Friday, April 19, 2024

రాష్ట్రంలో పెరిగిన యూరియా వాడకం

- Advertisement -
- Advertisement -

Urea

వరిసాగు గణనీయంగా పెరగడంతోనే..
వచ్చే నెలలో 1.20 లక్షల మెట్రిక్ టన్నులు అవసరమని అంచనా

హైదరాబాద్: రాష్ట్రంలో రబీ వరి సాగు గణనీయంగా పెరగడంతో యూరియా వినియోగం పెరిగింది. దీంతో గత ఖరీఫ్‌లో తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా, రబీలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ముందస్తు ఏర్పాట్లు చేశామని మార్క్‌ఫెడ్ అధికారులు తెలిపారు. దీంతో వచ్చే నెలకు 1.20 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని మార్క్‌ఫెడ్ అంచనా వేసింది. ఆ మేరకు కేంద్రంను సంప్రదించి అవసరమైన యూరియా తెప్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఈ రబీకి అన్ని రకాల ఎరువులు కలిపి 15.40 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించింది. అందులో ఒక్క యూరియానే 7.50 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించింది.

అందులో శుక్రవారం నాటికి తెలంగాణకు 12.26 లక్షల ఎరువులు సరఫరా కాగా, అందులో యూరియా 7.05 లక్షల మెట్రిక్ టన్నులను కేంద్రం సరఫరా చేసింది. అయితే గత ఖరీఫ్‌లో మిగిలిన స్టాక్‌తో కలిపి యూరియా ప్రస్తుతం 1.33 లక్షల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందని మార్క్‌ఫెడ్ వర్గాలు వెల్లడించాయి. కాబట్టి వచ్చే నెలకు 1.20 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమైనందున ఎలాంటి కొరత ఉండదని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ వినియోగం ఇంకొంత పెరిగినా ప్రస్తుత స్టాకు సరిపోతుందని అంటున్నారు. దీంతోపాటు ఎన్‌పికె 1.93 లక్షల మెట్రిక్ టన్నులు కూడా అందుబాటులో ఉంచారు. డిఎపి 46 వేల మెట్రిక్ టన్నులుంది.

ఎంఒపి 22 వేల మెట్రిక్ టన్నులు, ఇతరత్రా ఎరువులు 7 వేల టన్నులు అందుబాటులో ఉంచారు. రబీలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 16.87 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు ఏకంగా 29.98 లక్షల ఎకరాలు సాగైనట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. దీంతో యూరియా సహా ఇతరత్రా ఎరువుల వినియోగం గణనీయంగా పెరిగింది. వచ్చే నెల రెండో వారం వరకు యూరియా వినియోగం అధికంగా ఉంటుందని, తమ దగ్గరున్న స్టాక్ సంపూర్ణంగా సరిపోతుందని మార్క్‌ఫెడ్ అధికారులు చెబుతున్నారు.

వచ్చే 15 రోజులు అత్యంత కీలకమని, దీంతో ఎప్పటికప్పుడు జిల్లా అధికారులతో మాట్లాడుతూ పర్యవేక్షణ చేస్తున్నారు. రబీకి మొదట కేంద్ర ప్రభుత్వం 14.90 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులనే కేటాయించింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ విన్నపం మేరకు దాన్ని 15.40 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచింది. అంటే అదనంగా 50 వేల మెట్రిక్ టన్నులకు పెంచినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి.

Increased Urea Usage in Telangana State

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News