Home ఎడిటోరియల్ ట్రంప్‌కు చుక్కెదురు

ట్రంప్‌కు చుక్కెదురు

In legal structure of system, Donald trump can be trimmed      అమెరికా పార్లమెంటు (కాంగ్రెస్)కు జరిగిన ఎన్నికల ఫలితాలు దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మితవాద దూకుడు పాలనను ఎంత వరకు నిలువరించగలవనేది చెప్పలేముగాని శాసన నిర్మాణ వ్యవస్థలో ఆయనకు చుక్కెదురైన సంగతి సుస్పష్టం. ప్రజలు నేరుగా ఎన్నుకునే మన లోక్‌సభ వంటి అమెరికన్ ప్రతినిధుల సభలో ట్రంప్‌కు చెందిన రిపబ్లికన్ పార్టీ ఆధిక్యాన్ని కోల్పోయింది. ప్రతిపక్ష డెమొక్రాట్లు స్పష్టమైన మెజారిటీతో దాని మీద అదుపును సంపాదించుకున్నారు. అభిశంసన ప్రక్రియను చేపట్టడం దగ్గరనుంచి పలు చట్ట ప్రతిపాదనలు చేసే అధికారం గల ప్రతినిధుల సభ మీద డెమొక్రాట్లకు పట్టు లభించడంతో ట్రంప్ పాలనలో నిర్వీర్యమవుతున్న అమెరికన్ ప్రజాస్వామిక నీతికి మళ్లీ కొంత ప్రాణం వచ్చిందని అనుకోవలసి ఉన్నది. అయితే సెనెట్‌లో రిపబ్లికన్ల ఆధిక్యత కొనసాగనుండడం ట్రంప్‌కు శుభ సూచకం. వచ్చే జనవరి నుంచి కొలువుదీరనున్న కొత్త ప్రతినిధుల సభలో డెమొక్రాట్ల సంఖ్యాబలం 223 కు పెరిగింది. రిపబ్లికన్ల రాశి 197కు పడిపోయింది. ఇప్పటి సభలో రిపబ్లికన్లకు 235, డెమొక్రాట్లకు 193 స్థానాలున్నాయి. ప్రతినిధుల సభ మొత్తం బలం 435. వంద మంది సభ్యులుండే సెనెట్‌లో 51 మందితో రిపబ్లికన్ పార్టీ ఆధిక్యంతో కొనసాగు తున్నది. ఈసారి విశేషం మహిళలు అధికంగా (దాదాపు వంద మంది) ఎన్నిక కావడం, అలాగే శ్వేతేతర జాతుల వారు గతం కంటే ఎక్కువ ప్రాతినిథ్యం పొందడం, ఎన్నికైన డెమొక్రాట్లలో ప్రగతి శీలురు ప్రజాస్వామ్య ప్రియుల సంఖ్య పెరగడం.

ట్రంప్ ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని తన అమ్ములపొదిలోని అన్ని విద్వేష విషపూరిత అస్త్రాలనూ ప్రయోగించాడు. ముఖ్యంగా వలసలను అరికడతానని గత అధ్యక్ష ఎన్నికలలో తానిచ్చిన హామీల మేరకు భీషణ ప్రకటనలకు తెర తీసి తన ఓటు బ్యాంకును మళ్లీ ఆకట్టుకోగలిగాడు. హెచ్ 1 బి వీసాలపై వేటు వేసే దిశగా తీసుకున్న చర్యలు, అక్కడ పుట్టిన విదేశీయుల పిల్లల పౌరసత్వ హక్కును రద్దు చేస్తాననే ప్రకటన తదితర హుంకరింపులకు వెనుకాడలేదు. సెంట్రల్ అమెరికా దేశాలైన హొండూరస్, గ్వాటెమాల, ఎల్ సాల్వడార్‌ల నుంచి వెల్లువెత్తి వస్తున్న వేలాది మంది శరణార్థులను నిర్దాక్షిణ్యంగా వెనక్కి పంపించడానికి తప్పనిసరైతే కాల్చి పారేస్తామన్న బెదిరింపులతో సైన్యాన్ని మెక్సికో సరిహద్దుల వద్ద మోహరింప చేశాడు. ఆమేరకు తనవెంట గతంలో నిలిచిన గ్రామీణ, నిరుద్యోగ అమెరికన్లను ఈసారి కూడా ట్రంప్ నిలబెట్టుకోగలిగాడు. ఈ ఎన్నికల ఫలితాలు అమెరికాలో నెలకొన్న ప్రచ్ఛన్న అంతర్యుద్ధ పరిస్థితులను వెల్లడి చేస్తున్నాయనే వ్యాఖ్య గమనించదగినది.

ఒకవైపు అంతగా చదువుకోని నిరుద్యోగ గ్రామీణ అమెరికన్లు, మరొక వైపు నగర, పట్టణ ప్రజలు, విద్యావంతులు, వలసల అనుకూలురు ఈ రెండు వర్గాలుగా ఓటర్లు చీలిపోయారనే అభిప్రాయం వెల్లడవుతున్నది. అధ్యక్ష ఎన్నికల బరిలో ట్రంప్ రంగప్రవేశంతో ఊపందుకున్న పచ్చిమితవాద విధానాలకు ఊపిరి పెరుగుతున్నదేగాని తగ్గడం లేదని ఈ ఎన్నికల ఫలితాలు రుజువు చేస్తున్నాయనే వ్యాఖ్యానాన్నీ కొట్టిపారేయలేము. ఫలితాలు వెలువడుతున్న దశలోనే ప్రతినిధుల సభలో తగిలిన దెబ్బకు అసంతృప్తి చెందిన ట్రంప్ అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్‌ను తొలగించాడు. అధ్యక్ష ఎన్నికలలో రష్యాతో కుమ్మక్కయ్యాడని తనమీద వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు పర్యవేక్షణ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించినందుకు సెషన్స్‌ను ట్రంప్ గతంలో నిందించిఉన్నాడు.

ఈ దర్యాప్తులో తనకు అప్పగించని అంశాలలో కూడా మ్యుల్లెర్ కమిటీ తలదూర్చుతున్నదని ఆరోపణ చేసిన మేథ్యూ జి వైటేకర్ అనే రిపబికన్ విధేయుడిని సెషన్స్ స్థానంలో తాత్కాలిక అటార్నీ జనరల్‌గా నియమించడంలో ట్రంప్ దురుద్దేశం తెలిసినదే. ప్రతినిధుల సభ మీద లభించిన పట్టుతో ఇటువంటి కుయుక్తులను పారకుండా చేసి రష్యాతో కుమ్మక్కు కేసులో దర్యాప్తును తుదికంటా నిజాయితీగా జరిపించే బాధ్యత డెమొక్రాట్లపై ఉన్నది. ట్రంప్ మితిమించిన తెంపరితనంతో సిఎన్‌ఎన్ ప్రధాన ప్రతినిధి జిమ్ అకోస్టా వైట్‌హౌస్ జర్నలిస్టు పాస్‌ను కూడా రద్దు చేశాడు. ఎన్నికలలో మీడియా తనకు వ్యతిరేకంగా పనిచేసిందనే అక్కసుతోనే ఇందుకు పాల్పడ్డాడు. సెనేట్‌లో వెంట్రుక వాసి మెజారిటీతో ట్రంప్ తన అధికారం మీద పట్టును నిలుపుకోగలిగినప్పటికీ ఇక నుంచి డెమొక్రాట్లతో కలిసి పని చేయక తప్పని పరిస్థితులలో పడ్డాడనేది వాస్తవం. ఆయన దూకుడును, ఏకపక్ష నిరంకుశ విధానాలను వ్యతిరేకిస్తున్న ప్రజాస్వామిక ప్రియులకు ఇది నిస్సందేహంగా హర్షకారణమే.

In legal structure of system, Donald trump can be trimmed

Telangana Latest News