Home తాజా వార్తలు సిరీస్‌పై భారత్ కన్ను

సిరీస్‌పై భారత్ కన్ను

సిరీస్‌పై భారత్ కన్ను
గెలుపే లక్ష్యంగా ఆస్ట్రేలియా, రేపటి నుంచి గబ్బాలో చివరి టెస్టు

బ్రిస్బేన్: సిడ్నీ టెస్టులో అసాధారణ ఆటతో అలరించిన టీమిండియా శుక్రవారం నుంచి బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగే చివరి మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. కీలక ఆటగాళ్లు గాయం బారిన పడి జట్టుకు దూరమైన భారత్ మాత్రం ఆత్మవిశ్వాసంతో నాలుగో టెస్టులో బరిలోకి దిగుతోంది. కీలక ఆటగాళ్లు బుమ్రా, రవీంద్ర జడేజా, హనుమ విహారిలు ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేకుండా పోయారు. మరో స్టార్ రవిచంద్రన్ అశ్విన్ కూడా గాయంతో బాధపడుతున్నాడు. అతను బరిలోకి దిగుతాడా లేదా అనేది ఇంకా తేలలేదు. ఇక యువ ఆటగాళ్లు నటరాజన్, వాషింగ్టన్ సుందర్‌లు ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశాలు మెరుగయ్యాయి. మయాంక్ అగర్వాల్ కూడా గాయంతో సతమతమవుతుండడంతో అతని బదులు సుందర్‌ను దించినా ఆశ్చర్యం లేదు. ఇక వికెట్ కీపర్‌గా వృద్ధమాన్ సాహా ఆడడం ఖాయంగా కనిపిస్తోంది. యువ ఆటగాడు రిషబ్ పంత్‌ను ఈ మ్యాచ్‌లో బ్యాట్స్‌మన్‌గానే ఉపయోగించుకునే అవకాశాలున్నాయి. బౌలింగ్‌లో సిరాజ్, సైని, శార్దూల్‌లకు తుది జట్టులో స్థానం ఖాయంగా కనిపిస్తోంది.
ఓపెనర్లే కీలకం
ఈ మ్యాచ్‌లో భారత్‌కు ఓపెనర్లు కీలకంగా మారారు. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లు శుభారంభం అందించాల్సిన అవసరం ఎంతైన ఉంది. యువ ఓపెనర్ గిల్ అరంగేట్రం మ్యాచ్ నుంచే నిలకడైన బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా జట్టు అతనిపై భారీ ఆశలు పెట్టుకుంది. రోహిత్‌తో కలిసి మరోసారి మంచి భాగస్వామ్యాన్ని అందించాల్సిన బాధ్యత గిల్‌పై ఏర్పడింది. ఇక సీనియర్ ఓపెనర్ రోహిత్ కూడా భారీ ఇన్నింగ్స్‌పై కన్నేశాడు. ఇప్పటి వరకు ఆడిన రెండు ఇన్నింగ్స్‌లలోనూ రోహిత్ భారీ స్కోరును అందుకోలేక పోయాడు. ఈసారి మాత్రం ఆ లోటును తీర్చుకోవాలని భావిస్తున్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన రోహిత్ విజృంభిస్తే గబ్బాలో భారీ స్కోరు సాధించడం టీమిండియాకు కష్టమేమి కాదు. దీంతో అందరి కళ్లు రోహిత్, గిల్‌లపైనే ఉన్నాయని చెప్పాలి.
పుజారా, రహానెలపై భారీ ఆశలు
ఇక సీనియర్ క్రికెటర్లు చటేశ్వర్ పుజారా, అజింక్య రహానెలు కూడా ఈ మ్యాచ్‌లో మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచక తప్పదు. సిడ్నీలో పుజారా అద్భుతంగా ఆడాడు. అతని అసాధారణ బ్యాటింగ్ వల్లే టీమిండియా సిడ్నీ టెస్టును డ్రాగా ముగించగలిగింది. ఈసారి కూడా పుజారా జట్టుకు చాలా కీలకంగా మారాడు. పలువురు కీలక ఆటగాళ్లు గాయంతో జట్టుకు దూరమైన సమయంలో పుజారా బాధ్యత మరింత పెరిగింది. అతను తన సహాజసిద్ధ బ్యాటింగ్‌తో రాణించాల్సిన అవసరం ఎంతైన ఉంది. ఇక కెప్టెన్ రహానె కూడా జట్టుకు కీలకంగా మారాడు. మెల్‌బోర్న్‌లో ఒంటిచేత్తో జట్టుకు విజయం సాధించి పెట్టిన రహానె సిడ్నీలో మాత్రం పెద్దగా రాణించలేక పోయాడు. కానీ ఫలితాన్ని తేల్చే ఈ మ్యాచ్‌లో అతను తన బ్యాట్‌ను పనిచెప్పాల్సిన అవసరం ఎంతైన ఉంది. ఇటు బ్యాట్‌తో పాటు కెప్టెన్సీలో కూడా రహానె తనదైన ముద్ర వేశాడు. అద్భుత సారధ్యంతో విరాట్ లేని లోటు జట్టుపై పడకుండా చూస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. మరోవైపు మయాంక్ అగర్వాల్ కూడా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తొలి రెండు మ్యాచుల్లో అతనికి ఛాన్స్ దొరికినా ఫలితం లేకుండా పోయింది. రెండు టెస్టుల్లోనూ పేలవమైన బ్యాటింగ్‌తో నిరాశ పరిచాడు. ఈసారైన మెరుగైన బ్యాటింగ్‌తో అలరించాల్సిన బాధ్యత అతనిపై నెలకొంది. ఇందులో అతను ఎంతవరకు సఫలమవుతాడో వేచిచూడాల్సిందే.
అందరి కళ్లు పంత్‌పైనే
మరోవైపు సిడ్నీలో విధ్వంసక బ్యాటింగ్‌తో అలరించిన యువ సంచలనం రిషబ్ పంత్‌పై అందరి కళ్లు నిలిచాయి. ఈసారి పంత్ కేవలం బ్యాట్స్‌మన్‌గానే బరిలోకి దిగనున్నాడు. దీంతో అతనికి ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారింది. ఇందులో రాణిస్తే రానున్న రోజుల్లో టీమిండియాలో స్థానాన్ని పదిలం చేసుకోవడం ఖాయం. ఇక పంత్ కూడా తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. పంత్ విజృంభిస్తే ప్రత్యర్థి బౌలర్లకు ఈ మ్యాచ్‌లో కూడా కష్టాలు ఖాయమనే చెప్పాలి.
బౌలింగే అసలు సమస్య
కాగా, కీలక బౌలర్లు షమి, ఉమేశ్, బుమ్రా, జడేజా తదితరులు గాయంతో జట్టుకు దూరం కావడం టీమిండియా బౌలింగ్‌ను బలహీనంగా మార్చింది. ఈ మ్యాచ్‌లో సీనియర్ బౌలర్లు లేకుండానే భారత్ బరిలోకి దిగాల్సిన పరిస్థితి నెలకొంది. బుమ్రా తప్పుకోవడం భారత్‌కు పెద్ద లోటుగా మారింది. ఇక మరో ప్రధాన అస్త్రం అశ్విన్ కూడా బరిలోకి దిగుతాడా లేదా అనేది ఇంకా తేలలేదు. ఒకవేళ అశ్విన్ కూడా దూరమైతే కష్టాలు రెట్టింపు కావడం ఖాయం. ఇలాంటి స్థితిలో సిరాజ్, సైనిలపై జట్టు ఆధారపడక తప్పదు.
ఒత్తిడిలో కంగారూలు
తొలి టెస్టులో అద్భుత విజయం సాధించిన ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు ఆ తర్వాతి మ్యాచుల్లో పేలవంగా ఆడుతోంది. మెల్‌బోర్న్‌లో జరిగిన బాక్సింగ్‌డే టెస్టులో చిత్తుగా ఓడింది. ఇక సిడ్నీలో జరిగిన మూడో టెస్టులో గెలిచే స్థితిలో ఉండి కూడా డ్రాతోనే సరిపెట్టుకుంది. ఇలాంటి స్థితిలో భారత్‌తో జరిగే నాలుగో టెస్టు ఆస్ట్రేలియాకు సవాలుగా మారింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణిస్తేనే గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. లేకుంటే ఈసారి కూడా మ్యాచ్‌ను కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది.

IND vs AUS 4RT Test at Brisbane on Jan 15