Friday, April 26, 2024

13 నుంచి ఐనవోలు జాతర

- Advertisement -
- Advertisement -

Inavolu Jatara starts from Jan 13

 

జాతరకు రూ.కోటి మంజూరు

శాశ్వతంగా మరుగుదొడ్ల నిర్మాణం
భక్తుల కోసం 25 ఆర్‌టిసి బస్సులు
కోవిడ్ నిబంధనలు పాటించాలి
అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలి
ఐనవోలు శ్రీమల్లికార్జున స్వామి జాతర సమీక్షలో మంత్రి ఎర్రబెల్లి

మనతెలంగాణ/వరంగల్ బ్యూరో: ఐనవోలు శ్రీ మల్లికార్జునస్వామి జాతర జనవరి 13, 14, 15 తేదీల్లో జరుగుతున్నందున ఇందుకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలను వెంటనే చేపట్టాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రతి ఏడు సంక్రాంతి సందర్భంగా ప్రారంభమయ్యే ఐనవోలు శ్రీ మల్లికార్జున మహాజాతరకు అన్ని ప్రాంతాల నుండి వేలాదిగా భక్తులు తరలివస్తారు. భక్తజనాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పరంగా కావాల్సిన ఏర్పాట్లు సౌకర్యాలు, జాతర నిర్వహణపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధ్యక్షతన సమీక్ష సమావేశం ఐనవోలులో జరిగింది. మంత్రి సమీక్షకు వస్తున్న సందర్భంగా స్థానిక ఎంఎల్‌ఎ ఆరూరి రమేష్, డిసిసిబి చైర్మన్ మార్నేని రవీందర్‌రావులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన పూజారులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి మల్లికార్జునస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం మంత్రి గుడి ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన అధికారుల సమీక్షలో జాతరకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంత్రి మీడియాకు వెల్లడించారు. 2021 జనవరి 13, 14, 15 తేదీల్లో ఐనవోలు శ్రీమల్లికార్జునస్వామి జాతర జరుగుతుందన్నారు. మూడు రోజుల పాటు జరిగే జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం, అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జాతరకు వేలాది మంది భక్తులు వస్తున్నందున మరుగుదొడ్ల సౌకర్యం కొరవడిందని జాతరకు ముందే శాశ్వతంగా మరుగుదొడ్లు నిర్మించడానికి రూ.కోటి మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఈ పనులన్ని జాతరకు ముందే పూర్తి కావాలన్నారు. మంచినీటి సౌకర్యం, స్నానాల గదులు, దుస్తులు మార్చుకునే గదులు, మహిళలకు ప్రత్యేక వసతులు, క్యూలైన్లు, విద్యుత్, సిసి కెమెరాలు, భక్తులకు అన్నదానం వంటి అనేక వసతుల కల్పనకు అధికారులకు దిశ నిర్దేశం చేసినట్లు చెప్పారు.

కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, వరంగల్ నగర మేయర్ గుండా ప్రకాష్‌రావుల నేతృత్వంలో కోవిడ్ నిబంధనలను అనుసరించి సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారి, నిరంతర శానిటేషన్‌ను చేపట్టడానికి ముందుకొచ్చినందుకు వారిని అభినందించారు. కోవిడ్ నేపథ్యంలో తప్పనిసరిగా కరోనా నిబంధనలను పాటించాలని మాస్క్‌లు ఉంటేనే దర్శనానికి అనుమతించాలని అధికారులను ఆదేశించారు. వైద్య శాఖతో పాటు ఆరూరి గట్టుమల్లు ట్రస్ట్ నుండి మాస్క్‌ల పంపిణీ చేయాలని సూచించారు. విఐపిలకు, దాతలకు ప్రత్యేక పాస్‌లు జారీ చేసి నిర్ణీత సమాయాల్లో నేరుగా దర్శనాలు చేయించాలన్నారు. భక్తులకు దర్శనార్ధం చేసే ఏర్పాట్లలో కరోనా నిబంధనలు పాటించాలన్నారు. క్యూలైన్‌లో ఉండే భక్తులు కిక్కిరిసి పోకుండా సామాజిక, భౌతిక దూరం పాటించేలా చూడాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు.

ఇతర ప్రాంతాల నుండి ఐనవోలు జాతరకు వస్తున్న ప్రయాణికుల కోసం వరంగల్ ఆర్టీసి నుండి 25 బస్సులను నిరంతరం నడపాలని ఆదేశించడం జరిగిందన్నారు. రోడ్ల మరమ్మత్తులను వెంటనే పూర్తి చేయాలన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్‌తో సహా అందుబాటులో ఉండాలన్నారు. జాతరకొచ్చే భక్తులకు 24 గంటల పాటు వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలని వైద్య శాఖాదికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, మేయర్ గుండా ప్రకాష్‌రావు, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News