*చేవెళ్ల, వికారాబాద్ సభకు భారీ ఏర్పాట్లు
*చేవెళ్ల సెంటిమెంట్ కలిసొస్తుందని ధీమా
*అన్నీ తానై నడిపిస్తున్న మాజీ మంత్రి సబితారెడ్డి
మన తెలంగాణ/రంగారెడ్డి జిల్లా ప్రతినిధి :
తెలంగాణ ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమైన కాంగ్రెస్ పార్టీ ఐక్యతరాగం వినిపించి బస్సు యాత్రను విజయవంతం చేయడానికి సిద్ధం అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి కలసివచ్చిన చేవెళ్ల సెంటిమెంట్‌తో బస్సు యాత్రను చేవెళ్ల నుంచి ప్రారంభిస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రారంభోత్సవ సభకు భారీ స్థాయిలో జనం సమీకరించి క్యాడర్‌లో జోష్ తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి రెండు పర్యాయాలు చేవెళ్ల సెంటిమెంట్‌తో ప్రజల వద్దకు వెళ్లి పవర్‌లోకి రావడంతో పాటు సియం పగ్గాలను చేజిక్కించుకోవడంతో ప్రస్తుతం సైతం నేతలు అదే ఆశలతో ముందుకు సాగుతున్నారు. 26న చేవెళ్ల సభకు చేవెళ్ళ, రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణకు మాజీ మంత్రి సబితారెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ ఇన్‌చార్జి కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు సాగుతున్నాయి. చేవెళ్ల సభను విజయవంతం చేసి జిల్లా పార్టీలో తన పట్టును మరో మారు నిలుపుకోవడానికి సబితారెడ్డి తీవ్రంగా శ్రమిస్తున్నారు. గతంలో చేవెళ్ల సెంటిమెంట్‌తో నిర్వహించిన పాదయాత్రల అనంతరం వైయస్ సియం కావడంతో పాటు రాష్ట్ర క్యాబినెట్‌లో సబితారెడ్డి కీలకమైన మంత్రిగా వ్యవహరించి పాలనలో చక్రం తిప్పడంతో మరోమారు తమకు అలాంటి భవిష్యత్ వస్తుందన్న ఆశ నేతల్లో కనిపిస్తుంది. మూడు నియోజకవర్గాలలో స్వయంగా పర్యటించి జన సమీకరణ బాధ్యతలను అనుచరులకు అప్పగించారు. డిసిసి అధ్యక్షుడు క్యామ మల్లేష్, మాజీ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, కెఎల్‌ఆర్ తదితరులు తమ నియోజకవర్గాల నుంచి ముఖ్య నేతలను, కార్యకర్తలను ర్యాలీలుగా సమావేశాలకు తరలించడానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. గాంధీభవన్ నుంచి బయలుదేరిన జాతీయ, రాష్ట్ర నేతలను పోలీస్ అకాడమీ వద్ద స్వాగతం పలికి అక్కడ నుంచి దాదాపు వేయికి పైగా కార్లతో చచేవెళ్ల వరకు ర్యాలీ నిర్వహించడానికి జిల్లా నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి చేవెళ్ల వరకు కాంగ్రెస్ పార్టీ తోరణాలు, హోర్డింగ్, బ్యానర్‌లు,ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు పలువురు ఇప్పటికే దారి వెంట పెద్ద ఎత్తున హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
వికారాబాద్‌లో మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ నాయకత్వంలో సెంటిమెంట్‌తో బస్సు యాత్రను చేవెళ్ల ప్రారంభించిన అనంతరం మొదట వికారాబాద్‌కు చేరుకుంటుంది. సోమవారం సాయంత్రం వికారాబాద్‌లో నిర్వహించే సభకు భారీ స్థాయిలో జనసమీకరణ చేసి తన సత్తా నిరూపించుకోవడానికి మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. వికారాబాద్ కాంగ్రెస్‌లో మాజీ మంత్రులు ప్రసాద్ కుమార్, చంద్రశేఖర్‌లు గ్రూపులు వేరు వేరుగా సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రసాద్ కుమార్ వర్గం జనసమీకరణపై దృష్టిపెట్టింది. సభ విజయవంతం అయితే తమ ఖాతాల్లోకి వేసుకోవడానికి ఫేయిల్ అయితే ప్రసాద్ వర్గంపై నెట్టడానికి మరో వర్గం నేతలు సిద్దంగా ఉన్న ప్రసాద్ కుమార్ మాత్రం గత పది రోజులుగా ప్రతి గ్రామంలో పర్యటిస్తు సభను విజయవంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వికారాబాద్ సభ అనంతరం సోమవారం రాత్రికి జాతీయ, రాష్ట్ర నేతలు వికారాబాద్‌లోని అనంతగిరిలో బస చేసి మరుసటి రోజు మద్యాహ్నం అక్కడ నుంచి తాండూర్‌కు బయలుదేరనున్నారు. తాండూర్‌లో సైతం నిర్వహిస్తున్న సభను విజయవంతం చేసి మంత్రి మహేందర్‌రెడ్డికి షాక్ ఇవ్వడానికి కాంగ్రెస్ నేతలు సిద్దం అవుతున్నారు. కొడంగల్, తాండూర్ నుంచి జన సమీకరణ భాద్యతలను స్థానిక నాయకత్వంలో పాటు రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. తాండూర్ సభలో మంత్రి మహేందర్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం ఖాయంగా కనిపిస్తుంది. ఒక్కో సభకు కనీసం 30 వేలకు పైగా జనంను తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాపైనే …
కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్రకు సోషల్ మీడియాను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి ఏర్పాట్లు చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వ వత్తిడి మూలంగా ప్రముఖ మీడియా తమకు లైవ్ కవరేజ్ ఇచ్చే పరిస్థీతులు లేవని అందుకే సోషల్ మీడియాను వాడుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు తెలిపారు. పిసిసి నుంచి ప్రత్యేక టిమ్ ఇప్పటికే దీనిపై కసరత్తు నిర్వహిస్తుంది. ప్రతి సమావేశంను ఫేస్‌బుక్‌తో పాటు ఇతర సోషల్ సైట్‌లలో లైవ్ కవరేజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు