Home సంగారెడ్డి మహిళలకు మరింత ‘భరోసా’

మహిళలకు మరింత ‘భరోసా’

 yet another step for the safety of women

మన తెలంగాణ/సంగారెడ్డి : మహిళల భద్రతకోసం సంగారెడ్డిలో పోలీసులు మరో అడుగు ముందుకేశారు. సోమవారం సంగారెడ్డి పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలో మహిళల భద్రతకు గాను జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళలు అకతాయిల ఆగడాలను అరికట్టేందుకు నూతనంగా మొదటగా భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందులో ముఖ్యంగా బస్టాండ్‌లలో ర్యాగింగ్, అత్యాచారాలు, అక్రమ రవాణా, సోషల్ మీడియా, మెడికల్, లీగల్, ప్రాసిక్యూషన్, కౌన్సిలింగ్ వంటి అన్నిరకాల సహాయ సహకారాలు ఈ కేంద్రం ద్వారా అందుతాయన్నారు. జిల్లాలో ప్రస్తుతం బరోసా కేంద్రం పోలీసుస్టేషన్ పరిధిలో ఏర్పాటు చేయడం జరిగిందని, త్వరలో ప్రత్యేక భవనాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

భరోసా కేంద్రంలో ఫిర్యాదు చేస్తే వెంటనే తక్షణ చర్యలు తీసుకొని మహిళలు, విద్యార్థినులకు భరోసా కల్పించడం ముఖ్యోద్దేశమని ఎస్పీ తెలిపారు. అలాగే విద్యార్థినులు, మహిళలు ఏదైనా ప్రమాదానికి గురైతే ప్రథమ చికిత్సకూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొదటి సారి ఫిర్యాదు చేసిన వివరాలను దృష్టిలో ఉంచుకొని కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు. కేసు వివరాలు పోలీస్టేషన్‌లో రికార్డు చేస్తామన్నారు. అలాగే షీటీంలు ప్రస్తుతం జిల్లాలో సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్, పటాన్‌చెరులలో ఉండి మహిళల ఫిర్యాదులు తీసుకొని కౌన్సలింగ్ చేస్తూ మహిళల భధ్రతకు తక్షణ సేవలందిస్తున్నాయన్నారు. భరోసా కేంద్రానికి అనుసంధానమై పనిచేస్తాయన్నారు. జిల్లాకు త్వరలో ఉమెన్ పోలీసుస్టేషన్‌లకు వాహనాలు త్వరలో మంజూరుకానున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు డీఎస్పీ శ్రీనివాస్‌కుమార్, ట్రాఫిక్‌సీఐ సంజయ్‌కుమార్, ఉమెన్ పోలీసుస్టేషన్ సీఐ ప్రమీల, టౌన్ సీఐ రామక్రిష్ణారెడ్డి, ఎస్‌ఐ సుభాష్‌రెడ్డి, వెంకట్‌రాజు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.