Home జిల్లాలు పది ఫలితాలు మెరుగు పడేనా?

పది ఫలితాలు మెరుగు పడేనా?

ప్రత్యేక శిక్షణపైనే ఆశలు

ఈసారైనా పెరిగేనా?

మంచి ఫలితాలు సాధిస్తాం : ఎస్టీయు

examsరంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పదో తరగతిలో ఫలితాలను మెరుగుపరుచుకుని జిల్లా పరువు నిలబెట్టడానికి జిల్లా విద్యాశాఖ నానా తంటాలు పడుతోంది. గత సంవత్సరం ఎదురైన చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడైనా పరువు నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. పదో తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 40 రోజుల ప్రణాళికను తయారు చేసుకుని అమలు చేస్తున్న యంత్రాంగం విద్యార్థులను పరీక్షల కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 9 వరకు నిర్వహించు పరీక్షల్లో రాష్ట్రంలోనే ప్రథమ స్థానం సంపాదించాలన్న లక్షంతో ముందుకు సాగుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం పదో తరగతి పరీక్షలకు 1,01,615 మంది విద్యార్థులు హాజరవుతుండగా,అందులో 92,085 మంది విద్యార్థులు రెగ్యులర్‌కాగా, 9,530 మంది ప్రయివేట్ విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 436 పరీక్ష కేంద్రాల్లో కావలసిన అన్ని ఏర్పాట్లు అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు.
ప్రత్యేక శిక్షణపైనే ఆశలు
జిల్లాలో పదో తరగతి ఫలితాల్లో గత సంవత్సరం రాష్ట్రంలో చివరి నుంచి రెండో స్థానంతో సరిపెట్టుకోవడంతో కలెక్టర్ రఘునందన్‌రావుతో పాటు డిఈఓ రమేష్ ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 40 రోజుల ప్రణాళిక అమలు చేస్తు ముందుకుపోయారు. గత నవంబర్ 1 నుంచి జిల్లా వ్యాప్తంగా ఉదయం 8.30 నుంచి 9.30 వరకు, సాయంత్రం 4 నుంచి 5 వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించడం తో పాటు స్లీపు టెస్టులు, గ్రాండ్ టెస్టులు నిర్వహించారు. ఉదయం విద్యార్థులకు ఫోన్ చేసి నిద్రలేపడంతో పాటు వారి తల్లితండ్రులతో మాట్లాడి ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు. కావలసిన సబ్జెక్టులకు ప్రత్యేక అధ్యాపకులను నియమించి శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం జరుగు తున్న ఫ్రిఫైనల్ పరీక్షలు సైతం చాలా వరకు విద్యార్థుల మెదడుకు పదును పెడుతున్నాయి. 40 రోజుల ప్రణాళిక అంటూ ప్రత్యేక ఏర్పాట్లు చేసిన యంత్రాంగం దాని పర్యవేక్షణ మరిచిపోవడంతో పాటు ఉపాధ్యాయు లను జన గణన, గ్రేటర్ ఎన్నికల ప్రత్యేక విధులకు పంపించడంతో కొంత వరకు అనుకున్న ఫలితాలు రాలేదని ప్రచారం సాగుతుంది.
ఈ సారైన మెరుగు పడేనా..
రాష్ట్రంలో కీలకమైన రంగారెడ్డి జిల్లా పదో తరగతి ఫలితాల్లో మాత్రం ప్రథమ స్థానం సాధించలేకపోతుంది. మొదటి స్థానం సంగతి దేవుడు ఎరుగు గతేడు ఏకంగా చివరి నుంచి రెండవ స్థానంతో సరిపెట్టుకుని జిల్లా పరువును గంగలో కలిపారు. అంతకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో 2014 లో 20వ స్థానం 2013లో 21 వ స్థానం, 2012లో 15 వ స్థానం, 2011లో 20 వ స్థానంతో సరిపెట్టుకుంది. ప్రస్తుత విద్యా సంవత్సరం జిల్లా గత చేదు అనుభవాలను దూరం చేసుకోని పక్షంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల వైపు కొత్తగా విద్యార్థులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయన్న ప్రచారం జరుగుతుంది.
మెరుగైన ఫలితాలు సాధిస్తాం: ఎస్టియూ
జిల్లా విద్యాశాఖ అధికారుల ప్రత్యేక ప్రణాళికను ఉపాధ్యాయులు పక్కాగా అమలు చేయడం వలన జిల్లాలో పదో తరగతి పరీక్షలో మెరుగైన ఫలితాలు సాధిస్తామని ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.వి.సుధాకర్ తెలిపారు. జిల్లాలో ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పాఠశాలలో ఉపాధ్యాయలు చాలా శ్రమించి పనిచేయడంతో పాటు విద్యార్థుల తలిదండ్రులతో సైతం మాట్లాడి విద్యార్థులు కష్టపడి చదవడానికి పాటు పడ్డామన్నారు.