్య ‘సమగ్ర ద్వైపాక్షిక సంభాషణ’ క్రమం 2016 జనవరిలో పఠాన్‌కోట వైమానికదళ స్థావరంపై టెర్రరిస్టు దాడితో నిలిచిపోయింది.
చర్చల పునరుద్ధరణ కొరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడి నిరాకరించలేని వాస్తవం. స్థూలంగా టెర్రరిజంపై, ప్రత్యేకించి ఆఫ్ఘన్ విషయంలో టెర్రరిజంపై పాకిస్థాన్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పలుమార్లు డిమాండ్ చేశారు. సంతృప్తికరమైన చర్యలు తీసుకోనందుకు గత నెలలో ఆర్థిక సహాయం నిలుపు చేశారు. అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో పాకిస్థాన్ పర్యటన నుంచి 2+2 చర్చలకు ఢిల్లీ రావటం గమనార్హం.
మోడీ ప్రభుత్వం పాకిస్థాన్ విధానంలో గత నాలుగున్నర సంవత్సరాల్లో పిల్లి మొగ్గలు వేసింది. తన పదవీ స్వీకారోత్సవానికి నాటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను ఆహ్వానించిన మోడీ, 2015 డిసెంబర్ 25న షరీఫ్ పుట్టిన రోజున అకస్మాత్తుగా లాహోర్‌లో దిగిపోయారు. మరోసారి పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగి పొందటం తన ప్రాధాన్యత అని ఎర్రకోటపై ఒక ప్రసంగంలో ప్రకటించారు. 2017 సెప్టెంబర్ 29న సైన్యం సర్జికల్ దాడి జరిపింది. అది మన సైనిక ప్రావీణ్యానికి నిదర్శమేగాని సరిహద్దులో పరిస్థితి మరింత క్షీణించింది. ఆ రెండవ వార్షిక దినాన్ని దేశమంతటా యూనివర్శిటీల్లో వేడుకగా జరుపుతారట! ఇరు దేశాల్లోనూ జాతీయవాదం జాతీయోన్మాదానికి దారి తీయకూడదు. భారత్ పాకిస్థాన్ రెండూ గతం నుంచి నేర్చుకోవాలి నిరంతరాయ చర్చలకు ఉపక్రమించాలి. అదొక్కటే శాంతికి మార్గం.