Home తాజా వార్తలు ఫాస్ట్‌ఫుడ్‌కు చరమగీతం పాడండి

ఫాస్ట్‌ఫుడ్‌కు చరమగీతం పాడండి

Venkaiah Naiduఆరోగ్యవంతమైన దేశంతో వేగంగా ఆర్థికాభివృద్ధి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి
మంచి ఆరోగ్యం కోసం జీవనశైలిలో మార్పులు రావాలి
స్వర్ణభారత్ ఉచిత వైద్య శిబిరం ప్రారంభోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించే దిశగా దృష్టి సారించాలని, ప్రైవేటు సంస్థలు సైతం నాణ్యమైన వైద్య సేవలను అన్ని వర్గాలకు అందుబాటులోకి తీసుకురావాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. శంషాబాద్ మండలం ముచ్చింతల్ స్వర్ణభారత్ ట్రస్ట్‌లో ఉచిత వైద్య శిబిరాన్ని వెంకయ్యనాయుడు శనివారం ప్రారంభించారు. ఈ శిబిరంలో 500 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించి వారికి ఉచితంగా మందులు అందజేయడంతో పాటు, మధ్యాహ్న భోజన సౌకర్యాన్ని కూడా కల్పించారు. ఈ శిబిరంలో ఆరోగ్య పరీక్షలకు హాజరైన వారంతా ట్రస్ట్ అందించిన సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన దేశం శక్తివంతంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని, అదే సమయంలో శక్తి వంతమైన దేశం ఆరోగ్యవంతమైన దేశంగా మారుతుందని కచ్చితంగా చెప్పలేమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజారోగ్యం మీద మరింత దృష్టి కేంద్రీకరించాలని, నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవచ్చన్నారు. ఒత్తిడితో కూడిన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, చైతన్యరహితమైన పని విధానం తదితర అంశాలు అనారోగ్యానికి చేరువ చేస్తున్నాయని ఈ నేపథ్యంలో యోగ, నడక, వ్యాయామం ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరూ ఫాస్ట్ ఫుడ్ సంస్కృతి వైపు వెళుతున్నారు

అహారపు అలవాట్లు మారిపోయి, ప్రతి ఒక్కరూ ఫాస్ట్ ఫుడ్ సంస్కృతి వైపు వెళుతున్నారని, ఈ పరిస్థితికి చరమ గీతం పాడి భారతీయ ఆహారపు అలవాట్ల మీద దృష్టి కేంద్రీకరించాలని ఆయన హితవు పలికారు. స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గుండె, మూత్ర పిండాలు మరియు సాధారణ వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ముందుకు వచ్చిన కేర్ హాస్పిటల్స్‌కు, అదే విధంగా రొమ్ములకు మమో గ్రఫీ, గర్భాశయానికి స్కానింగ్, పాప్ స్మియర్, ఊపిరితిత్తులకు ఎక్స్ రే లాంటి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా నిర్వహించి, రిపోర్టులు అందజేసిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్‌కు ఉపరాష్ట్రపతి అభినందనలు తెలియజేశారు.

స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయాలనుకునే వారికి ఇది ఓ చక్కని వేదికని, ఆసక్తి ఉన్నవారు ఎవరైనా ఈ వేదికను వినియోగించుకోవచ్చన్నారు. కేర్ హాస్పిటల్స్ చైర్మన్ సోమరాజు దేశం గర్వించదగ్గ హృద్రోగ వైద్య నిపుణులని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. ఇప్పటికే స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తున్న ఆంధ్రాబ్యాంక్, ఇండియన్ బ్యాంక్, జీఎంఆర్ గ్రూప్, ఎల్ అండ్ టి, హీరో, గ్రాన్యూల్ ఇండియా, హర్ష టయోటా , మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ, సియంట్ ఆటో కంపెనీ తదితర సంస్థలను ఉపరాష్ట్రపతి అభినందించారు.

స్వాతంత్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నా పేదలకు వైద్యం అందడం లేదు

ఉచిత వైద్య ఆరోగ్య శిబిరానికి విచ్చేసిన అందరికీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. ఎన్ని పనులు ఉన్నా, ఎక్కడ ఉన్నా, స్వర్ణభారత్ ట్రస్ట్ కార్యక్రమాల్లో పాల్గొనడం తనకు ఎంతో సంతృప్తిని, ఆనందాన్ని అందిస్తాయని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. సమాజంలో ఎవరికీ ఆస్పత్రి అవసరం రాకూడదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం సమాజంలో ఎక్కడ చూసినా కాలుష్యం, నీరు, గాలి, నేల, ఆకాశం చివరకు ఆలోచనతో సహా అంతా కాలుష్యమవుతుందన్నారు. వైద్యం మరింత ఖరీదుగా మారిన ఈ రోజుల్లో ఎంతో మంది పేదలు ప్రాణాలు కోల్పోతు న్నారని, గ్రామాల్లోని పేదలకు ఉన్నత స్థాయి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడమే స్వర్ణభారత్ లక్షమన్నారు.స్వాతంత్య్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నా పేదలకు, గ్రామాలకు వైద్యం అందని దుస్థితి అన్నారు.

విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేయాలి

స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత కూడా కొన్ని గ్రామాలకు వైద్యం అందకపోవడం విచారకరమని వెంకయ్యనాయుడు తెలిపారు. విద్య, వైద్యం, వ్యవసాయం ఈ మూడు ప్రధాన రంగాలకు పార్లమెంట్, పొలిటికల్ పార్టీలు, పత్రికలు, ప్రభుత్వాలు పెద్ద పీట వేసి, ప్రాధాన్యత ఇవ్వాలని, కొత్త ఆలోచనలు పంచాలన్నారు. ఇక్కడ కేంద్రం, రాష్ట్రం అనే తేడా లేకుండా అందరికీ సమాన బాధ్యత ఉండాలన్నారు.

2001లో స్వర్ణభారత్ ట్రస్ట్ స్థాపించిన నాటి నుంచి ఇప్పటివరకు దాదాపు 250కి పైగా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించినట్టు ఆయన తెలిపారు. ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి పరీక్షలు చేయడం మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఆహారం విషయంలో పాటించాల్సిన జాగ్రత్తలు, ఎలాంటి వ్యాయామాలు చేయాలన్న వాటిపై కూడా అవగాహన కల్పిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో స్వర్ణభారత్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ కామినేని శ్రీనివాస్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ లింగనేని ప్రభాకర్, కేర్ హాస్పిటల్స్ చైర్మన్ శ్రీ బి.సోమరాజు, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి కోశాధికారి శ్రీ జె.ఎస్.ఆర్. ప్రసాద్, స్వర్ణభారత్ ట్రస్ట్ హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ శ్రీ సి.కృష్ణప్రసాద్, సెక్రటరీ శ్రీ బి.సుబ్బారెడ్డి, డైరెక్టర్ శ్రీ కె.రవి తదితరులు పాల్గొన్నారు.

Inaugurates Free Health Camp At Swarna Bharat Trust