Home తాజా వార్తలు మండుతున్న నిప్పుల కొలిమి

మండుతున్న నిప్పుల కొలిమి

sunny intensityమహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నిప్పుల కొలిమిలా మండుతోంది. భానుడి భగభగకు మనిషి, పక్షి, జంతుజలాలన్ని కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఉదయం 10 గంటల నుండే వడగాల్పులు వీస్తున్నాయి. గత వారం రోజులుగా జిల్లాలో విపరీతంగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ప్రజలు ఎండలకు భయపడుతున్నారు. ఉదయం 10 గంటలకు బయట తిరగాలంటే కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ మాసంలోనే ఇలా ఉంటే వచ్చే నెల ఇంకా ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. సూర్యతాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇళ్లకే పరిమితమవుతున్నారు. వీధులన్నీ కూడా నిర్మానుష్యమవుతున్నాయి. గత వారం రోజుల నుంచి 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతోంది.

భగభగ మండే నిప్పుల కొలిమిని తలపిస్తుండడంతో జిల్లా ప్రజలు మండుతున్న ఎండలకు బయటికి రాలేకపోతున్నారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉష్ణోగ్రతలు తగ్గకుండా ఒకే రీతిలో ఉండడంతో వృద్ధులు, చిన్న పిల్లలు వడగాల్పులకు గురయ్యే అవకాశాలున్నాయి. ఉమ్మడి జిల్లాలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొండలు, గుట్టలు ఉన్న ప్రాంతంలో మరిన్ని ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది.

ఈ వేసవి కాలం మరో 45 రోజుల పాటు ఉండడంతో ఎండల తీవ్రత కూడా గత ఏడాది కంటే పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సైతం సూచిస్తున్నారు. మధ్యాహ్న సమయంలో బయటికి రాకపోవడమే ఉత్తమమని ప్రజలకు సూచనలు చేస్తున్నారు. వడగాల్పులకు గురి కాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. ముఖ్యంగా శీతలపానీయాలు ఎక్కువగా తీసుకోవాలని వారు పేర్కొంటున్నారు.

మజ్జిగ, నిమ్మరసం, చెరుకురసం, కొబ్బరినీళ్లు, మంచినీళ్లు ఎక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు. మంచినీళ్లు ప్రతి ఒక్కరు రోజుకు ఐదు లీటర్ల కంటే ఎక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు. బయటికి వెళ్లే సమయంలో వృద్ధులు, పిల్లలు తప్పకుండా గొడుగులు వాడాలని చెబుతున్నారు. వడదెబ్బకు గురి కాకుండా ఇళ్లల్లో వాకిళ్లకు, కిటికీలకు చల్లగాలి వచ్చేలా తడిపిన కర్టన్లు వాడాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు వేసవి కాలంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

వడదెబ్బకు గురయినట్లు భావించిన వెంటనే ఆసుపత్రికి వెళ్లే వెంటనే చికిత్సలు తీసుకోవాలని కోరుతున్నారు. భానుడి భగభగకు విద్యార్థులు సైతం భయపడుతున్నారు. పరీక్షలు ముగిసి వేసవి సెలవుల్లో ఎంజాయ్ చేద్దామనుకున్న పెరుగుతున్న ఎండలతో ఎక్కడికి వెళ్లలేకపోతున్నారు. సూర్య ప్రతాపానికి కూలీలు సైతం బయటికి వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి.

Increased Sunny Intensity in Telangana