Home తాజా వార్తలు 6% నుంచి 3.8 శాతానికి తగ్గిన పాజిటివ్ రేటు

6% నుంచి 3.8 శాతానికి తగ్గిన పాజిటివ్ రేటు

Increased testing capacity says Dr G Srinivas Rao

 

కరోనాపై ఫలిస్తున్న ప్రభుత్వ సూచనలు
మిగతా రాష్ట్రాల కంటే కేసులు అల్పం
సెకండ్ వేవ్ రాకపోవచ్చు, వచ్చినా సర్వసన్నద్ధత
అయినా నిర్లక్షం వద్దు : హెల్త్‌డైరెక్టర్, డిఎంఇ

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఎనిమిది నెలల తర్వాత పాజిటివ్ రేట్ తగ్గిందని హెల్త్ డైరెక్టర్ డా.జి శ్రీనివాసరావు వెల్లడించారు. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ శాతం 6 శాతం ఉండగా నవంబరు నెల లో కేవలం 3.8 శాతం చొప్పన కేసులు నమోదవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం, వైద్యశాఖ సూచించిన నిబంధనలను, మార్గదర్శకాలను తు.చ తప్పకుండా పాటించడం వలనే వైరస్ తీవ్రత తగ్గిందని ఆయన వ్యాఖ్యానించారు. దేశ వ్యాప్తంగా మిగతా రాష్ట్రాల కంటే కూడా తెలంగాణలో కేసులు సంఖ్య అతి తక్కువగా ఉందని ఆయన చెప్పారు. అయితే ఈ ఆర్‌ఎన్‌ఏ వైరస్‌ను ఎట్టి పరిస్థితుల్లో లైట్ తీసుకోవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

కోవిడ్ ముప్పు ప్రస్తుతానికి ఇంకా తొలగిపోలేదని, కావున ప్రతి ఒక్కరూ వైరస్ నియంత్రణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. కరోనా వైరస్ అంశంపై ఆయన కోఠి ఆరోగ్యశాఖ కార్యాయలంలో డిఎంఇ డా రమేశ్‌రెడ్డితో కలసి ఆయన శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకులు డా శ్రీనివాసరావు మాట్లాడుతూ…రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 50 లక్షలకు పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామన్నారు. గత నాలుగు నెలలుగా విస్తృతంగా టెస్టులు చేయడం వలనే వైరస్ అదుపులో ఉందని ఆయన పేర్కొన్నారు. జిహెచ్‌ఎంసి పరిధిలో కూడా భారీ స్థాయిలో టెస్టులు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.

సెకండ్‌వేవ్ వచ్చినా ఎదుర్కొంటాం
ఇతర దేశాలు, మన దేశంలోని ఢిల్లీ, కేరళ లాంటి రాష్ట్రాల్లో ఇప్పటికే సెకండ్ వేవ్ వచ్చి హాస్పిటల్స్‌లో బెడ్స్ దొరకని పరిస్థితి ఉందని హెల్త్ డైరెక్టర్ గుర్తు చేశారు. కానీ మన దగ్గర ఆ పరిస్థితి వచ్చే అవకాశం చాలా తక్కువని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవేళ వచ్చినా ఎదుర్కొనేందుకు వైద్యశాఖ సిద్ధంగా ఉందని డిహెచ్ ధీమాను వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్య విషయంలో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాదని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పటికే సెకండ్ వేవ్‌పై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని డిహెచ్ చెప్పారు. దీనిలో భాగంగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఆశావర్కర్లు, అంగన్‌వాడీలు, ఇతర మెడికల్ సిబ్బందిలకు అవగాహన తరగతులను నిర్వహించబోతున్నామని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తం గా నిపుణుల అంచనా మేరకు మరో 2, 3నెలల్లో వ్యాక్సి న్ వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కావున అప్పటి వరకు హైరిస్క్ గ్రూప్(గర్బిణీ స్త్రీలు, చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులు) తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.

ప్రచారంలో అందరూ మాస్కులు వేసుకోవాలి
జిహెచ్‌ఎంసి ఎన్నికల ప్రచారం, ఓటింగ్‌లో పాల్గొనే ప్రతి ఒక్కరూ మాస్కులు వేసుకోవాలని హెల్త్ డైరెక్టర్ స్పష్టం చేశారు. వైరస్ వ్యాప్తి చెందకుండా మాస్కే మన్నల్ని కాపాడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఈక్రమంలో రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తప్పని సరిగా మాస్క్ పెట్టుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అవసరమైతే ఆయా పార్టీల లీడర్లే కార్యకర్తలకు మాస్కులను పంపిణీ చేయాలని డిహెచ్ కోరారు. అంతేగాక ర్యాలీలు, బహిరంగ సమావేశాలు పాల్గొనే వారు మాస్కు ధరించడమే కాకుండా వీలైనంత వరకు భౌతిక దూరాన్ని పాటించాలని ఆయన కోరారు.

టెస్టింగ్ సామర్ధాన్ని పెంచాం
రాష్ట్రంలో టెస్టింగ్ కెపాసిటీ కూడా పెరిగిందని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు డా జి శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సగటున 40 వేలకు పైగా పరీక్షలను నిర్వహిస్తున్నామని, రాబో యే రోజుల్లో వీటి సంఖ్యను రెట్టింపు చేయబోతున్నట్లు ఆయన వెల్లడించారు. అంతేగాక శీతాకాలంలో శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు ఎక్కువ అ యే అవకాశం ఉంది కావున వాటిని ఎదుర్కొనేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఇప్పటికే ప్రతి రోజూ 64 వేల పరీక్షలు చేసేలా ఏర్పాట్లు చేయమని మంత్రి కూడా ఆదేశించినట్లు పేర్కొన్నారు.

ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి టీచింగ్ ఆసుపత్రి వరకు అన్ని మందులను అందుబాటులో ఉంచామని డిహెచ్ తెలిపారు. అయితే ప్రభుత్వ టెస్టింగ్ కేంద్రాల్లో ఉచితంగా పరీక్షలను నిర్వహిస్తున్నామని అనవసరంగా ప్రైవేట్‌కు వెళ్లి డబ్బులు ఖర్చుపెట్టోద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు ప్రైవేట్ ల్యాబ్‌లలో కూడా ఆర్‌టిపిసిఆర్ టెస్టుల ధరలను తగ్గించామని, ప్రజలంతా సవరించిన ధరలు రూ.850, 1200లను మాత్రమే చెల్లించాలని ఆయన కోరారు. ఒకవేళ ఎవరైన అధిక ధరలు తీసుకుంటే 104కు ఫిర్యాదు చేయాలన్నారు. అంతేగాక ప్రైవేట్ ఆసుపత్రుల ధరల నియంత్రణపై టాస్క్‌ఫోర్స్ కమిటీని కూడా వేశామని డిహెచ్ గుర్తు చేశారు.

వైరస్ అదుపులో ఉంది : డిఎంఇ
తెలంగాణలో ప్రభుత్వం, వైద్యశాఖ సమన్వయంతో తీసుకున్న చర్యలతో కేసుల సంఖ్యతో పాటు మరణాలు కూడా తగ్గాయని డిఎంఇ డా రమేష్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం సూచించిన ప్రజలు పాటించడం వలనే ఇది సాధ్యమైనట్లు ఆయన వెల్లడించారు. ప్రజలందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. అయితే శీతాకాలంలో పాటు సెకండ్ వచ్చినా ఎదుర్కొనేందుకు అన్ని ఆసుపత్రుల్లో మందులు, మౌళిక వసతులను ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యంగా ఆక్సిజన్, వెంటిలేటర్, హైప్లో, సి. కాప్ వంటి పరికరాలను కూడా జిల్లా స్థాయిలో అందుబాటులో ఉంచినట్లు ఆయన వెల్లడించారు.

గాంధీలో నాన్ కోవిడ్ సేవలు ప్రారంభించాం
దాదాపు ఎనిమిది నెలలు తర్వాత గాంధీ ఆసుపత్రిలో శనివారం నుంచి నాన్‌కోవిడ్ సేవలను ప్రారంభించామని డిఎంఇ తెలిపారు. కోవిడ్, నాన్‌కోవిడ్ పేషెంట్లకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. అయితే అన్ని ఆసుపత్రుల్లో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం క్వారంటైన్ సెలవులు తీసివేయడం జరిగిందని, కావాలని ఆందోళన చేస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Increased testing capacity says Dr G Srinivas Rao