Home మెదక్ పెరిగిన రాయితీ… భారీగా దరఖాస్తులు

పెరిగిన రాయితీ… భారీగా దరఖాస్తులు

స్వయం ఉపాధి పథకాల కోసం యువత పరుగులు

MANDALపెద్దశంకరంపేట : జిల్లాలోనే మారుమూల ప్రాంతమైన నారాయణఖేడ్‌కు ఈ సారి ఉప ఎన్నికల పుణ్యమా అని మంచి రోజులే వచ్చాయి. ఓ వైపు వివిధ అభి వృద్ధి పథకాలకు మంత్రులు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ ఉంటే మరో వైపు నిరుద్యోగ అభ్యర్థులకు మేలు కలిగేలా ప్రభుత్వం స్వయం ఉపాధి హామీ పథకాలను కూడా ప్రకటించింది. బిసి కార్పొరేషన్, ఎస్సీ,ఎస్టీ కార్పొరేషన్ ల పరిధిలో నిరుద్యోగ యువతకు రుణాలిచ్చి వారిని స్వయం ఉపాధి బాట వైపు పయనింపజేయడం ఈ పథక ఉద్దేశ్యం. ఎదురు చూసినా ఉద్యోగం రాకపోవడం తో ఎలాగైనా తమ కాళ్లతో తాము నిలబడాలని, కొందరు, జీవనోపాధి కోసం మరి కొందరు.. ఉన్నత చదువులు చదివినా… ఆశించిన ఉద్యోగం అందని ఇంకొందరు.. ఇలాంటి వారు స్వయం ఉపాధి కోసం బాటలు పడుతున్నారు. గత సంవత్సరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నూతన ప్రభుత్వం అధి కారంలోకి రాగానే స్వయం ఉపాధి పథకాలపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి రాయితీ పెంచితేనే నిరుద్యోగులకు ఉపయోగపడుతుందని నిర్ణయించారు. ఈ నేపథ్యం లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాయితీ మొత్తాన్ని పెంచుతూ ప్రభుత్వం ఉత్త ర్వులు వెలువరించింది. తాజాగా 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన యూనిట్లను గ్రౌండింగ్ చేసే ప్రక్రియ మొదలైంది. ఇదిలా ఉంటే నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల నేపథ్యంలో యూనిట్లు కూడా గణనీయంగా మంజూరు చేశారు. నియోజకవర్గం పరిధిలోని మొత్తం 5 మండ లాలకు కలిపి 654 యూనిట్లు మంజూరు చేశారు. గతంలో ఏనాడు కూడా ఇంత భారీ సంఖ్యలో యూనిట్లు మంజూరు కాలేదు. గత ఆర్థిక సంవత్సరంలో రాయతీ రుణ గరిష్ఠ పరిమితి రూ. లక్ష మాత్రమే కాగా..ప్రస్తుతం దాన్ని రూ. 5 లక్షల వరకు పెంచారు. ఇందులో రూ. లక్ష విలువ యూనిట్‌కు 80 శాతం రాయితీ ఉంటుంది. మిగిలిన 20 శాతం బ్యాంకు రుణం పొందాల్సి ఉంటుంది. రూ. 1.01 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకు ఉన్న యూనిట్లకు 70 శాతం, రూ 2.01 లక్షల నుంచి రూ. 10 లక్షల విలువైన యూనిట్లకు 60 శాతం లేదా రూ. 5 లక్షలకు మించకుండా రాయితీ ఇస్తారు. ఇంత భారీగా పెంచి నప్పటికీ లక్ష్యా లకు అనుగుణంగా గ్రౌండింగ్ ప్రక్రియ పూర్తి అయితేనే నిరుద్యోగ యువతకు ప్రయోజనం ఉంటుంది. మరో వైపు ఈ ప్రక్రియలో బ్యాంకర్లదే కీలక పాత్రగా చెప్పుకోవచ్చు.
నారాయణఖేడ్ నియోజకవర్గంలో నారాయణఖేడ్, పెద్దశంకరంపేట, మనూర్, కంగ్టి, కల్హేర్ మండలాలున్నాయి. మండలాల వారీగా మంజూరైన యూనిట్లను చూసుకుంటే నారాయణఖేడ్ కు 152, పెద్దశంకరంపేటకు 97, మనూర్ కు 161, కంగ్టికి 144, కల్హేర్‌కు 108 యూనిట్లు మంజూరు చేశారు. నిరుద్యోగ యువత సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఈ కేటాయింపులు చేశారని ఒక అధికారి తెలిపారు. దీనికి తగినట్లుగానే అభ్యర్థులు కూడా తమ తమ దరఖాస్తులను సమర్పించారు. తాజాగా రాయితీ మొత్తం భారీగా పెంచడంతో పాటు యూనిట్లు కూడా ఎక్కువ మంజూరు కావడం తో నిరుద్యోగులు పోటీ పడి తమ తమ దరఖాస్తులను సమర్పించుకున్నారు. మొత్తం 654 యూనిట్లకు గాను 3,236 మంది నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకోవడం గమనార్హం. నారాయణఖేడ్ మండలంలో 152 యూనిట్లకు గాను 627, పెద్దశంకరంపేట మండలంలో 97 యూనిట్లకు గాను 629 మంది, మనూర్ లో 161కి గాను 629 మంది, కంగ్టి లో 144 యూనిట్లకు గాను 1,010 మంది, కల్హేర్ మండలంలో 108 యూనిట్లకు గాను 589 మంది నిరుద్యోగ అభ్యర్థులు తమ తమ దరఖాస్తులను సమర్పించారు. మండల పరిషత్ కార్యాలయాల్లో వీరికి ఇంటర్యూలను నిర్వహిస్తున్నారు. ఎంపిడిఓ, ఈఓపిఆర్‌డి, పంచాయతీ కార్యదర్శులు, బ్యాంకు అధికారుల సమక్షంలో ఇంటర్యూలను చేపట్టారు. ఇప్పటికే ఎంపిడిఓ అధ్వర్యంలో కమిటీ అభ్యర్థుల ఎంపికకు తీవ్ర కసరత్తు చేసింది. ప్రస్తుతం గ్రౌండింగ్ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. వీరికి తొందరలోనే ఉపాధి కోసం రుణాలు అందనున్నాయి. అయితే అసలైన నిరుపేదలకే ఈ రుణాలు అందిస్తే వారు మరింత పురోగతి చెం దుతున్నారని పలువురు మేధావులు చెబుతున్నారు. పైరవీలకు తావు లేకుండా, అప్పటికే వివిధ వృత్తులలో స్థిరపడిన వారికి కాకుండా కొత్తవారిని ప్రొత్సహిస్తేనే ఈ పథకం లక్ష్యం నెరవేరినట్లవుతుందని వారు చెబుతున్నారు.