Home ఎడిటోరియల్ జలప్రళయం

జలప్రళయం

Incessant rains in Telangana

 

వద్దు మొర్రో అంటున్నా విడవకుండా కురుస్తున్న వర్షాలు మంగళవారం రాత్రి గరిష్ఠ స్థాయికి మించి రెచ్చిపోయి జల ప్రళయాన్ని సృష్టించాయి. రెండు తెలుగు రాష్ట్రాలనూ అతలాకుతలం చేశాయి. ఇంకా వర్షాలున్నాయని వాతావరణ వార్తలు చెబుతుంటే గుండెల్లో సునామీలు చెలరేగుతున్నాయి. గోడలు, ఇల్లు వంటివి కూలిపోయి పలువురు చనిపోయారు. ఎక్కడెక్కడి వర్షపు నీరు చేరి రోడ్లు, వీధులు మహా నదులను తలపించడం, అడ్డంగా ఉన్న కార్లను ఇతర వస్తు సామగ్రిని మెడలో హారాలుగా చేసుకొని వరద గంటల తరబడి బీభత్స నాట్యం సాగించడం, అపార్టుమెంట్ల సెల్లార్లు నిండిపోయి వీధుల్లోకి నీరు ఎగతన్నడం, వృక్షాలు కూలిపోడం రాతి గోడలు విరిగిపడి అనేక మంది ప్రాణాలు గాలిలో కలిసిపోడం వంటి విషాద ఘట్టాలు గుండెలవిసిపోయేలా చేశాయి. హైదరాబాద్ మహానగరంలోనైతే కొద్ది గంటల వ్యవధిలోనే 30 సెం.మీ వర్షం కురిసింది. చెరువులకు గండ్లు పడి వందలాది కాలనీలు జలదిగ్బంధానికి గురయ్యాయి. జిల్లాల్లోనూ ఏరు ఊరు ఏకమైపోయాయి. పంటలు మునిగిపోయాయి. నీరు పూర్తిగా తీయడానికి కొద్ది రోజులు పడుతుంది.

ఆ తర్వాత గాని నష్టాల లెక్క తేలదు. ప్రభుత్వాలు పరిహారాలు చెల్లించినా పేద, మధ్య తరగతి ప్రజలకు, వ్యవసాయదార్లకు ఈ జల విలయం కలిగించిన నష్టం తొందరగా తొలగదు. జనావాసాల్లోనే కాదు రహదారుల మీద కూడా నీరు కొన్ని అడుగుల ఎత్తున ప్రవహించిందంటే ఎంత భారీ వర్షం పడిందో ఊహించవచ్చు. హైదరాబాద్ విజయవాడ, హైదరాబాద్ బెంగళూరు హైవేలను మూసివేయవలసి వచ్చింది. అక్టోబర్ మాసంలో ఇంత పెద్దగా వాన కురియడం అత్యంత అరుదంటున్నారు. గత వందేళ్లలో ఇది రెండో అత్యధిక వర్షపాతమని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా నగరాల్లో ఇటువంటి వర్ష బీభత్సానికి రెండు ప్రధానమైన కారణాలను ప్రస్తావిస్తుంటారు. మొదటిది అతి పురాతనమైన మురుగు నీటి పారుదల (డ్రైనేజీ) వ్యవస్థ, ప్రస్తుత అవసరాలకనుగుణంగా దానిని ఆధునికం చేసుకోలేకపోడం అయితే రెండోది వర్షపు నీరు పారే, నిల్వ ఉండే చోట్లు కాల్వలు, చెరువులు ఆక్రమణలకు గురి కావడం. కిక్కిరిసిన ఇళ్లు, భవనాలతో నగరాలు అడ్డదిడ్డంగా, దట్టంగా, విస్తారంగా పెరిగిపోయిన తర్వాత ఈ రెండింటినీ సరిచేయడం సులభ సాధ్యం కాదు.

ఉన్న చోట ఉపాధి అవకాశాలు కొరవడి గ్రామాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి అసంఖ్యాకంగా జనం వలసలు వచ్చి నగరాల్లోని ఖాళీ ప్రదేశాల్లో నివాసాలు ఏర్పరచుకోడం వల్ల, కొద్ది మంది అవసరాలకే ఉద్దేశించిన పౌర వ్యవస్థల మీద అవధులు మీరి అపారమైన భారం పడుతున్నందున మురికి వాడలు పెరిగిపోయి సహజంగానే కొద్ది పాటి వర్షానికే వరదలు వెల్లువెత్తే దుస్థితి నెలకొంటున్నది. మొన్న జులై నెలలో కురిసిన వానలను హైదరాబాద్‌లోని మిగతా ప్రాంతమంతా అంతోఇంతో తట్టుకోగలిగినా ఉస్మానియా ఆసుపత్రిలోకి భారీ ఎత్తున నీరు చేరిపోయి రోగులకు చెప్పరాని అసౌకర్యం కలిగింది. మహా హైదరాబాద్ నగర కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) తీసుకున్న చర్యల కారణంగా ఇతర చోట్ల వర్షపు నీరు నెమ్మదిగానైనా తొలగిపోయినా ఉస్మానియా ఆసుపత్రి ప్రాంతంలో కుండపోత వల్ల పోగైన జలాలు వెంటవెంటనే బయటికి వెళ్లలేకపోయాయి. ఆసుపత్రి సమీపంలోని అఫ్ఘల్‌గంజ్, బేగం బజార్, ఫీల్‌ఖానా ప్రాంతాల్లో 100, 120 చదరపు గజాల అతి స్వల్ప విస్తీర్ణం గల స్థలాల్లోనే ఐదారంతస్థుల భవనాలతో అక్రమ నిర్మాణాలు దట్టంగా లేచిపోడంతో ఆ ప్రాంతాల్లో కురిసిన వాన నీరంతా దవాఖానాలోకి దూసుకొచ్చిందని నిగ్గు తేల్చారు.

హైదరాబాద్ నగర మురుగు నీటి పారుదల వ్యవస్థ పురాతనమైనది. నిజాం పాలనలో 20 అడుగుల లోతున నిర్మితమైంది. ఇప్పటి ఒత్తిడిని తట్టుకునే స్థితిని అది ఎప్పుడో కోల్పోయింది. దాని బ్లూ ప్రింట్ (పటం) అందుబాటులో లేదని కూడా అంటున్నారు. అందుచేత మరమ్మతులు చేయడం సాధ్యమయ్యే పని కాదని చెబుతున్నారు. గతంలో వర్షాకాలాల్లో పడిన వానలకు ఇప్పుడు కురుస్తున్న వాటికి ఉన్న తేడా కూడా జల ప్రళయాలకు దారి తీస్తున్నదని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. గతంలో వంద మి.మీ వర్షం 24 గంటల వ్యవధిలో కురిసేదని ఇప్పుడు అంత భారీ వాన గంట వ్యవధిలోనే పడుతున్నదని వరదలు ముంచెత్తడానికి ఇది కూడా ఒక కారణమని చెబుతున్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే కాదు చెన్నై, ముంబై వంటి నగరాలన్నింటా అక్రమ నిర్మాణాల సమస్య జటిలంగా ఉంది. ఈ సమస్యను సమూలంగా పరిష్కరించుకోగలిగినప్పుడే వర్షాలు తరచుగా వరదలై బతుకులను నరకప్రాయం చేయడం తగ్గుతుంది. ఆలోగా ఇటువంటి విపత్తుల తీవ్రతను ముందుగా తెలుసుకొని ప్రజలను హెచ్చరించడం, లోతట్టు ప్రాంతాల నుంచి వారిని ఖాళీ చేయించి సురక్షిత స్థలాలకు చేర్చడం వంటి జాగ్రత్తలు తీసుకోవలసి ఉంది.