Home రాష్ట్ర వార్తలు ముగ్గురు సిఎంల కోసం ముస్తాబు…

ముగ్గురు సిఎంల కోసం ముస్తాబు…

Kameswaram Project

 

21న జరిగే కాళేశ్వరం గంగావతరణానికి కళ్లు మిరుమిట్లు గొలిపే ఏర్పాట్లు

హైదరాబాద్: ముచ్చటగా ముగ్గురు ముఖ్యమంత్రుల చేతుల మీదుగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుంది. కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ వద్ద గేట్లు తెరిచి నీళ్లను దిగువకు వ దిలి ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభిస్తారు. ముగ్గురు ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశం ఉండడంతో మేడిగడ్డ వద్ద మూడు గేట్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. గేట్లు స్విచ్ ఆన్ చేసి తెరిస్తే నీరు దిగువకు, తూర్పు, ఈశాన్యం దిశగా ప్రవహిస్తుంది. ప్రాజెక్టుకు ప్రాణం లాంటి మేడిగడ్డ బ్యారేజీ వద్దనే తొలుత లాంఛనాలు పూర్తిచేసి, ఫైలాన్‌ను ఆవిష్కరిస్తారు.

అనంతరం కన్నెపల్లి పంపుహౌజ్ వద్ద పంపుల ఎత్తిపోతలను ప్రారంభించనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుతో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవీస్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లి సిఎం కెసిఆర్ స్వయంగా ఆయా రాష్ట్రాల సిఎంలను ఆహ్వానించారు. మూడు గేట్లను ముగ్గురు సిఎంల చేతుల మీదుగా ప్రారంభించేందుకు వీలుగా మేడిగడ్డ వద్ద గేట్లు సిద్ధం చేస్తున్నారు. దీనికి తోడు కన్నెపల్లి పంపుహౌజ్ వద్ద సైతం మూడు పంపులను ప్రారంభిస్తారని సమాచారం. ఇప్పటికే కన్నెపల్లి పంపుహౌజ్ వద్ద ఆరు పంపులు సిద్ధంగా ఉండగా, ఒక్కో సిఎం చేతుల మీదుగా ఒక్కో పంపును స్విచ్ ఆన్ చేసి, నీటి పంపింగ్ ప్రారంభిస్తారు.

ఇందుకు తగ్గట్లుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరిలో ప్రాణహిత నది కలిసిన తర్వాత నదికి జీవకళ వస్తుంది. అంతకు పైన ఉన్న నదిలో నీరు వచ్చే వరకు నమ్మకం లేని పరిస్థితిని గత కొన్నేళ్లుగా చూస్తున్నాం. ప్రాణహిత నీటితోనే ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేయాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కెసిఆర్ రీడిజైనింగ్, రీ ఇంజనీరింగ్ చేసిన సంగతి తెలిసిందే. బ్యారేజీలో 85 గేట్లను ఎనిమిది బ్లాకులుగా విభజించి, నిర్మించారు. మొదటి మూడు బ్లాకుల పరిధిలోని గేట్లను ఇప్పటికే అధికారులు కిందకు దించారు. దీంతో నీటి ప్రవాహం అక్కడే ఆగిపోయి, నీటి నిల్వ క్రమంగా పెరుగుతుంది. ఈ నీటినే ప్రారంభోత్సవం రోజు గేట్లు తెరిచి దిగువకు వదులుతారు. బ్యారేజికి ఎగువన పంపుహౌజ్‌లో కాఫర్ డ్యాం కట్టి, నీటిని ఫోర్ బే (సర్జ్‌పూల్)కు మళ్లించిన సంగతి తెలిసిందే. సర్జ్‌పూర్ నుంచి నీటిని పంపుహౌజ్ లోపలి భాగంలోకి వదిలి, లీకేజీలు ఏమైనా ఉన్నాయా అని పరీక్షిస్తున్నారు.

జూన్ 21వ తేదీన లాంఛనంగా కాళేశ్వరం ప్రారంభం జరుగుతున్న నేపధ్యంలో స్థానికంగా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంలో మునిగిపోయారు. ముగ్గురు ముఖ్యమంత్రులు వస్తుండడంతో స్థానిక పరిస్థితుల నేపధ్యంలో భద్రత అత్యంత ప్రాముఖ్యతను ఇస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ ప్రాంతం, కన్నెపల్లి పంపుహౌజ్ ప్రాంతం, మరో వైపు ఉన్న మహారాష్ట్ర అడవులన్నీ గతంలో మావోయిస్టులకు సేఫ్‌జోన్లుగా ఉండేవి. నెల రోజుల క్రితం కూడా మేడిగడ్డ బ్యారేజికి మహారాష్ట్ర వైపున ఉన్న ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు కనిపించాయి. తెలంగాణ వైపున కదలికలు లేనప్పటికీ ముందస్తు జాగ్రత్తగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లలో పోలీసు యంత్రాంగం నిమగ్నమైంది. దీనికి తోడు ముఖ్యమంత్రి కెసిఆర్ యాగంలో పాల్గొంటారు. దీంతో ఆ ప్రాంతంలో కనీసం మూడు, నాలుగు గంటల పాటు ఉండాల్సి వస్తుంది.

మేడిగడ్డలో పూర్ణాహుతి అయ్యాకే..

మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌజ్‌లలో హోమం నిర్వహించనున్నారు. తొలుత యాగం చేయాలని భావించినా, సమయాభావం వల్ల ఒక రోజు హోమం జరిపిస్తున్నారు. తొలుత మేడిగడ్డ వద్ద హోమంలో పూర్ణాహుతిలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం కన్నెపల్లికి వెళతారు.

గోదారమ్మకు ప్రత్యేక పూజలు

నది నీటిని పూర్తిస్థాయిలో వినియోగించే క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ వేళ గోదావరి నదికి సైతం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. హోమ క్రతువులు నిర్వహించే క్రమంలోనే గోదారమ్మకు పూజలు చేయనున్నారు. దీనికి వేదపండితులు స్థలాన్ని ఖరారు చేసుకున్నారు.

గ్రావిటీ కెనాల్ వద్ద సైతం పూజలు

కనెపల్లి వద్ద పంపులు ప్రారంభిస్తే ఆ నీరు కిలోమీటర్‌కు పైగా ఉన్న పైపుల ద్వారా ఎగువకు వచ్చి, గ్రావిటీ కెనాల్‌లో పడుతుంది. ఇక్కడ పడ్డ నీరు 13 కిలోమీటర్ల దూరం ప్రయాణించి, తిరిగి గోదావరిలోనే కలుస్తుంది. ఇక్కడ నదిపై అన్నారం వద్ద బ్యారేజీ నిర్మాణం పూర్తికావడంతో, నీటి నిల్వ పెరిగాక, సుందిళ్లకు పంపింగ్ చేసుకోవడానికి వీలు కలుగుతుంది. ఎత్తిపోసిన నీరు బయటకు వచ్చే గ్రావిటీ కెనాల్ సిస్టర్న్ వద్ద ప్రత్యేక పూజలకు వేద పండితులు ఏర్పాట్లు చేస్తున్నారు.

జలసంకల్ప యాగాలు ఏకకాలంలో మేడిగడ్డ, కన్నెపల్లి వద్ద జరుపుతూనే, గ్రావిటీ కెనాల్ వద్ద సైతం పూజలు చేస్తారని తెలిసింది. పంపింగ్ తర్వాత ఎగిసిన నీటితో కాళేశ్వరం దేవాలయంలో కాళేశ్వర, ముక్తేశ్వర స్వామికి జలాభిషేకం చేసే అవకాశం ఉందని తెలిసింది. కాళేశ్వరం లింక్ 1లో ముచ్చటగా మూడు బ్యారేజీలు, మూడు పంపు హౌజ్‌లు ఉన్నాయి. దీన్ని త్రివేణి సంగమం వద్దనే నిర్మించారు. గోదావరి, ప్రాణహితలకు తోడుగా అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహిస్తుందని ప్రతీతి.

Inauguration of Kameswaram Project