Home ఫీచర్స్ పిల్లలపై మమతానురాగాలు…

పిల్లలపై మమతానురాగాలు…

 

నేటి సమాజంలో పిల్లలను భద్రంగా పెంచుకోవాలి. అది ఆడపిల్లయినా, మగపిల్లాడైనా సరే. బాల్యంలో జరిగే నష్టం వారి జీవితంపై ప్రభావం చూపుతుంది. కొంతమంది దుర్మార్గులు తమ లైంగిక వాంఛలను తీర్చుకోవడానికి పిల్లలను పావులుగా వాడుకుంటున్నారు. ఇలాంటి వారి పట్ల జాగ్రత్త వ్యవహరించాలి. అది వారిలోని మానసిక లోపమని గుర్తించాలి. మనిషి తనను తాను సంస్కరించుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. మహిళలు, పిల్లలు వస్తువులు కాదు.. వాళ్లూ మనుషులే. ఆ సత్యాన్ని గ్రహించినప్పుడే సమాజంలో మహిళలకు రక్షణ దొరుకుతుంది. అఘాయిత్యాలు ఎక్కువగా మనదేశంలోనే జరుగుతున్నాయి. ఇతర దేశాల్లో చట్టాలు కఠినంగా ఉంటాయి, అందుకే అక్కడ ఇలాంటి సంఘటనలు తక్కువగా చోటు చేసుకుంటాయని చెబుతున్నారు మమతా రఘువీర్.

ఒకప్పుడు బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థపై పోరాడాం. ఇప్పుడు అత్యాచారాలపై పోరాటం చేయాల్సివస్తుంది. ఆనాటి నుంచి ఇప్పటి వరకు బలయ్యింది మహిళలే. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై దాడుల గురించి ‘సకుటుంబం’తో మాట్లాడుతున్నంత సేపు ఆమె కళ్లలో కన్నీటి సుడులు తిరిగాయి. దాడి చేసిన వారికి కఠినంగా శిక్ష పడితేనే బాధితులకు కొంతైనా మనోధైర్యం కలుగుతుందన్న నమ్మకంతోనే, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత సత్యార్థి ఫౌండేషన్‌తో కలిసి అత్యాచారరహిత సమాజం కోసం ఆమె కృషి చేస్తోంది. గతంలో బాల్య వివాహాలపై పోరాటం చేసి చట్టాలనే మార్చిన ఆమె, ప్రస్తుతం రానున్న రోజుల్లో సమాజంలో ఎలాంటి మార్పు రావాలని కోరుకుంటున్నారో ఆమె మాటల్లోనే…..

తపన, కసి నన్ను పోరాటంవైపు నడిపించింది
మహిళల జీవితాల్లో వెలుగులు నింపాలన్న ధ్యేయంతో, వారు తమ కాళ్ల మీద నిలబడాలన్న తపనతో ‘తరుణి’ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించాను. ఎన్నో అనేక ఆటుపోట్లను ఎదుర్కొని బాల్య వివాహాలను అడ్డుకున్నాను. తండాల్లో ఆడపిల్లల అమ్మకాన్ని రూపుమాపడానికి ‘ఊయల’తో ముందుకొచ్చాను. ఆడపిల్లలకు ఎలాంటి సమస్యనైనా చెప్పుకునేందుకు ‘తరుణోపాయం అనే ఎస్‌ఎంఎస్ హెల్ప్‌లైన్’ స్థాపించాను. దేశ, విదేశాల్లో మహిళల సమస్యలపై అనేక సెమినార్లకు హాజరయ్యాను. మహిళల కోసం ఉన్న చట్టాలు, వాటిని ఎలా ఉపయోగించాలి, మనదగ్గర లేని చట్టాల గురించి తెలుసుకున్నాను. ఒక మహిళగా వారి కోసం ఏదైనా చేయాలన్న తపన, కసి నన్ను హక్కులను సాధించడానికి పోరాటం వైపు నడిపించింది. 11 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల ఆడపిల్లలను సరైన మార్గంలో పెడితే వారు జీవితంలో పైకి వస్తారు. అందులో భాగంగానే ‘తరుణి’ సంస్థను 2000 సంవత్సరంలో ప్రారంభించాను. 22 మండలాలు, 81 గ్రామాల్లో సంస్థ పనిచేస్తోంది.

అక్కడ ఆడపిల్ల అంటే వివక్ష ఎక్కువే
నేను పెరిగిన హైదరాబాద్ కల్చర్‌కు వరంగల్‌లో భిన్నంగా ఉండేది. అందులో భాగంగా హెల్త్ అవేర్‌నెస్ పట్ల ఆడపిల్లలను చైతన్యవంతం చేయడానికి అక్కడ అనేక రకాలుగా ప్రయత్నాలు చేశాను. వరల్డ్‌బ్యాంక్ ఎయిడెడ్ సంస్థ తరఫున స్లమ్ ఏరియాలో 5 సంవత్సరాల్లో పనిచేసినప్పుడు ఆడపిల్లల సమస్యలను కళ్లారా చూసి చలించిపోయాను. వరంగల్ జిల్లాలోని తండాల్లో పరిస్థితులు చాలా ఘోరంగా ఉండేవి. అక్కడ ఆడపిల్ల అంటే వివక్ష ఎక్కువ.

అందుకే వారిలో మార్పు తీసుకురావడానికి నా ప్రయత్నంగా 10 పాఠశాలలను ఎంచుకొని ఆరోగ్యం, పౌష్టికాహారం గురించి వారికి అవగాహన కల్పించాను. 1,000 మంది పిల్లలకు శిక్షణనిచ్చాను. 2 వేలకు పైగా బాల్య వివాహాలను అడ్డుకున్నాను. బాల్య వివాహాలను అడ్డుకున్నప్పుడు 6 నుంచి 8 సంవత్సరాల పిల్లలే ఎక్కువగా ఉండేవారు. 18 సంవత్సరాల బాలికలు చదువు మానేస్తే వారిని గుర్తించి పాఠశాలలో చేర్పించాను. 2006లో కొత్త చట్టం వచ్చింది అప్పుడే బాల్య వివాహాలకు సంబంధించి జాతీయ మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించాను. ఈ విషయాన్ని జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లాను. అప్పుడు చట్టాన్ని మార్చాలనే ప్రతిపాదన రావడంతో పార్లమెంటరీ కమిటీ వేశారు. అందులో తరుణి సంస్థను కూడా మెంబర్‌గా చేర్చారు. 2006లో కొత్త చట్టం వచ్చిన తరువాత ‘ఊయల’ అనే ప్రోగ్రాం ప్రారంభించాను. తండాల్లో ఇది విజయవంతం అయ్యింది. ఆడపిల్లలు వద్దనుకునే వారు చిన్నపిల్లలను తీసుకొచ్చి మేం ఏర్పాటు చేసిన ఊయల్లో వేసి వెళ్లేవారు. ఆస్పత్రుల్లో, బస్టాండుల్లో ‘ఊయల’లను ఏర్పాటు చేశాం.

ఒక తల్లిగా, మహిళగా సమాజంలో గుర్తింపు ఇవ్వడానికి…
చాలామంది ఆడపిల్లలు, స్పిన్నింగ్‌మిల్లులో, ఇటుక బట్టీల్లో పనిచేయడం చూసి బాధ కలిగేది. దీనిమీద ఒక ఫొటో ఫీచర్ తీసి మానవహక్కుల కమిషన్‌కు ఇచ్చాం. యూనిసెఫ్ లాంటి అంతర్జాతీయ సంస్థతో కలిసి బాల కార్మిక నిర్మూలన కోసం కృషి చేశాను. నిరుపేద ఆడపిల్లలను ఆదుకోవడానికి ‘తరుణి’ సంస్థ తరఫున కృషి చేస్తున్నాను. ఆడపిల్లలకు సరైన పద్ధతిలో శిక్షణ ఇచ్చి వారి కాళ్లమీద నిలబడేలా చేయాలని ఒక తల్లిగా, మహిళగా సమాజంలో వారికి గుర్తింపు నివ్వాలన్న ఆశయంతో ముందుకు వెళుతున్నాను.

పుట్టింది నల్లగొండ… పెరిగింది హైదరాబాద్
పుట్టింది నల్లగొండ. పెరిగింది హైదరాబాద్‌లో. నాన్న ఆచంట సద్గురు ప్రసాద్ జడ్జిగా రిటైర్ అయ్యారు. తరువాత మున్సిపల్ ఎన్నికల ట్రిబ్యునల్ మెంబర్‌గా పనిచేశారు. అమ్మ తరుణి మ్యాగజైన్ నడిపిస్తోంది. ఆమె రిటైర్డ్ జర్నలిజం ప్రొఫెసర్. భర్త రఘువీర్ ఐఎఫ్‌ఎస్ (1984)బ్యాచ్ అధికారి. ప్రస్తుతం అటవీ కార్పొరేషన్ ఎండిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పెళ్లి తరువాత న్యాయశాస్త్రం హ్యూమన్ రీసోర్స్ మేనేజ్‌మెంట్‌లో పిజి డిప్లొమా, ఎంబిఎ చేశాను. సివిల్స్ రాయాలని ఉన్నా పిల్లల కారణంగా ఆగిపోయింది. అందుకే తరుణి సంస్థను స్థాపించి బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, మహిళలపై లైంగిక వేధింపులు రూపు మాపడానికి కృషిచేస్తున్నాను. నీలా (నెట్‌వర్క్ ఆఫ్ ఇంటర్నేషనల్ లీగల్ యాక్టివిటీస్) ద్వారా ఎన్‌ఆర్‌ఐల చేతిలో మోసపోయిన మహిళలకు న్యాయం అందేలా చూస్తున్నాను. ఎన్‌ఆర్‌ఐల సహకారంతో ముందుకు వెళుతున్నాం. యూనిసెఫ్‌తో కలిసి బాలకార్మిక వ్యవస్థ మీద పోరాటం చేస్తున్నాం.

చట్టంలో మార్పులు రావాలి…
తాత వయస్సు గల వృద్ధుడు పసిపాపకు చాక్లెట్ ఆశ చూపి లైంగికదాడి చేశాడు. పాల ప్యాకెట్ వేసే కుర్రాడిపైన ఒక మధ్య వయస్కుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇలాంటి సంఘటనల గురించి వింటే వెన్నులోంచి వణుకుపుడుతోంది. ఇటువంటివి దేశంలో ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ వారి కుటుంబాలపై ప్రభావం చూపుతున్నాయి. వారు కోలుకోవడానికి సంవత్సరాలు పడుతుంది. కానీ నిందితులు చట్టాలలోని లొసుగులు ఆధారంగా చేసుకొని తప్పించుకుంటున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది. చట్టంలో మార్పులు రావాలసిన అవసరం ఉంది. లేకపోతే ఇలాంటి సంఘటనలు పెరిగే ప్రమాదం ఉంది. అందుకే అందరూ ముందుకురావాలి… బాధితులకు అండగా నిలవాలి… వారిని ఆదుకోవాలి…. అత్యాచార రహిత భారతదేశంలో మనం భాగస్వాములం కావాలి.

కమిటీలో మెంబర్‌గా కొనసాగుతున్నా..
బాలల హక్కుల కమిషన్‌లో మెంబర్‌గా, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్‌గా పనిచేశాను. అమెరికా కాన్సులేట్ ఇంటర్నేషనల్ విజిటింగ్ లీడర్ ప్రోగ్రాం కింద దక్షిణ భారతదేశం నుంచి ఎంపికయ్యాను. బెస్ట్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అవార్డు కూడా తీసుకున్నాను. ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళలపై జరిగే లైంగిక దాడులకు సంబంధించిన కమిటీలో మెంబర్‌గా కొనసాగుతున్నాను. తరుణి సంస్థ తరఫున భరోసా సెంటర్ టెక్నికల్ పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తున్నాం. అత్యాచార బాధితుల తరఫున మేము చేసిన పోరాటం కొన్నిసార్లు ఫలించినా, పూర్తి స్థాయిలో అది బాధితులకు భరోసా ఇవ్వడం లేదు. చట్టాలను మారిస్తేనే బాధితులకు న్యాయం జరుగుతుంది. అప్పటివరకు నా పయనం కొనసాగుతుంది.
– ఎల్.వెంకటేశం

In today’s society, children need to grow safely