*ఐటిడిఎ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ దివ్య దేవరాజన్
మన తెలంగాణ/ఆదిలాబాద్ : కేస్లాపూర్‌లో శుక్రవారం నిర్వహించనున్న దర్బారులో వచ్చే ప్రతీ అర్జీకి జవాబు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డి.దివ్య అధికారులను ఆదేశించారు. గురువారం ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా దేవాలయం సమీపంలోని కంట్రోల్ రూం వద్ద జిల్లా, ఐటిడిఎ అధికారులతో దర్బార్ ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కంటే దర్బారులో వచ్చే అర్జీలకు ప్రాముఖ్యత కల్పించాలని అన్నారు. నిరు పేదలు, గిరిజనుల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు అర్జీలను పరిశీలించి సత్వర న్యాయం అందించాలన్నారు. కలెక్టర్‌కు ఉన్న విచక్షణాధికారాల మేరకు వారి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు. సదరం క్యాంపును నిర్వహించాలని వైద్య, ఆరోగ్య శాఖాధికారిని ఆదేశించారు. అర్జీదారునికి వారి అర్జీలను ఎక్కడ సమర్పించాలో ఐటిడిఎ అధికారులు తెలియజేయాలన్నారు. వ్యక్తిగత అర్జీలను కౌంటర్ల వద్ద అందజేయాలని, సామూహిక కార్యక్రమంలో అర్జీలను తనకు అందజేయవచ్చని తెలిపారు. బ్యాం కులకు సంబంధించిన సమస్యలపై బ్యాంకు అధికారులు ఏర్పాటు చేసే కౌంటర్‌లో అర్జీని సమర్పించాలని ఇం దుకు ఏర్పాట్లు చేయాలని ఎల్‌డిఎంకు సూచించారు. అంతకు ముందు సాంప్రదాయ ఆటలు తొక్కుడు బిల్ల, వెదురు కాళ్ళు, బాణం, గుడ్ల దొంగతనం, కర్రసాము, ఖోఖో, కబడీ, వాలీబాల్ పోటీలను కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన దుకాణాలు, భోజన శాల, ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్ళను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జేసి కె.కృష్ణారెడ్డి, సహాయ కలెక్టర్లు డా.గోపి, క్రాంతి, ఆర్‌డిఒలు సూర్యనారాయణ, జగదీశ్వర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.