Home ఎడిటోరియల్ అమానుష వృత్తి, వ్యవస్థ

అమానుష వృత్తి, వ్యవస్థ

Sampadakiyam     సాటి మనుషుల చేత ఈ పని చేయించడం అత్యంత అమానుషం’ మనుషుల చేత పారిశుద్ధపు చాకిరీ (మరుగుదొడ్లలోని మలాన్ని తీయించి తొలగించడం) చేయించడంపై సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం నాడు చేసిన ఈ వ్యాఖ్య ప్రత్యక్షర సత్యం. కుల వ్యవస్థలో భాగంగా అణగారిన సామాజిక వర్గాల చేతనే ఈ అమానుషాన్ని ఒక వృత్తిగా చేయించడం దేశంలో ఇప్పటికీ కొనసాగుతుండడం ప్రజాస్వామ్యానికి సిగ్గు చేటు. ఎస్‌సి, ఎస్‌టిలపై అత్యాచారాలు, అఘాయిత్యాల నిరోధక చట్టంలోని నిబంధనలను బలహీన పరుస్తూ గత ఏడాది తామిచ్చిన తీర్పును తిరిగి పరిశీలించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసుకున్న అప్పీలు పై విచారణలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్య చేసింది. మనుషుల చేత మల మూత్రాలు తీయించడం, మేన్ హోల్స్ (మురుగు కూపాలు) లో దించి వాటిని బాగు చేయించడం చావడానికి గ్యాస్ ఛాంబర్స్‌లోకి పంపించడం వంటిదేనని ఇటువంటి పద్ధతి ఇంకే దేశంలోనూ లేదని ధర్మాసనం వెలిబుచ్చిన అభిప్రాయం ముమ్మాటికీ నిజం.

ఈ పనుల్లోని వారికి ముసుగులు, ఆక్సిజన్ సిలిండర్ల వంటివి ఎందుకు ఇవ్వడం లేదని ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం తరపున హాజరయిన అటార్నీ జనరల్ కె.కె. వేణుగోపాల్‌ను సుప్రీంకోర్టు సూటిగా నిలదీసింది. అందరూ సమానులేనని భారత రాజ్యాంగం స్పష్టం చేసిందని అది ఆచరణలో ప్రతిఫలించడానికి తగిన సౌకర్యాలను, ఏర్పాట్లను అధికారులే కల్పించడం లేదని కూడా ధర్మాసనం వ్యాఖ్యానించింది. దేశంలో ప్రతి నెలా నలుగురు లేదా ఐదుగురు పారిశుద్ధ కార్మికులు మేన్‌హోల్స్‌లో దిగి చనిపోడం దారుణమని సమాజమే వారిని మృత్యుకూపాల్లోకి పంపుతున్నదని ధర్మాసనం వెలిబుచ్చిన అభిప్రాయం ఈ దుర్మార్గానికి తక్షణమే ముగింపు పలకవలసిన అవసరాన్ని నొక్కి చెబుతున్నది. ఇదే సందర్భంలో సుప్రీంకోర్టు మరో చేదు వాస్తవాన్ని కూడా ప్రస్తావించింది.

స్వాతంత్య్రం సిద్ధించి 70 ఏళ్లు పైబడినా కుల వివక్ష కొనసాగుతుండడాన్ని అది ఎత్తి చూపించింది. వాస్తవానికి ఈ వృత్తిని నిషేధిస్తూ 1993లోనే చట్టం వచ్చింది. కాని దేశ వ్యాప్తంగా 180,657 కుటుంబాలు ఈ పనిలో కొనసాగుతున్నట్టు 2011 నాటి సామాజిక, ఆర్థిక కుల జన గణన స్పష్టం చేసింది. దేశ వ్యాప్తంగా ఈ పనిలో 7,94000 మంది ఉన్నట్టు వెల్లడయింది. అత్యధికంగా మహారాష్ట్రలో 63,719 మంది ఉండగా, ఆ తర్వాత స్థానాల్లో మధ్యప్రదేశ్, యుపి, త్రిపుర, గుజరాత్, రాజస్థాన్, కర్నాటకలు ఉన్నట్టు ఒక సమాచారం. ఈ పని చేయించేది అట్టడుగు కులాల వారి చేతనే అనే విషయం దాచేస్తే దాగని కఠోర వాస్తవం. వారిలోనూ ఎక్కువగా మహిళల చేతనే ఈ వృత్తి చేయిస్తున్నారు.

2018లో వెలువడిన ఒక అంచనా ఇటువంటి పారిశుద్ధ కార్మికులు దేశంలో 50 లక్షల మంది వరకు ఉన్నారని అందులో సగం మంది మహిళలేనని వెల్లడించింది. వాస్తవ గణాంకాలు అటు, ఇటుగా ఉన్నప్పటికీ దారుణమైన నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ, దానికి అనుబంధంగా ఉండే పుట్టుకతోనే ఉచ్ఛనీచాలను అంటగట్టే అమానుష విలువలూ దేశంలో ఇప్పటికీ అమల్లో ఉన్న వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు. ఈ వ్యవస్థ అంతం కానంత కాలం సామాజిక అణగారిన స్థితిని, ఆర్థిక దారిద్య్రాన్ని ఆసరా చేసుకొని ఈ వర్గాల చేత ఈ పనిని చేయించడం సాగుతూనే ఉంటుంది. బాగా వెనుకబడి ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లోనే ఇది ఎక్కువగా కనిపిస్తున్నది. అక్కడి గ్రామీణ వ్యవస్థలో ఫ్యూడల్, భూస్వామ్య మానవ సంబంధాలు ఇంకా బలంగా వేళ్లూనుకున్నాయి. వాటిని తొలగించడం అధికార యంత్రాంగం దృఢ సంకల్పంపై ఆధారపడి ఉంటుంది.

ఆర్థికంగా, రాజకీయంగా బలవంతులైన అగ్ర వర్ణాల ప్రాపు రాజకీయ పార్టీలు కోరుకున్నంత కాలం అధికారంలో ఉండేవారు ఇటువంటి అమానవీయ సామాజిక నేపథ్యాన్ని తుద ముట్టించడానికి గట్టిగా సాహసించలేరు. అందుచేతనే ఈ వృత్తి కుల ఆధారితంగా ఇప్పటికీ కొనసాగుతున్నది. ప్రజాస్వామిక భావ జాలాన్ని పాదుకొల్పే విద్య అయినా గ్రామీణ ప్రాంతాల్లో విస్తరిస్తే ఇటువంటి వృత్తుల నుంచి ఆయా వర్గాలు విముక్తం కావడానికి తగిన వాతావరణం అక్కడ నెలకొంటుంది. విద్యలో ముందున్న చోట్ల సామాజిక పరివర్తన వేగంగా వస్తుంది. మెజారిటీ దక్షిణాది రాష్ట్రాల్లో ఈ వృత్తి చాలా వరకు నిర్మూలన కావడానికి ఇది కూడా కొంత కారణమే. సుప్రీంకోర్టు ఈ విషయంలో ఇంత ఘాటైన వ్యాఖ్యలు చేసి పాలకులను బోనులో నిలబెట్టిన తర్వాతనైనా వారు దీని అంతానికి గట్టిగా దీక్ష వహించవలసి ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ విశేష ప్రచారమిచ్చి అమల్లోకి తెస్తున్న స్వచ్ఛ భారత్‌లో భాగంగానైనా ఈ వృత్తిలోని వారిని ఇతర జీవన రంగాల్లోకి మరలించే కృషి చేపట్టాలి. అప్పుడే జాతికి ఈ కళంకం తొలగుతుంది. అంత వరకు నాగరకులం అనిగాని ఆధునికులం అని గాని చెప్పుకునే అర్హత మనకుండదు.

In the feudal relationship, a vassal owed loyalty and service